ఆంధ్రా బ్యాంకుకు ఇదే ఆఖరి సంవత్సరం

ఆంధ్రాబ్యాంకుకు ఇవాళ(నవంబరు 28)న వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో భాగంగా ఆంధ్రాబ్యాంకును కార్పొరేషన్ బ్యాంక్‌తో యూనియన్ బ్యాంకులో విలీనం చేయనున్నారు. వచ్చే ఏప్రిల్‌లోగా ఈ తంతు పూర్తి చేస్తారు. ఇప్పటికే యూనియన్ బ్యాంకులో విలీనం చేసేందుకు ఆంధ్రా బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో గురువారం జరగనున్న వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుందిని బ్యాంక్ ఉన్నతాధికారి మీడియాకు స్పష్టం చేశారు.
ఆంధ్రాబ్యాంకును ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య కృష్ణాజిల్లా మచిలీపట్నం కేంద్రంగా 1923, నవంబర్ 20న నమోదు చేయించారు. అదే సంవత్సరం నవంబర్ 28న బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పటి నుంచి బ్యాంక్ సిబ్బంది ఏటా నవంబర్ 20నుంచి 28వరకూ బ్యాంక్ దినోత్సవ వేడుకలు జరపుకుంటున్నారు. ముఖ్యంగా నవంబర్ 24న వ్యవస్థాపకుడు పట్టాభి జన్మదినం కావడంతో నవంబర్ 28ని ఫౌండర్స్ డే గా జరుపుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం మచిలీపట్నంలో పట్టాభి సీతారమాయ్య విగ్రహానికి ఆంధ్రా బ్యాంక్ ఎండీ, సీఈవో జే పకీర్ తో పాటు, ఈడీలు నివాళి అర్పించారు. గురువారం హైదరాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో వ్యవస్థాపక దినోత్సవ సభను నిర్వహిస్తున్నారు.