బెజవాడలో హై టెన్షన్. సిటీలోని మొగల్ రాజపురంలో పోలింగ్ బూత్ లో ఈవీఎంల్లో సాంకేతిక లోపం తలెత్తింది. TDPకి ఓటు వేస్తే BJPకి పడుతుంది అంటూ ఓటర్లు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వీవీ ప్యాట్ లో చూసి కంప్లయింట్ చేశారు. వీవీ ప్యాట్ గమనించిన ఓటర్లు సంబంధిత ఆర్‌వోకు కంప్లయింట్ చేశారు. మొగల్రాజపురం శ్రీరాములు హై స్కూల్‌లోని 4వ బూత్‌లో ఈ పరిస్థితి నెలకొంది. వెంటనే బూత్ ఏజెంట్లు కూడా అభ్యంతరాలు లేవనెత్తారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఎన్నికల అధికారులు ఇచ్చిన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు, ఒక పార్టీకి ఓటు వేస్తే మరొక పార్టీకి ఓటు ఎలా పడుతుందో తమకు తెలియదని ఆర్‌వో వెల్లడిస్తున్నారు. దీంతో అక్కడ అధికారులు తాత్కాలికంగా పోలింగ్ నిలిపివేశారు. సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారులకు తెలియచేశారు. వెంటనే పోలింగ్ నిలిపివేశారు.టెక్నికల్ టీం కూడా సమస్యను పరిష్కరించటానికి రంగంలోకి దిగింది.
టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు పడుతుందన్న సమాచారం తెలిసిన వెంటనే టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బూత్ దగ్గరకు చేరుకున్నారు. ఇది కుట్ర అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అన్ని ఈవీఎంలను మార్చాలని.. మళ్లీ ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మిగతా పోలింగ్ బూతుల్లో పరిస్థితిపై ఆరా తీస్తున్నారు టీడీపీ నేతలు. బూత్ ఏజెంట్లను అలర్ట్ చేశారు. వీవీ ప్యాట్ లను సరిచూసుకోవాలని ఓటర్లను కోరుతున్నారు.