జగన్ ప్రభుత్వంపై బాబు విమర్శలు..తప్పుబట్టిన మంత్రి అనీల్

  • Publish Date - August 25, 2019 / 01:44 AM IST

జగన్‌ సర్కార్‌పై ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ చేతకానితనం మూడు నెలల్లోనే తేలిపోయిందని మండిపడ్డారు. నీరు-చెట్టు కార్యక్రమం గురించి అవగాహనలేని వైసీపీ వాళ్లంతా నానారకాలుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. కానీ ఇదే కార్యక్రమానికి దేశమంతా ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. తమ పాలనలో సమర్ధ నీటి నిర్వహణ వలన నీతి ఆయోగ్ ఏపీకి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకును ఇచ్చిందన్నారు.

కేవలం ఒక పాయింటు దూరంలో మొదటి ర్యాంకు పోయిందని చెప్పారు. మరి వైసీపీ సంగతేంటని నిలదీశారు. ఈ మూడు నెలల్లోనే కృష్ణా, గోదావరి వరదల్లో 4 జిల్లాల్లో వేలాది కోట్ల పంట నష్టం, ఆస్తి నష్టం జరగడం బాధాకరమన్నారు. నీటి నిర్వహణలో ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇదంతా జరిగిందని దుయ్యబట్టారు. టీడీపీ పాలనకు, వైసీపీ పాలనకు అదే తేడా అని చంద్రబాబు అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబును మంత్రి అనిల్‌కుమార్ తప్పుబట్టారు. వరదలపై చంద్రబాబు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ తప్పుల తడక అని మంత్రి కొట్టిపారేశారు. శ్రీశైలంలో 881 అడుగులకు నీరు చేరితేనే సీమకు నీరివ్వగలమని రాయలసీమకు 46 టీఎంసీలకు పైగా నీటిని తరలించామని తెలిపారు. చంద్రబాబు చెప్పినట్లు వరద నీరు ఒకేసారి విడుదల చేస్తే ఇప్పుడు రిజర్వాయర్లలో నీళ్లు ఉండేవి కాదన్నారు. టీడీపీ హయాంలో వరదల్లోనూ డబ్బులకు కక్కుర్తి పడ్డారని ఆరోపించారు. నది ఒడ్డున ఇల్లు కట్టుకుంటే మునగకపోతే ఏమవుతుందని ప్రశ్నించారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి రాష్ట్ర భద్రతను పట్టించుకోవడంలేదని చంద్రబాబువి డ్రామాలు, దిగజారుడు రాజకీయాలని అనిల్‌ దుయ్యబట్టారు.
Read More : ఏమయ్యాడు : ఇంకా దొరకని బీజేపీ జిల్లా అధ్యక్షుడి కుమారుడి ఆచూకీ