ఏపీలో ఎస్మా చట్టం: అతిక్రమిస్తే జైలు.. జరిమానా!

  • Publish Date - April 3, 2020 / 01:27 PM IST

కరోనా మహమ్మారి విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తీసుకువస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలల పాటు వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బందిని ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో తీసుకుని వచ్చింది. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరిస్తే వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది.

ఎస్మా పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బంది రాగా.. వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణాను కూడా ఏపీ ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి చేర్చింది. మందుల కొనుగోలు, రవాణా, తయారీ, అంబులెన్స్‌ సర్వీసులు, మంచినీరు, విద్యుత్‌ సరఫరా, భద్రత, ఆహార సరఫరా, బయో మెడికల్‌ వేస్ట్‌ను ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి తీసుకుని వచ్చింది.

ఏపీలో నానాటికీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులను దృష్టిలో ఉంచుకుని వైద్య సిబ్బందితో పాటు ఇతర అత్యవసరశాఖల ఉద్యోగులు కూడా నిరంతరం శ్రమించాల్సిన పరిస్దితి. వీరిలో ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉన్నా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కష్టం. అయితే కొందరు పనుల్లోకి రావడానికి భయపడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అత్యవసర సేవల నిర్వహణ చట్టం ఎస్మా పరిధిలోకి వైద్యంతో పాటు మరికొన్ని సేవలను తీసుకొని వచ్చింది.

వైద్య సదుపాయలతో పాటు డాక్టర్లు, నర్సులు, ఇతర సహాయక సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య పరికరాల కొనుగోలు సిబ్బంది, మందుల కొనుగోళ్లు, అమ్మకాలు, రవాణా, అంబులెన్స్ సేవలు, విద్యుత్, మంచినీటి సరఫరా, భద్రతా విభాగాలు, ఆహారం, మంచినీరు, బయోమెడికల్ వ్యర్ధాల నిర్వహణ కూడా ఎస్మా పరిధిలోకి తీసుకుని వచ్చింది ప్రభుత్వం.

ఎస్మా నిబంధనలను అతిక్రమిస్తే.. నేరశిక్షాస్మృతి (సీపీసీ)తో సంబంధం లేకుండానే పోలీసులు వారంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతోపాటు వివిధ రకాల క్రమశిక్షణ చర్యలు చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్న వారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి జైలు, జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.

కొన్ని రకాల ‘అత్యవసర సేవల నిర్వహణ’ అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూసేందుకు 1981లో రూపొందించిన చట్టం ఎస్మా చట్టం.