గ్రామ, వార్డు సచివాలయాలను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. ఇప్పటికే పరీక్షలు పూర్తి చేశారు అధికారులు. వీటి ద్వారా ప్రజలకు 237 సేవలను అందించనున్నామని సీఎం జగన్ ప్రకటించారు. 72 గంటల్లోనే 115 సేవలు ప్రజలకు అందించనున్నామని, మిగతా 122 సేవలను ఎప్పటిలోగా అందిస్తారో తెలియచేయాలని అధికారులకు సూచించారు.
అక్టోబర్ 02వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
దీనిపై సీఎం జగన్..సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నాలుగు నెలల వ్యవధిలోనే 4 లక్షలకు పైగా నియామకాలు చేయగలిమని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించారంటూ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఫిర్యాదులు, సమస్యలను తెలియచేయడానికి 1902 కాల్ సెంటర్ సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే…మౌలిక వసతులపై సీఎం జగన్ ఆరా తీశారు. 72 గంటల్లోగా సమస్యను పరిష్కరించడానికి అవసరమైన విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. డేటా సెంటర్ కూడా ఉండాలని, సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై పర్యవేక్షణ చాలా ముఖ్యమైందని, నాలుగు లక్షల మందితో పనిచేయించుకోవడం చాలా ప్రాధాన్యత అంశంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఏ పథకాన్ని కూడా సాంకేతిక కారణాలతో నిరాకరించవద్దని సీఎం జగన్ సూచించారు.