బాలయ్య చిన్నల్లుడిపై ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్: కారణం ఇదే

  • Published By: vamsi ,Published On : August 25, 2019 / 12:24 PM IST
బాలయ్య చిన్నల్లుడిపై ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్: కారణం ఇదే

Updated On : August 25, 2019 / 12:24 PM IST

అసలే ఎన్నికల్లో ఓడిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి పార్టీ నేతలు పార్టీని విడిచి వెళ్తుండడం తలనొప్పిగా మారి ఉంటే.. మరోవైపు నేతలపై కేసులు ఇబ్బందిగా తయారైంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా తెలుగుదేశం పార్టీ యువ నేత, నందమూరి బాలకృష్ణ రెండవ అల్లుడు భరత్.. జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో సంచలనం రేపుతున్నాయి.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున వైజాగ్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన భరత్ లేటెస్ట్‌గా ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ వస్తేనే టీడీపీకి మంచి జరుగుతుందని అనుకోవట్లేదు.. మాకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు. ఎందుకు అవసరం చెప్పండి. మేం బాగానే ఉన్నాం కదా. అసలు ఎన్టీఆర్‌ను మేం ఎందుకు కోరుకుంటాం. ఇప్పటివరకు మేం నడిపిన పార్టీ, మా నాయకులు పనికిరాకుండా ఉన్నారా? అలాంటిదేం లేనప్పుడు ఎన్టీఆర్‌ను ఎందుకు కోరుకుంటాం.” అంటూ మాట్లాడారు.

ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్‌ను కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఉంది కదా అనే ప్రశ్నకు అలాంటిదేం లేదు. ఎన్టీఆర్‌కు చాలామంది పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్లలో ఒకరే, ఆయనను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. ఎన్టీఆర్ అవసరం టీడీపీ అవసరం లేదంటూ.. పెద్ద ఎన్టీఆర్ వచ్చినపుడు అంతా కొత్తవాళ్లతోనే పార్టీని నిర్మించారంటూ చెప్పుకొచ్చాడు.

అయితే భరత్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీలోని ఒక వర్గం.. ఎన్టీఆర్ అభిమానులు భరత్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా భరత్‌పై ఫైర్ అవుతున్నారు.