జగన్ వ్యక్తిగత హాజరు పిటీషన్ స్వీకరించిన సీబీఐ కోర్టు

  • Publish Date - September 20, 2019 / 11:10 AM IST

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేశారు. తాను ఇప్పుడు ముఖ్యమంత్రి విధుల్లో ఉన్నానని, అధికారిక పనుల్లో బిజీగా ఉండడం వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ తన పిటీషన్ లో కోరారు. ఈ క్రమంలో జగన్ పిటీషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. తన తరఫున కోర్టుకు న్యాయవాది జి.అశోక్‌ రెడ్డి హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తన పిటీషన్ లో కోరారు.

గతంలో హైకోర్టు కొట్టివేసిన పిటీషన్ ను ఎలా విచారించాలి అని కోర్టు అడగగా.. మారిన పరిస్థితుల్లో పిటీషన్ పై విచారణ చేపట్టాలని జగన్ తరపు న్యాయవాది వాదించారు. ఏపీ ముఖ్యమంత్రిగా పరిపాలన వ్యవహారాలు చూడాలని, ఎక్కువ సమయం అధికారిక విధులకు కేటాయించవలసిన కారణంగా వ్యక్తిగత హాజరు కాలేరని జగన్ తరపు న్యాయవాది వాదించారు.

అంతేకాదు సీఎంగా కోర్టుకు హాజరు కావాలంటే ఖర్చు ఏపీ ప్రభుత్వం భరించాలని, వాస్తవానికి ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్‌లో వివరించారు. జగన్ తరపు న్యాయవాది వాదనలు విన్న సీబీఐ కోర్టు పిటీషన్ ను స్వీకరించింది. అంతకుముందు మాత్రం జగన్ పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది.