కోట్లకు కుచ్చుటోపీ : తులసి పేరుతో రైతుల్ని ముంచేసారు

తులసి పంట పేరుతో భారీ మోసం
జైకిసాన్ కంపెనీ పేరుతో కోట్ల రూపాలు వసూలు
మోసపోయిన 1200ల మంది రైతులు
ఎకరానికి రూ.70వేల నష్టం
వందల ఎకరాల్లో తులసి పంట సాగు
ప్రకాశం : జౌషదాల తులసి పేరుతో రైతులను నిలువునా ముంచేసింది ఓ కంపెనీ. అసలే నకిలీ విత్తనాలు…నకిలీ ఎరువులు..గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతులను మరో కంపెనీ తులసీ పంట పేరుతో నిలువునా ముంచేసింది. సంప్రదాయ పంటలు వేసి నష్టాలపాలవ్వటం కంటే తులసి పంటను వేస్తే మంచి లాభం వస్తుందని..తులసి పంట సాగుచేస్తే తామే కొంటామనీ, భారీ లాభాలు వస్తాయని రైతులకు ఆశచూపింది. ఈ పంటకు సంబంధించిన వీడియోలు చూపించి అధిక లాభాలొస్తాయని ప్రకాశం జిల్లాలోని 1200ల మంది రైతులను నమ్మించి సదరు కంపెనీ బుట్టలో వేసుకుంది జైకిసాన్ అనే కంపెనీ. దీంతో ఆ కంపెనీ నుండి విత్తనాలను కొన్న తరువాత దుకాణం సర్దేసింది జైకిసాన్ అనే మోసాల కంపెనీ. దీంతో రైతులంతా లబోదిబోమని విలపిస్తున్నారు.
అద్దంకి ప్రాంతానికి చెందిన బల్లికురువ, కొరిసిపాడు మండలాల రైతులను జైకిసాన్ అనే ఓ ప్రైవేటు కంపెనీ ప్రతినిధులు కలిసి తమ కంపెనీ స్పెషలిస్ట్ ల పర్యవేక్షణలో తులసి విత్తనాలను గ్రేడ్ చేశామనీ..ఈ విత్తనాలతో సాగుచేస్తే భారీగా లాభాలు వస్తాయనీ..కలుపు..చీడ పీడల బెడద ఉండదనీ..సంవత్సరాలనికి రెండు సార్లు పంట చేతికొస్తుందనీ..కరాకు రూ.48,000-రూ.60,000 ఆదాయం వస్తుందని నమ్మించారు. తామే పంటను కొంటామని కంపెనీ ఆశపెట్టడంతో వందల ఎకరాల్లో తులసి పంటను సాగు చేశారు. అయితే పంట చేతికి వచ్చిన సమయానికి అద్దంకిలో కంపెనీ దుకాణం సర్దేసి మకాం మార్చేసింది…సెల్ ఫోన్ నంబర్లన్నీ అవుటాఫ్ కవరేజ్ అయిపోయాయ్.దీంతో ఏం చేయాలో తెలియని రైతులు వారి కోసం వెతకటం ప్రారంభించారు. చివరికి హైదరాబాద్ లోని ఓ ఇంటిలో సదరు కంపెనీ యజమానిని పట్టుకుని నిలదీయగా, తాము రెండు రోజుల్లో వచ్చి పంటను కొంటామని మరో అబద్ధం చెప్పారు. ఎకరాకు రూ.20 వేలు మాత్రమే ఇస్తామనీ..ట్రాన్స్ పోర్ట్ చార్జెస్ మీరే పెట్టుకోవాలనీ మరోసారి నమ్మించటం..రైతులు మరోసారి మోసం పోవటం జరిగాయి. ఇంత జరిగినా రైతులు మళ్లీ నమ్మటంతో ఈసారి కూడా జైకిసాన్ కంపెనీ వ్యక్తి హైదరాబాద్ లో కూడా దుకాణం సర్దేసి..ఇంటిని సైతం ఖాళీ చేసేశాడు.
దీంతో జైకిసాన్ సంస్థతో పాటు తమను మోసం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు అద్దంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70వేల వరకూ నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.