నెలకు రూ.8వేలు రాని షాపులకు రూ.80వేల అద్దె

  • Publish Date - December 16, 2019 / 05:15 AM IST

ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాలు సాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం మద్యపాన నిషేధం అంశంపై తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం బెల్టు షాపులు మాదిరి మొబైల్ మద్యం షాపులు వచ్చాయని విమర్శించారు. సంతలో కూరగాయలు అమ్మినట్లు మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు.

బ్రాందీ షాపుల నుంచి బారుల్లోకి మద్యం విచ్చలవిడిగా వెళ్తుందని అభిప్రాయపడ్డారు. బ్రాందీ షాపులకు బారులకు మద్యం రేట్లలో తేడా ఉండడం వల్లే ఇది జరుగుతుందని అన్నారు. ఇక ప్రభుత్వం చర్యల వల్ల రాష్ట్రంలో నాటు సారా పెరిగిపోయిందని, ధరలు ఎందుకు పెంచారో ప్రభుత్వం చెబుతున్న సమాధానం కరెక్ట్ కాదని అన్నారు.

మద్యం వాడకం తగ్గించడానికి రేట్లు పెంచినట్లు చెబుతున్న ప్రభుత్వం ఆర్టీసీ టిక్కెట్లను ఎందుకు పెంచిందో చెప్పాలని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వినియోగం తగ్గించడానికే ఈ చర్య చేపట్టిందా? ప్రభుత్వం అని ప్రశ్నించారు.

ధరలు పెంచడం వల్ల రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గిందా? అని ప్రశ్నించారు. జే ట్యాక్స్ వల్లే రాష్ట్రంలో ధరలు పెరుగుతున్నాయని అన్నారు రామానాయుడు. మద్యం షాపుల కోసం రూ. 8వేలు కూడా అద్దె లేని వాటికి రూ.80వేల వరకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తుందని రామానాయుడు అన్నారు.