అమరావతికి స్మిత సపోర్ట్: త్వరలో కలిసి పోరాడుతా.. హీరో కూడా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అంశంపై ఆగ్రహావేశాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రైతులు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు 24వ రోజుకు చేరుకుంది. నిరసనల్లో భాగంగా ఇవాళ(10 జనవరి 2020) తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో రైతులు, యువకులు, మహిళలు ఆందోళనలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఈ ఉద్యమానికి పలువురు సినీ సెలబ్రిటీల నుంచి మద్దతు లభిస్తుంది.
ఇప్పటివరకు ఈ విషయంలో పట్టనట్లుగా ఉన్న సినిమా వాళ్లు.. ఇప్పుడిప్పుడే రాజధాని రైతులకు మద్దతు ఇస్తున్నారు. లేటెస్ట్‌గా సింగర్ స్మిత ట్విట్టర్ ద్వారా రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు. రాజధాని తరలింపు చాలా బాధాకరమని, రైతుల వేదన చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని అన్నారు. రైతుల బాధ తట్టుకోలేనిదని ఆమె అభిప్రాయపడ్డారు. రైతులపై సానుభూతి చూపించకుండా మాకేంటిలే అనుకునే వాళ్లను చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బాధను పంచుకుంటూ వారికి న్యాయం చేయాలని దేవుడ్ని పార్థిస్తున్నానని అన్నారు. అమరావతి రైతులకు అండగా ఉంటానని అన్నారు.
అలాగే రాజధాని ఆందోళనలపై హీరో నారా రోహిత్ కూడా స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. విభజనతో జీవచ్ఛవంలా మిగిలిన రాష్ట్రానికి.. ప్రాణసమానమైన భూముల త్యాగం చేసి అమరావతి రూపంలో ప్రాణం పోశారు. మీ ఔదార్యంతో అమరావతిలో పాలనకు బాటలు వేశారు. ఆ మార్గం చెదిరిపోకూడదని 23 రోజులుగా మీరు చేస్తున్న పోరాటం భావితరాలకు స్పూర్తిదాయకం. మీ ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా మొక్కవోని దీక్షతో ముందడుగు వేస్తున్నారు. మీ పోరాటం వృథా కాదు. త్వరలో మీతో కలిసి మీ పోరాటంలో పాలుపంచుకుంటాను.’ అని నారా రోహిత్ అన్నారు.