ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ జరిగిందనే విషయం బయటపడడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇది సంచలనం రేపుతోంది. వైసీపీ పెట్టిన కేసుపై తెలంగాణ సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. విచారణలో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. మార్చి 04వ తేదీ సోమవారం ఎలాంటి పరిణామాలు జరిగాయో క్లుప్తంగా…
* ఈ కేసుపై అధికార పార్టీ పలు ఆరోపణలు గుప్పిస్తోంది. తమ పార్టీకి సంబంధించిన డేటాను తస్కరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. మంత్రులు కూడా ఇదే విధంగా స్పందిస్తున్నారు. తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానిస్తే..అందుకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి నారా లోకేష్.
* బాబు అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే వైసీపీ ఆడుతున్న నాటకంలో టీఆర్ఎస్ పాత్ర పోషిస్తోందని దుయ్యబట్టారు. తన దగ్గరకు వస్తే మాత్రం ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురూ కలిసినా ఏమి జరగదన్నారు. వైసీపీకి కన్సల్టెంట్‌గా ఉన్న పీకేపై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తోక కట్ చేస్తానని చెప్పిన బాబు 8 లక్షల ఓట్లు తొలగించారని.., తన ఓటును కూడా తొలిగిస్తారేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు.
* మరోవైపు ఓట్లను తొలగింపులో అధికార టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. అక్రమంగా ఓట్లను తొలగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈసీ హెచ్చరించింది. ఇదిలా ఉంటే టీడీపీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీని వీడారు. ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం తెలియరాలేదు.
* ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెల్లూరులో పర్యటిస్తున్నారు. పార్టీ క్యాడర్‌కు పలు సూచనలు చేశారు. ప్రజలకు మంచి చేసేందుకు జనసేన పార్టీ స్థాపించినట్లు..పార్టీ సిద్దాంతాలు నచ్చితేనే పార్టీలో చేరాలని సూచించారు. రానున్న రోజుల్లో విమర్శలు..ఆరోపణలు మరింత పదునెక్కే అవకాశం ఉంది.