ఆగస్ట్ నాటికి దేశంలో 20లక్షల కరోనా కేసులు: రాహుల్ గాంధీ

  • Publish Date - July 17, 2020 / 08:35 AM IST

దేశంలో కరోనా రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారత్‌‌లో కోవిడ్ -19 కేసుల సంఖ్య మిలియన్ దాటింది. అలాగే, దేశంలో కరోనా రికవరీ రేటు కూడా పెరగడం కాస్త ఊరట కలిగించే విషయం. ఇదే సమయంలో 24,915 మంది కరోనా కారణంగా చనిపోయారు. చికిత్స తర్వాత 6,12,815 మంది కరోనా వైరస్ సంక్రమణ నుంచి కోలుకున్నట్లుగా మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే, ప్రతిరోజూ దేశంలో 30 వేలకు పైగా కొత్త కరోనా సోకిన రోగులు వస్తున్నారు. Covid19india.org ప్రకారం, దేశంలో ఒక మిలియన్ మందికి పైగా కరోనా వైరస్ రోగులు నమోదవగా.. అదే సమయంలో దేశంలో కరోనా రికవరీ రేటు 63.25 శాతానికి చేరుకుంది.

ఇదిలావుండగా, శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీ ట్వీట్ చేసి ఆగస్టులో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్యను అంచనా వేశారు. రాహుల్ గాంధీ ప్రకారం, ఆగస్టులో భారతదేశంలో 2 మిలియన్ల మంది కరోనా బారిన పడతారు. జూలై 14వ తేదీన, కరోనా రోగుల సంఖ్య 9 లక్షలు దాటినప్పుడు, రాహుల్ గాంధీ ఈ వారంలో 10 లక్షల కరోనా కేసులు దాటుతాయని అంచనా వేశారు.

ఈ క్రమంలోనే ఉదయం రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 10లక్షల కేసులు మించిపోయాయి. #COVID-19 వేగంగా వ్యాప్తి చెందడంతో, ఆగస్టు 10 నాటికి దేశంలో 20లక్షల మందికి పైగా కరోనా సోకుతుందని, అంటువ్యాధిని ఆపడానికి ప్రభుత్వం దృఢమైన, ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా ప్రారంభం నుంచి రాహుల్ గాంధీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు.