అల్లుడే యముడు: ట్యాబ్లెట్‌లో సైనైడ్ పెట్టి చంపిన మేనేజర్

అల్లుడే యముడు: ట్యాబ్లెట్‌లో సైనైడ్ పెట్టి చంపిన మేనేజర్

Updated On : February 3, 2020 / 3:52 PM IST

బ్యాంకులో మేనేజర్.. లక్షల్లో కట్నం.. ఇంకేం కూతురి జీవితం వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదనుకున్నారు. కాలం ఆ వివాహిత జీవితాన్ని కాటేసింది. పెళ్లి జరిగిన కొన్నేళ్లకే అల్లుడే కూతురు పాలిట యముడైయ్యాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె వివాహిత మృతి వెనుక నిజాలు బయటపెట్టారు పోలీసులు. రోజుకో మలుపు తిరిగిన కేసులో చిక్కుముళ్లను బ్రేక్ చేశారు. సైనైడ్‌ ప్రయోగం వల్లే ఆమె మృతి చెందినట్లు పోస్టుమార్టమ్‌ నివేదికలో వెల్లడైంది. భర్త రవి చైతన్యే ఆమెను హత్య చేసినట్లు తేలింది.

వివరాల్లోకి వెళితే.. మదనపల్లె శేషప్పతోటలో నివాసం ఉంటున్న బరోడా బ్యాంకు మేనేజర్‌ చేబోలు రవిచైతన్య భార్య ఆమని జనవరి 27న ఉదయం ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. బాత్రూమ్‌లో కిందపడి పోయి ఉందని పక్కింటి వారు ఫోన్‌ చేయగా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు చెప్పాడు. డాక్టర్లు ప్రథమ చికిత్స అందించినా కోలుకోకపోవడంతో, మెరుగైన వైద్యం కోసం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో వైద్యులు ప్రథమ చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందింది. 

విషయం తెలియగానే తల్లిదండ్రులు లక్ష్మీదేవి, జోగి నాగేంద్రరావు కృష్ణా జిల్లా నుంచి మదనపల్లెకు చేరుకున్నారు. మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని 2 టౌన్‌లో ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి హతమార్చారని, బాత్‌రూంలో పడి చనిపోయినట్లు చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమని పేరెంట్స్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

మరుసటి రోజు పోస్టుమార్టమ్‌ నివేదికలో సైనైడ్‌ ఇవ్వడంతోనే చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించడంతో నిందితుడు రవిచైతన్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో తానే సైనైడ్‌ తాగించినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. భార్యకు విషమిచ్చి చంపాల్సిన అవసరం ఎందుకొచ్చింది.. సైనైడ్‌ ఎక్కడి నుంచి తీసుకురాగలిగాడనే నిజాలు తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు.  

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన రవిచైతన్య.. మదనపల్లె బరోడా బ్యాంకు మేనేజర్‌గా పని చేసేవాడు. 2015లో ఆమనితో వివాహమైంది. బ్యాంకు మేనేజర్‌ ఉద్యోగం కావడంతో లక్షల్లో కట్నమిచ్చి వివాహం చేశారు ఆమని తల్లిదండ్రులు. ఆ తర్వాత ఇంకా డబ్బులు అవసరమున్నాయంటూ అల్లుడు అడగటంతో.. కూతురి కోసం పలుమార్లు డబ్బులిచ్చారు. మూడేళ్ల పాటు వారి కాపురం సజావుగా సాగింది. 

కొంత కాలంగా రవిచైతన్య అదనపు కట్నమంటూ నిత్యం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసి భార్య…అతడిని నిలదీసింది. ఓ వైపు అడిగినంత డబ్బు తీసుకురాలేదని.. మరోవైపు తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన రవి చైతన్య అంతమొందించాలనుకున్నాడు. సమయం కోసం ఎదురుచూశాడు. 

కొంతకాలంగా విటమిన్‌-బి సమస్యతో బాధపడుతోంది. ఆ సమస్యనే హతమార్చేందుకు ఉపయోగించుకున్నాడు. ఆన్‌లైన్‌లో సైనైడ్‌ లక్షణాలు గల పొటాషియం నైట్రేట్‌ను తెప్పించాడు. ఆ సైనైడ్‌ను బీ-కాంప్లెక్స్‌ మాత్రలో పెట్టి భార్యకు ఇచ్చాడు. భర్త పన్నాగాన్ని పసిగట్టని ఆమని…ఆ టాబ్లెట్‌ వేసుకుంది. కొద్ది సేపటికే  స్పృహ తప్పి పోయింది. హత్యను..ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. బాత్రూమ్‌లో కిందపడి పోయిందంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. 

మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదులో అనుమానం నిజమై భర్తే చంపినట్లు తేలింది. నిందితుడు సైతం నేరం అంగీకరించడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అదనపు కట్నం వేధింపుల కేసు కింద అతడి తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. భార్యను..భర్త విషమిచ్చి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి కుటుంబసభ్యులే కాదు…స్థానికులు సైతం డిమాండ్‌ చేశారు.