రూట్ మార్చిన స్మగ్లర్లు : ఆటబొమ్మలతో గంజాయి రవాణా

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 05:55 AM IST
రూట్ మార్చిన స్మగ్లర్లు : ఆటబొమ్మలతో గంజాయి రవాణా

Updated On : January 9, 2020 / 5:55 AM IST

గంజాయి రవాణా చేసే స్మగ్లర్లు పోలీసులకు చిక్కకుండా ఉండటానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. చిన్నారులు ఆడుకునే ఆటబొమ్మల్లో గంజాయిని నింపి రవాణా చేస్తున్నారు. అయినా భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు చాకచక్యంగా పట్టేసుకున్నారు. ఎప్పటికప్పుడు గంజాయి స్మగ్లర్లు రూట్ మారుస్తున్నారు. కొత్త కొత్తగా ఆలోచిస్తూ గంజాయి రవాణాను కొనసాగిస్తున్నారు. కానీ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న పోలీసులు స్మగ్లర్ల ఆకట్టిస్తున్నారు. 

గంజాయి సరఫరా చేసే ఘరానా మోసగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మకింద గంజాయి ప్యాకెట్లను రవాణా చేస్తున్నారు. బూర్గంపాడు మండలం సారపాక సెంటర్లో కరీంనగర్ కు సరఫరాచేస్తున్న 180 కిలోలకు పైగా గంజాయిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద పెద్ద ఆటబొమ్మలతో వెళ్తున్న వారిపై పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనిఖీలు చేశారు.

దీంతో వెదురు గంపల్లో ఆటబొమ్మల కింద పెద్దపెద్ద మూటలలో కూడా గంజాయిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. అనంతరం గంజాయి తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఒకరు పరారవ్వగా..ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీని వెనకలా ఎవరు ఉన్నారు? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.