ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకోగా విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఇంగ్లీష్ మీడియం నిర్ణయంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మీడియం బోధనకు టీడీపీ వ్యతిరేకం కాదని, ఇంగ్లీష్ మీడియం విషయంలో తెలుగుదేశం పార్టీపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని అన్నారు చంద్రబాబు.
ఇంగ్లీష్ భాషకి టీడీపీ వ్యతిరేకం కాదని, తెలుగు మీడియంను కొనసాగిస్తూనే ఇంగ్లీష్ మీడియంను ప్రేవేశపెట్టాలనేది తమ డిమాండ్ అని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూనే ఇంగ్లీష్ మీడియంను తీసుకుని వచ్చేందుకు కృషి చేసిందని గుర్తు చేశారు చంద్రబాబు. మాతృ భాష తెలుగును కాపాడాలనేదే టీడీపీ విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ప్రతిభా అవార్డులకు అబ్దుల్ కలాం పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టాలని చూశారని మండిపడ్డారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో వైసీపీ తోక ముడిచిందని గుర్తు చేశారు. వైసీపీ నేతల రెండు నాల్కల ధోరణిని ప్రజా క్షేత్రంలో ఎండ గట్టాలని చంద్రబాబు కోరారు. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షణకు తెలుగు కావాలని, వృత్తిలో రాణించేందుకు మాత్రం ఇంగ్లీష్ కావాలని అన్నారు.