నమో నరసింహ స్వామి : యాదాద్రి బ్రహ్మోత్సవాలు

  • Publish Date - March 8, 2019 / 02:05 AM IST

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 08వ తేదీ నుండి మార్చి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మొత్తం 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు, అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్చి 08వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ చేసి, స్వస్తివాచనం, రక్షా బంధనం చేస్తారు. మార్చి 9వ తేదీ దేవతాహ్వానం పలుకుతారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. సుమారు 40 మంది రుత్విక్కులకు ఆహ్వానాలు పంపారు. ఆలయంలో హోమగుండం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా యాగశాల నిర్మాణం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. దీనితో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు చలువ పందిళ్లు వేశారు. హై స్కూల్ మైదానంలో స్వామివారి కళ్యాణం జరుగనుంది. 

* బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి ఈ నెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు వారం రోజుల పాటు అలంకార, వాహన సేవలు నిర్వహిస్తారు.
* మార్చి 10వ తేదీ ఉదయం మత్స్యావతారం అలంకార సేవ, రాత్రి 9గంటలకు శేష వాహనసేవ ఉంటుంది.
* మార్చి 11న ఉదయం 11గంటలకు శ్రీ కృష్ణాలంకార సేవ, రాత్రి 9గంటలకు హంస వాహనసేవ జరుగనుంది.
* మార్చి 12వ తేదీ ఉదయం 11గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 9గంటలకు పోన్న వాహన సేవ నిర్వహిస్తారు. 
* మార్చి 13న ఉదయం 11గంటలకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహ వాహన సేవ ఉంటుంది. 
* మార్చి 14న ఉదయం 11 గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 9గంటలకు అశ్వవాహన సేవ, రాత్రి 9 గంటలకు స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తారు. 
* మార్చి 16వ తేదీ ఉదయం 11గంటలకు శ్రీ మహావిష్ణు అలంకార సేవ, రాత్రి స్వామి వారి దివ్యవిమాన రథోత్సవం ఉంటుంది.