US Elections 2024: మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్‌కు షాకిచ్చిన నోబెల్ గ్రహీతలు

కమలా హారిస్ పై ట్రంప్ మరోసారి వ్యక్తిగత విమర్శలు చేశారు. హారిస్ అధికారంలోకి వస్తే చైనా ఆమెను చిన్న పిల్ల మాదిరి ఆడేసుకుంటుందంటూ సెటైర్లు వేశారు.

Kamala Harris and Donald Trump

US Presidential elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. నవంబరు 5న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత నెలరోజులుగా వీరిద్దరూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అధికశాతం సర్వేలు కమలా హారిస్ స్వల్ప తేడాతో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఖాయమని చెబుతుండగా.. మరికొన్ని సర్వేలు ట్రంప్, హారిస్ మధ్య హోరాహోరీ పోరు ఖాయమని, ఎవరు విజయం సాధించిన స్వల్ప తేడానే ఉంటుందని చెబుతున్నాయి. మరికొన్ని సర్వే సంస్థలు ట్రంప్ విజయం సాధిస్తాడని చెబుతున్నాయి.

Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 2 వారాల సమయం.. ట్రంప్, కమలా హారిస్‌లో ఎవరు ముందంజలో ఉన్నారు?

ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన సర్వేలో కమలా హారిస్ కంటే డొనాల్డ్ ట్రంప్‌ కాస్త ముందంజలో ఉన్నట్లు తేలింది. ట్రంప్ నకు 47శాతం, హారిస్ కు 45శాతం మంది ఆదరణ లభిస్తుందని, సర్వే మార్జిన్ ప్లస్ లేదా మైనస్ 2.5శాతం ఉండొచ్చని వాల్ స్ట్రీట్ సర్వే అంచనా వేసింది. తాజాగా ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. 23 మంది నోబెల్ గ్రహీతలు కమలాహారిస్ ప్రణాళికకు కితాబిచ్చారు. ఇటీవల నోబెల్ బహుమతి పొందిన సిమస్ జాన్సన్, డారెన్ ఏస్మోగ్లులు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ఈ మేరకు వారంతా కలిసి ఓ లేఖనుసైతం విడుదల చేశారు.

Also Read: ఇరాన్ అర్మాన్‌ వర్సెస్ ఇజ్రాయెల్‌ థాడ్‌..! పశ్చిమాసియాలో ఇక రక్తపాతమేనా?

వివిధ ఆర్థిక విధానాల వివరాలపై మనలో ప్రతిఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. మొత్తం హారిస్ ఆర్థిక ఎజెండా అమెరికా అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఆరోగ్యం, పెట్టుబడి, సుస్థిరత, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చతుందని, ప్రతికూల ఆర్థిక వ్యవస్థ కంటే గొప్పగా ఉంటుందని మేము నమ్ముతున్నామని పేర్కొన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే.. హారిస్ విధానాలు మరింత పటిష్టమైన, మరింత స్థిరమైన ఆర్థిక వృద్ధితో బలమైన ఆర్థిక పనితీరును కలిగిస్తాయని లేఖలో వారు పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. కమలా హారిస్ పై ట్రంప్ మరోసారి వ్యక్తిగత విమర్శలు చేశారు. హారిస్ అధికారంలోకి వస్తే చైనా ఆమెను చిన్న పిల్ల మాదిరి ఆడేసుకుంటుందంటూ సెటైర్లు వేశారు. ఓ బిగినర్ తో గ్రాండ్ మాస్టర్ గమ్ ఆడుకుంటున్నట్లుగా బీజింగ్ ప్రవర్తన ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు.