AP Rains: ఏపీకి మరో వాన గండం పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని కేంద్రీకృతమైంది. ఇది రాగల 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ద్రోణి కొనసాగుతోంది.
ఈ నెల 19 మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల మధ్య దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రెండు రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.(AP Rains)
ఏలూరు, ఎన్టీఆర్, ఉభయ గోదావరి, కోనసీమ, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, గుంటూరు, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉందంది. (AP Rains)
ఇటు తీరం వెంబడి 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ చెప్పారు. (AP Rains)
ఇప్పటికే విశాఖలో భారీ వానలు కురుస్తున్నాయి. ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. అల్పపీడనం రేపు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసినా.. అల్పపీడనం ఇవాళే ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే ఉదయం నుంచి విశాఖలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది.
ఉదయం నుంచి కురుస్తున్న వానతో విశాఖలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భారీ వానలు పడే అవకాశం ఉండటంతో అధికారులు అలర్ట్ అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు మూడు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు.(AP Rains)
అల్పపీడనం ప్రభావంతో దాదాపు 5 రోజుల నుంచి దక్షిణ కోస్తాంధ్రలోని అన్ని జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. 20 నుంచి 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని జిల్లాల్లో 20 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.