Cyclone Fengal Alert (Photo Credit : Google)
Cyclone Fengal : తెలుగు రాష్ట్రాలకు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. తూర్పు హిందూ సముద్రం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో రేపు వాయుగుండగం బలపడే అవకాశం ఉంది. రానున్న 48 గంటల్లో తుపానుగా మారనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ తుపానుకి ఫెంగాల్ గా నామకరణం చేసింది ఐఎండీ. ఆ తర్వాత వాయవ్య దిశగా కదులుతూ రెండు రోజుల్లో తమిళనాడు శ్రీలంక తీరాలవైపు వెళ్లే అవకాశం ఉందని తెలిపింది.
ఇక వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. పంట పొలాల్లో నిలిచిన అదనపు నీరు బయటకు పోయేలా రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు.
ఇక, తెలంగాణలోనూ మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్ డేట్ ఇచ్చింది. తెలంగాణలో ఈ నెల 29వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. మరోవైపు తెలంగాణలో చలితీవ్రత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో రెండు మూడు రోజులుగా చలితీవ్రత పెరిగింది. దీంతో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది.