Cyclone Montha: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి వాయుగుండం పోర్ట్ బ్లెయిర్ కి 510 కిలోమీటర్లు, చెన్నైకి 890 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 920 కిలోమీటర్లు, కాకినాడకి 920 కిలోమీటర్లు, గోపాల్‌పూర్ కి 1000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.
ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం ఉదయానికి తుపానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడుతుందని వివరించారు. మంగళవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.
తుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సీఎం ఆదేశాలతో ముందస్తు సహయక చర్యల కోసం 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాల్లో సిద్ధంగా ఉంచామన్నారు. ఇప్పటికే ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగానికి తుపాను ఎస్వోపి ( స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) అమలుపై సూచనలు ఇచ్చామని ప్రఖర్ జైన్ తెలిపారు.
సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడనున్నందున నదులు, సముద్ర తీరాల్లో చేపలు పట్టడం, అన్ని బోటింగ్ కార్యకలాపాలు బుధవారం వరకు నిలిపివేయాలన్నారు. అలాగే బీచ్‌లకు పర్యాటకుల ప్రవేశం కుడా నిషేధించాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. ప్రజలు సోషల్ మీడియా వదంతులను నమ్మొద్దన్నారు. అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమాచారం, సాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ లోని టోల్ ఫ్రీ నెంబర్లు (112, 1070, 18004250101) సంప్రదించాలన్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలన్నారు. తుపాను సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దన్నారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.
* రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
* మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం.
సోమవారం(27-10-25) :
* బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.
* కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
మంగళవారం (28-10-25) :
* కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.
* ఉత్తరాంధ్ర, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.