Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలో కుండపోత వాన కురుస్తోంది. శేరిలింగంపల్లి కాజాగూడలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీనగర్ కాలనీ అమీర్ పేట్ ప్రాంతంలో 10 సెంటీమీటర్లు, ఖైరతాబాద్, ఉప్పల్, సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, కార్వాన్, మలక్ పేట్, జూబ్లీహిల్స్, చందానగర్ సర్కిల్ పరిధిలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి చేరింది. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. నగరంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల నరకం చూస్తున్నారు. కిలోమీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. చాదర్‌ఘాట్ నుండి ఎల్బీనగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
హైదరాబాద్ శివార్లలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్దఎత్తున వరద సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రాత్రంతా వర్షం పడే సూచనలున్నందున ప్రజలెవరూ బయటకు రావొద్దని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. నీళ్లు నిలిచే ప్రాంతాలను మ్యాపింగ్ చేసి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.
హైదరాబాద్ నగరంలోని 140 వార్డుల్లో 2 సెంటీమీటర్ల కంటే అదనంగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 76 ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. 6 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సాయం కోసం ఈ నెంబర్లకు 040 2302813, 7416687878 కాల్ చేయాలన్నారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రెవెన్యూ విభాగం అధికారులకు సెలవులు రద్దు చేశారు.
భారీ వర్షం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో డీజీపీ, విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.