Rains: హైదరాబాద్ వెదర్ అప్‌డేట్.. ఈ వానలు ఇంకెన్నాళ్లు? ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ..

హయత్ నగర్, హిమాయత్ నగర్, బండ్లగూడ ప్రాంతాల్లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Heavy Rains

Rains: తెలంగాణలో రానున్న 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దాంతో పాటు బలమైన గాలులు వీస్తాయని చెప్పింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది. ఈ జిల్లాల పరిధిలో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వాన పడే ఛాన్స్ ఉంది.

అటు శుక్రవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. కుండపోత వాన కురిసింది. మారేడ్ పల్లిలో 7.6 సెంటీమీటర్లు, మల్కాజ్ గిరిలో 7.35 సెంటీమీటర్లు, ఉప్పల్ లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్, బండ్లగూడ, బాలానగర్, అంబర్ పేట్, సైదాబాద్ ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. హయత్ నగర్, హిమాయత్ నగర్, బండ్లగూడ ప్రాంతాల్లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్ నగరంలో మరో 3 రోజుల పాటు వానలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. 19వ తేదీన నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 20వ తేదీన నగరంలోని పలు చోట్ల మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉంది. 21వ తేదీన మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Also Read: రెయిన్ అలర్ట్.. ఏపీలోని ఆ జిల్లాల్లో ఇవాళ, రేపు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు