2 రోజుల ముందుగానే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు..! ఎండలు మండిపోవడానికి కారణమిదే..

జూన్ నెలలో కూడా 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్నారు.

Southwest Monsoon : రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. రేపు (మే 30) రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ నరేశ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. కేరళ నుంచి నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా ఉత్తరాది రాష్ట్రాలకి విస్తరిస్తాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయన్నారు భారత వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ నరేశ్.

దేశంలో వాతావరణ పరిస్థితులపై నరేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎండలు మండిపోవడానికి కారణం ఏంటో చెప్పారాయన. ఢిల్లీలో అత్యధికంగా రికార్డు స్థాయిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైందన్నారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశామన్నారు. పాకిస్తాన్ లో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్నాయని తెలిపారు. పాకిస్తాన్ మీదుగా వీచే వేడిగాలుల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించారు. మే నెలలో సాధారణంగా ఎండలు ఎక్కువగా ఉంటాయన్నారు. వెస్ట్రన్ డిస్ట్రబన్స్, వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందన్నారు.

సూర్యుడు భూమికి దగ్గరగా రావడం వల్ల ఎండ తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం వల్ల రెండు మూడు రోజుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వెల్లడించారు. జూన్ నెలలో కూడా 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్నారు. వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ విభాగం, ఆరోగ్య శాఖ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుందన్నారు. ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు గొడుగులు తీసుకువెళ్లాలని సూచించారు. ఎక్కువ నీటిని, ఫ్లూయిడ్స్ తీసుకోవాలని జాగ్రతలు చెప్పారు.

Also Read : ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

ట్రెండింగ్ వార్తలు