Hyderabad Rain: హైదరాబాద్‌లో మరోసారి వాన బీభత్సం.. 2గంటలు దంచికొట్టిన వర్షం.. నదుల్లా రోడ్లు.. భారీగా ట్రాఫిక్ జామ్..

ఫలక్ నుమా, చార్మినార్, మలక్ పేట్, గోషామహల్, సంతోష్ నగర్, మెహిదీపట్నం సర్కిళ్ల పరిధిలో 5 సెంటీమీటర్ల నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Hyderabad Rain: హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వెంటాడుతున్నాడు. మరోసారి నగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం సాయంత్రం వాన దంచికొట్టింది. 2 గంటలు నాన్ స్టాప్ గా కురిసింది. దీంతో రోడ్లు నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

గురువారం సాయంత్రం మొదలైన వాన.. ఒక్కసారిగా జోరందుకుంది. చూస్తుండగానే దంచికొట్టింది. జడి వాన నగరాన్ని అతలాకుతలం చేసింది. ఫలక్ నుమా, చార్మినార్, మలక్ పేట్, గోషామహల్, సంతోష్ నగర్, మెహిదీపట్నం సర్కిళ్ల పరిధిలో 5 సెంటీమీటర్ల నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్, బేగంపేట, అల్వాల్, కుత్బుల్లాపూర్, మూసాపేట్, ముషీరాబాద్, మల్కాజ్ గిరి, బేగంపేట్, ఖైరతాబాద్, యూసుఫ్ గూడ, అంబర్ పేట్ సర్కిళ్ల పరిధిలో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యింది.

భారీ వర్షానికి నగరం జలమయమైంది. ప్రధాన రహదారుల్లో రోడ్లపైకి భారీగా నీరు వచ్చి చేరింది. సెక్రటేరియట్ ముందు బస్టాండ్ వద్ద కుంటను తలపిస్తోంది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. వాహనాలు బంపర్ టు బంపర్ మూవ్ అవుతున్నాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. సైబర్‌ టవర్స్‌ కంటే 3 రెట్లు పెద్దది.. ఒకవేళ భూమిని తాకిందనుకో..