Weather Updates: తెలంగాణకు వాతావరణ శాఖ మరో వార్నింగ్..! భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

విస్తారంగా కురుస్తున్న వర్షాలతో సిద్ధిపేట, నారాయణరావు పేటలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Weather Updates: తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. గ్యాప్ లేకుండా వరుణుడు కుమ్మేస్తున్నాడు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. నాన్ స్టాప్ వానలతో జనం ఆగమైపోతున్నారు. జనజీవనం స్థంభించింది. తాజాగా తెలంగాణకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఈ నెల 19వ తేదీ వరకు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఈ జిల్లాల పరిధిలో భారీగా వాన పడే ఛాన్స్ ఉందంది. ఈ జిల్లాల పరిధిలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడొచ్చని పేర్కొంది.

విస్తారంగా కురుస్తున్న వర్షాలతో సిద్ధిపేట, నారాయణరావు పేటలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో 13 సెమీ, హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్ పరిధిలో 10 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యింది. జీహెచ్ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో 5 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాలు హైదరాబాద్ లో బీభత్సం సృష్టిస్తున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఆసిఫ్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు నాలాలో కొట్టుకుపోయారు.

Also Read: తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్..! ఎప్పటి నుంచి.. ఎందుకు అంటే..