Weather Updates: ఏపీకి వాయు ”గండం”.. కోస్తాకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు..

భారీ వర్షాలు కొనసాగితే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Weather Updates: బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం వాయుగుండంగా బలపడింది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా సమీపంలో గోపాలపూర్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

నేడు కోస్తాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని చెప్పింది.

ఏపీలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎస్ విజయానంద్ తో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రలో పరిస్థితిని సీఎంకు వివరించారు సీఎస్ విజయానంద్.

అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఉత్తరాంధ్రలో పరిస్థితుల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు.

భారీ వర్షాలు కొనసాగితే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు.

ముందస్తు సన్నద్ధత, అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు.

Also Read: లేడీ డాన్‌.. ఆమె వస్తే మ్యాటర్‌ సెటిల్..! ఎస్పీలు, ఆ పై అధికారులు ఎవరైనా ఆమె చెప్తే వినాల్సిందే.. ఏం చేస్తోందంటే?