కల్కి లీలలు : 88కిలోల బంగారం, రూ.5 కోట్ల విలువైన వజ్రాలు, రూ.500 కోట్ల విలువైన ఆస్తులు

చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. నాలుగు రోజుల తనిఖీల్లో దాదాపు 500 కోట్ల విలువైన అక్రమాస్తుల్ని గుర్తించినట్లు తెలుస్తోంది.

  • Published By: veegamteam ,Published On : October 20, 2019 / 07:50 AM IST
కల్కి లీలలు : 88కిలోల బంగారం, రూ.5 కోట్ల విలువైన వజ్రాలు, రూ.500 కోట్ల విలువైన ఆస్తులు

చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. నాలుగు రోజుల తనిఖీల్లో దాదాపు 500 కోట్ల విలువైన అక్రమాస్తుల్ని గుర్తించినట్లు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. నాలుగు రోజుల తనిఖీల్లో దాదాపు 500 కోట్ల విలువైన అక్రమాస్తుల్ని గుర్తించినట్లు తెలుస్తోంది. కీలక భూ డాక్యుమెంట్లతో పాటు హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లను తమ వెంట తీసుకెళ్లారు. ఆశ్రమ సిబ్బంది స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసిన అధికారులు… విచారణ కోసం పిలిచినప్పుడు చెన్నై రావాలని ఆదేశించారు. గురువారం భారీ ఎత్తున బంగారం, నగదు దొరకడంతో… మరో రెండ్రోజుల పాటు తనిఖీలు చేపట్టారు. బత్తులవల్లంలోని ఏకం ఆలయం… ఉబ్బలమడుగు సమీపంలోని నాలుగు వన్నెస్‌ క్యాంపస్‌లు… గోవర్దనపురంలోని ట్రస్టు కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. క్యాంపస్‌-3లోని భవనంలో గోడల్ని పగలగొట్టి పెద్ద ఎత్తున బంగారం, నగదును వెలికితీసినట్లు తెలిసింది. ఈ తరహాలోనే మరిన్ని గదుల గోడల్లో దాచిన డబ్బు, బంగారం దొరికే అవకాశముందని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో బత్తులవల్లంలోని ఏకం ఆలయంలో ఉంటున్న ట్రస్టు ప్రధాన నిర్వాహకులు లోకేష్‌దాసాజీ, శ్రీనివాస దాసాజీలను వన్నెస్‌ క్యాంపస్‌-3కి తరలించి విచారించారు.

ఐటీ దాడులతో కల్కి మహా సామ్రాజ్యపు కోటకు బీటలు వారాయి. కల్కి ఆశ్రమాల్లో బుధవారం సోదాలు ప్రారంభించిన అధికారులు నాలుగు రోజుల పాటు కొనసాగించారు. 400మంది అధికారులు 16 బృందాలుగా విడిపోయి 40 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. వరదాయపాలెంతో పాటు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో సోదాలు చేపట్టారు. కల్కి భగవాన్‌ తనయుడు కృష్ణాజీ, ఆయన భార్య ప్రీతీజీ, ట్రస్ట్ సీఈఓ లోకేశ్‌ దాసాజీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

మూడో రోజు సోదాల్లో కల్కి కూడబెట్టిన అక్రమాస్తుల వివరాలు బయటపడ్డాయి. భారత్‌తో పాటు విదేశీ కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టిన పత్రాలు దొరికాయి. చైనా, అమెరికా, సింగపూర్‌, UAE కంపెనీల్లోకి నిధులు తరలించినట్లు చెబుతున్నారు. కొన్ని పత్రాలు దొరక్కుండా తగలబెట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. కల్కి ఆశ్రమాల్లో విదేశీ నగదును అనధికారికంగా ఎక్స్‌చేంజ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. విదేశీ భక్తుల నుంచి ఆయాదేశాల కరెన్సీ తీసుకుని వారికి భారత నగదును ఇస్తున్నారన్న ఆధారాలు సంపాదించారు. కల్కి కుమారుడు కృష్ణాజీ బెంగళూరులో వెయ్యి కోట్లతో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ నడుపుతున్నట్లు అనుమానాలున్నాయి. కల్కి భగవాన్‌కు స్విస్‌ బ్యాంకులో ఎకౌంట్ ఉందని… అందులో వేలకోట్లున్నాయని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు, ఏపీ సరిహద్దుల్లో వందల ఎకరాల భూములున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు.

LICలో చిరుద్యోగిగా పనిచేసిన కల్కి నేడు వేలకోట్లకు అధిపతి. ఆయన అసలు పేరు విజయ్‌కుమార్‌ నాయుడు. తమిళనాడులో గుడియాత్తం పట్టణంలోని నెత్తం విజయ్ కుమార్ స్వగ్రామం. 1971లో ఎల్ఐసీలో క్లర్కుగా విజయ్ కుమార్ ఉద్యోగంలో చేరారు. 1977లో పద్మావతి అనే మహిళను వివాహమాడారు. ఈ దంపతులకు కృష్ణ ఏకైక సంతానం. 1984లో LIC ఉద్యోగాన్ని వదిలేసి కుప్పం సమీపంలోని రాజుపేట వద్ద శంకర్ అనే మరో మిత్రుడితో కలిసి జీవాశ్రమం పేరిట ఓ పాఠశాల ప్రారంభించారు. అనుమతులు లేని కారణంగా… అప్పట్లో విద్యాశాఖ అధికారులు ఈ పాఠశాలను మూయించారు. అటు తర్వాత చాలా ఏళ్ల వరకు విజయ్‌కుమార్ నాయుడు ఎవరికీ కనిపించలేదు. 

1989లో మళ్లీ ప్రత్యక్షమైన విజయకుమార్‌… అదే జీవాశ్రమం పేరిట ఓ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. భగవంతుడి 11వ అవతారంగా చెప్పే కల్కిగా మారాడు. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు. తన ఆధ్యాత్మిక ప్రవచనాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. అదే సమయంలో కల్కి సతీమణి పద్మావతి సైతం దేవత అవతారం దాల్చింది. తనను తాను అమ్మా భగవాన్‌గా చెప్పుకుంది. ఆ తర్వాత ఆశ్రమానికి భక్తుల తాకిడి పెరిగింది. కల్కి సామ్రాజ్యం చెన్నైకి సైతం విస్తరించింది. ఏపి, తమిళనాడులో అనేక శాఖలు ఏర్పాటయ్యాయి.

కల్కి ఆశ్రమంలో ప్రతిదానికీ ఓ రేటు ఉంటుంది. పాదం చూడాలంటే ఓ రేటు.. పాదస్పర్శకు మరో రేటు. సామాన్య దర్శనానికి ఐదు వేలు, పాదస్పర్శకు పాతిక వేలు, పాదపూజతో పాటు వ్యక్తిగత అంశాల ప్రస్తావనకు లక్షల రూపాయల వసూలు మొదలైంది. సామాన్య భక్తులకు తోడు విదేశీ భక్తుల తాకిడి కూడా పెరిగింది. బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ ఆశ్రమానికి క్యూ కట్టేవారు. హృతిక్ రోషన్, రాకేష్ రోషన్, మనీషా కొయిరాలా, శిల్పాశెట్టి లాంటి బాలీవుడ్ ప్రముఖులు అనేకసార్లు ఆశ్రమానికి వచ్చారు. కేవలం ఈ దంపతుల దర్శనం మాత్రమే కాకుండా… ఇక్కడ వివిధ ఆధ్యాత్మిక కోర్సులు ప్రారంభమయ్యాయి. మానసిక చింతనకు ఈ కోర్సులు దోహదపడతాయని ప్రచారం చేశారు. ఈ కోర్సులు విదేశీ భక్తులను ఆకర్షించాయి. భక్తుల కోసం ఇక్కడ అధునాతన సదుపాయాలతో వసతి సౌకర్యం కూడా ఉంది. ఇందుకోసం భారీగా డిపాజిట్లు వసూలు చేస్తారు.

కల్కి ఆశ్రమంపై మొదటి నుంచి ఎన్నో ఆరోపణలున్నాయి. ఇక్కడ భక్తులకు మత్తు పదార్థాలు అందిస్తారని ప్రచారం జరిగింది. ఆశ్రమంలో ఉంటూ మత్తులో ఊగిపోతున్న భక్తుల విజువల్స్ వైరల్ అయ్యాయి. అయితే ఆశ్రమ ప్రతినిధులు వీటిని కొట్టిపడేశారు. ఇది భక్తిలో తన్మయత్వం అంటూ చెప్పుకొచ్చారు. ఆశ్రమంలో యువతులపై లైంగిక దాడి జరుగుతోందని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆశ్రమంలో జరుగుతున్నదంతా మొదట్నుంచీ రహస్యమే. వరదయ్యపాలెంలోని ఆశ్రమ శాఖల్లో బయట వ్యక్తుల్ని కనుచూపుమేరలోకి అనుమతించరు. కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఆశ్రమానికి వచ్చిన పలువురు విదేశీ యువతులు మాయమైనట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇంతటి మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన కల్కి భగవాన్ దంపతులు… ఇప్పుడు ఎక్కడున్నారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. భక్తులకు దర్శనమిచ్చి మూడు, నాలుగేళ్లు కావస్తోంది. అనారోగ్యం కారణంగా ఈ దంపతులు చెన్నైలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కానీ వారు ఎక్కడ ఉన్నారన్నది అధికారులకు కూడా తెలియడం లేదు. కల్కి భగవాన్ నుంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆయన తనయుడు కృష్ణ అందిపుచ్చుకున్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాలతో కృష్ణ సైతం కృష్ణాజీగా మారిపోయారు. తన సతీమణి ప్రీతితో కలిసి ఈ దంపతులు ప్రస్తుత ఆశ్రమ బాధ్యతలు చూస్తున్నారు.

కల్కి కుమారుడు కృష్ణాజీ వేలకోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాదులో అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఆయన పెట్టుబడులు పెట్టారు. కొన్ని కంపెనీల్లో భాగస్వామిగా మారారు. ఐటీ అధికారులు ఈ కంపెనీలపై సైతం దృష్టి సారించారు. కృష్ణాజీ వ్యాపార భాగస్వాములను సైతం ప్రశ్నించినట్లు సమాచారం. కల్కి ట్రస్ట్ పేర్లు తరచుగా మారడంపై కూడా ఐటీ అధికారులు దృష్టి సారించారు. కల్కీతో ప్రారంభమైన ఈ ట్రస్టు అటు తర్వాత గోల్డెన్ టెంపుల్, గోల్డెన్ షెల్టర్స్, అమ్మ భగవాన్, వన్ నెస్ టెంపుల్,  చివరకు తాజాగా ఏకం ట్రస్ట్‌గా మారడం పై ఐటీ అధికారులు దృష్టి సారించారు. పన్ను ఎగవేతకు పాల్పడేందుకే ఈ తరహాలో ట్రస్ట్ పేర్లు తరచుగా మార్చారని అనుమానిస్తున్నారు. ఇన్ని అక్రమాలు ఐటీ అధికారుల దాడులతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. కల్కి సామ్రాజ్యపు పునాదుల్ని బద్దలు కొట్టాయి.