ఆవు దూడను చంపేసిన చిరుత పులి : భయం గుప్పిట్లో ప్రజలు 

రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పొలంలో ఆవు దూడపై దాడి చేసి చంపేసింది.

  • Published By: veegamteam ,Published On : December 15, 2019 / 03:32 AM IST
ఆవు దూడను చంపేసిన చిరుత పులి : భయం గుప్పిట్లో ప్రజలు 

రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పొలంలో ఆవు దూడపై దాడి చేసి చంపేసింది.

రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఆమనగల్లులోని పొలాల్లో చిరుత కనిపించింది. ఎక్వాయిపల్లి ఎంపీటీసీ ఉమావతి పొలంలో ఆవు దూడపై దాడి  చేసి చంపేసింది. చిరుత దాడితో స్థానికులతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు.

ఆమనగల్లు సమీపంలో చాలా రోజులుగా చిరుతపులి సంచరిస్తోందని ప్రచారం జరుగుతోంది. పొలాల్లో కట్టేసిన పశువులపై వరుసగా దాడి చేసి చంపేస్తోంది. ఎక్వాయిపల్లి ఎంపీటీసీ ఉమావతి పొలంలో రాత్రి ఆవుదూడలను కట్టేశారు. ఈ క్రమంలో చిరుతపులి.. ఆవుదూడలపై దాడి చేసి చంపేసింది. 

ఇదే విషయానికి సంబంధించిన వ్యవహారంలో గతంలో ఫారెస్టు అధికారులు అక్కడ సీసీ కెమెరాలను అమర్చారు. సీసీ ఫుటేజీలో గతంలో జరిగిన దాడులను పరిశీలించంగా చిరుత దృశ్యాలు క్లియర్ గా కనిపించాయి. పరిసర ప్రాంతాల్లో చిరుత వరుసదాడులు చేస్తున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. చిరుతను పట్టుకునే ప్రయత్నం చేయడంలో ఫారెస్టు అధికారులు విఫలం అయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. 

ఆమనగల్లు మండల పరిసర ప్రాంతాల్లోని జక్కాయిపల్లి, ఎక్వాయిపల్లి గ్రామాల్లో చిరుతపులి రెండు నెలలుగా వరుసదాడులకు పాల్పడుతున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. అక్కడున్న గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రిళ్లు పొలాల్లో పశువులను కట్టేయాలంటేనే భయంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. రాత్రి సమయంలో పొలాల్లోకి వెళ్లాలంటే ఇబ్బందిగా, భయంగా ఉందని అక్కడున్న స్థానికులు గతంలో ఫారెస్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు.