దళిత రైతు పంట ధ్వంసం చేసి..బూటుకాళ్లతో తన్ని లాఠీలతో కుళ్లబొడిచిన పోలీసులు

  • Published By: nagamani ,Published On : July 16, 2020 / 03:21 PM IST
దళిత రైతు పంట ధ్వంసం చేసి..బూటుకాళ్లతో తన్ని లాఠీలతో కుళ్లబొడిచిన పోలీసులు

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఓ దళిత రైతు పండించిన పంటను రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు. కష్టపడి పండించిన పంటను రెవెన్యూ అధికారులు తన కళ్లముందే నాశనం చేస్తుంటే తట్టుకోలేకపోయాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అయినా ఆ అధికారులు రైతు మాట వినలేదు. దీంతో ఆ రైతు దంపతులు తల్లడిపోయారు. మేం చేసిన తప్పేంటీ? మాకీ గతి ఏంటీ అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చారు.

అక్కడే ఉన్న పోలీసులను మమ్మల్ని మా పంటను కాపాడండి సార్ అని వేడుకున్నారు. కానీ ఫలితం లేదు. పైగా పోలీసులు ఆ దళిత రైతుపై దాడికి దిగారు.ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుంటూ పండించిన పంట నాశనమవ్వటాన్ని తట్టుకోలేని ఆ రైతు గుండెలు బాదుకుంటే ఏడుతూ పొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

రామ్ కుమార్ అహిర్వర్ (38), సావిత్రి దేవి (35) దంపతులు ఎంతో కాలం నుంచి ఓ గుడిసె వేసుకుని కుటుంబంతో అక్కడే నివస్తున్నారు. 5.5 ఎకరాల పొలాన్ని పండించుకుంటూ జీవిస్తున్నారు. పెట్టుబడికోసం అప్పులు చేస్తు పంట పండిస్తున్నారు. కానీ సరైన ధరలేక అప్పులు మాత్రం మిగులుతున్నాయి. అయినా ఆ భూమిమీదనే ఆధారపడి పండించటం మాత్రం మానలేదు రామ్కుమార్ కుటుంబం.
ఈ క్రమంలో ఆ పొలం ఉన్న ప్రాంతం ఓ కాలేజీ కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని రెవెన్యూ అధికారులు చెప్పారు. కానీ మాకు వేరే ఆధారం లేదు ఈ పొలం మాది ఇక్కడే ఉంటామంటూ సాగుచేసుకుంటున్నారు.

దీంతో రైతులకు, ప్రభుత్వానికి మధ్య గొడవ ప్రారంభమైంది. వెంటనే అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. కానీ ఈ భూమిని నమ్ముకునే బతుకుతున్నాం..పంట కోసం బ్యాంకు నుంచి రూ.3లక్షలు అప్పు కూడా చేశాం ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్లిపోమంటే ఎలా బతుకుతాం..అప్పు ఎలా తీరుస్తాం అంటూ సావిత్రి వాపోయింది. అటువంటి పరిస్థితుల్లో వారు అక్కడి నుంచి కదల్లేదు. దీంతో రెవెన్యూ అధికారులు రామ్ కుమార్ పండించిన పంటను నాశనం చేశారు. దీన్ని అడ్డుకున్న రైతుపై అక్కడే ఉన్న పోలీసులు విచక్షణారహితంగా దాడి చేవారు. లాఠీలతో కొట్టారు. బూటు కాళ్లతో తన్నారు. నా కొడుకుని కొట్టకండయ్యా..అంటూ తల్లి వేడుకున్నా పోలీసులు వినలేదు. ఈడ్చి ఈడ్చి కొట్టారు.

ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందిస్తున్నాయి. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ను తొలగించినట్లు చెబుతున్నారు కానీ అటువంటిదేమీ జరగలేదని పేదలపై ప్రభుత్వం ఇటువంటి దాష్టీకాలు సరైనవి కాదని..వారికి న్యాయం చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.