ఎర్రంనాయుడు ఆశయాల కోసమే రాజకీయాల్లోకి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై ఎమ్మెల్యే భావోద్వేగం

  • Published By: vamsi ,Published On : December 17, 2019 / 06:02 AM IST
ఎర్రంనాయుడు ఆశయాల కోసమే రాజకీయాల్లోకి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై ఎమ్మెల్యే భావోద్వేగం

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరిదైన రోజు వాడీవేడి చర్చ జరుగుతుంది. ఈ సమావేశాల్లో మాట్లాడిన రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. అసెంబ్లీలో మద్యపాన నిషేధంపై తాను చేసిన వ్యాఖ్యలపై ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో విషపు రాతలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర వీటికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు.

తన కుటుంబ సభ్యులు ఫోన్ చేసి.. అసెంబ్లీలో తప్పు ఏం మాట్లాడకపోయినా తప్పుగా ట్రోల్ చేస్తున్నారని చెప్పారని అన్నారు. సోషల్ మీడియాలో నీచాతి నీచంగా పోస్టులు పెడుతున్నారని.. దీని గురించి తనకు బాధగా లేదని.. రాజకీయాల్లోకి వచ్చినప్పుడేమ ఇటువంటివి ఊహించుకుని వస్తామని, నేను రాజజకీయాల్లో పదవుల ఆశించి రాలేదని అన్నారు. చిన్నతనంలోనే తన తండ్రి, ఇటు తన మామగారు ఎన్నో పదవుల్లో ఉన్నారని, పదవులు కొత్తేమీ కాదని,  పార్టీకి, ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.

తన తండ్రి ఎర్రంనాయుడు ఆశయాల కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు భవాని. తన కుటుంబానికి ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందని.. తాను కూడా పదిమందికి సేవ చేయగలిగితే చాలు అనుకున్నానని చెప్పుకొచ్చారు. తన కుటుంబ సభ్యులంతా నన్ను ప్రోత్సహించి రాజకీయాల్లోకి తీసుకొచ్చారంటూ భావోద్వేగానికి గురయ్యారు ఆదిరెడ్డి భవాని.

సోషల్ మీడియాలో తనపై రకరకాల పోస్టులు పెట్టారని, ఆధారాలతో సహా తన దగ్గర అవి ఉన్నాయని, మూడు రోజుల క్రితం సీఎం మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడితే సహించేది లేదన్నారని గుర్తు చేశారు. అయితే ఒక ఎమ్మెల్యేగా తన పరిస్థితే ఇలా ఉంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఆదిరెడ్డి భవాని. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన దిశ చట్టాన్ని తన నుంచి అసెంబ్లీలో ప్రారంభించాలని అన్నారు ఆదిరెడ్డి భవాని. ఈ పోస్టుల వెనుక ఎవరెవరు ఉన్నారో.. పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ని కోరారు.