కొత్త కళ : కాకినాడ పెట్రో క్యాపిటల్

  • Published By: madhu ,Published On : January 9, 2019 / 02:34 PM IST
కొత్త కళ : కాకినాడ పెట్రో క్యాపిటల్

పెట్రో క్యాపిటల్‌గా మారబోతున్న కాకినాడ
67వేల కోట్లతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం
ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ 

తూర్పుగోదావరి : కాకినాడ ఇప్పుడు పెట్రో క్యాపిట‌ల్‌గా మార‌బోతోంది. అందుకు త‌గ్గట్టుగా భారీ ప్రాజెక్ట్ కి బీజం పడింది. కాకినాడ సెజ్ ప‌రిధిలో ఖాళీగా ఉన్న భూముల్లో ప‌రిశ్రమ‌ల‌కు స‌ర్వం సిద్ధమ‌య్యింది. తొలి పెట్రో కెమిక‌ల్ రిఫైన‌రీకి..  హాల్దియా పెట్రో కెమిక‌ల్స్ ముందుకు రావ‌డంతో .. కాకినాడ తీరానికి కొత్త క‌ళ ఖాయ‌మ‌ని అంతా భావిస్తున్నారు.  కాకినాడ తీరం ఇప్పటికే పెట్రో హ‌బ్‌గా క‌నిపిస్తోంది. కేజీ బేసిన్ ప‌రిధిలోని కాకినాడ ఆఫ్ షోర్, ఆన్ షోర్‌లో కూడా వివిధ పెట్రో కంపెనీల కార్యక‌లాపాలు సాగుతున్నాయి. డీ6 రిల‌యెన్స్ టెర్మిన‌ల్ కూడా కాకినాడ స‌మీపంలోనే ఉంది. అలాంటి కాకినాడ‌ను పెట్రో కెమిక‌ల్స్ హ‌బ్‌గా మార్చేందుకు ప్రభుత్వం చాలాకాలంగా ప్రయ‌త్నిస్తోంది. అయితే గ్యాస్ టెర్మిన‌ల్ నిర్మాణానికి చేసిన ప్రయ‌త్నం చివ‌రి నిమిషంలో వెన‌క్కిపోవ‌డంతో .. కాకినాడ అభివృద్ధి రెండ‌డుగుల ముందుకు మూడ‌డుగుల వెనక్కి అన్న చందంగా మారింది.
తాజాగా ఏపీ ప్రభుత్వం చొర‌వ‌తో హాల్దియా పెట్రో కెమిక‌ల్స్ సంస్థ భారీ పెట్టుబ‌డుల‌కు సిద్ధమ‌య్యింది. ఏకంగా 67 వేల కోట్లతో భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా  ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ కూడా కుదుర్చుకుంది. చంద్రబాబు స‌మ‌క్షంలో జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంథి మ‌ల్లిఖార్జున రావు, హాల్దియా కంపెనీ ప్రతినిధులు .. ఈ ఎంవోయూ కార్యక్రమంలో పాల్గొన్నారు.
67 వేల కోట్లతో భారీ ప్రాజెక్ట్ 
ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ 

ఇదే స‌మ‌యంలో కాకినాడ పోర్ట్‌తో పాటుగా సెజ్ ప్రాంతంలోని తొండంగి మండ‌లంలో జీఎంఆర్ ఆధ్వర్యంలో క‌మ‌ర్షియ‌ల్ పోర్ట్ నిర్మాణానికి కూడా శంకుస్థాప‌న ప‌డింది. దీంతో పోర్ట్ అభివృద్ధి జ‌రిగితే సెజ్ లో అడుగు పెట్టే కంపెనీల‌కు అవ‌కాశంగా మారుతుంద‌ని.. అంతా భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా కాకినాడ ప్రాంతంలో ఉపాధి అవ‌కాశాల‌ను పెంచే ప్రయ‌త్నంలో ఉన్నామ‌ని ప్రక‌టించారు. ఇప్పటికే కాకినాడ సెజ్ లో 2వేల మందికి ఉపాధి ద‌క్కింద‌ని, త్వర‌లో కొత్త ప‌రిశ్రమ‌ల రాక‌తో ల‌క్షల మందికి ప్రత్యక్ష, ప‌రోక్ష ఉపాధి అవ‌కాశాలు ఖాయ‌మ‌ని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
2వేల మందికి ఉపాధి 
ల‌క్షల మందికి ప్రత్యక్ష, ప‌రోక్ష ఉపాధి
 
కాకినాడ పోర్ట్‌ల‌కు తోడుగా కొత్త పోర్ట్ అందుబాటులోకి రాబోతున్న త‌రుణంలో మౌలిక స‌దుపాయాల క‌ల్పన‌లో భాగంగా .. రాజాన‌గ‌రం నుంచి పోర్ట్ వ‌ర‌కూ ఉన్న ఏడీబీ రోడ్డ విస్తర‌ణ‌కు శ్రీకారం చుట్టారు. కాకినాడ నుంచి అన్నవ‌రం వ‌ర‌కూ సాగ‌ర‌మాల పేరుతో బీచ్ రోడ్డు అభివృద్ధి ప్రయ‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో ప‌రిశ్రమ‌ల రాక‌కు అంతా సిద్ధం అవుతున్నట్టు చెబుతున్నారు.
తొలి పెట్రో కెమిక‌ల్ రిఫైన‌రీకి ముందుకొచ్చిన హాల్దియా 
కాకినాడ తీరానికి కొత్త కళ ఖాయమంటున్న నిపుణులు
ఉపాధి అవకాశాలు పెంచే క్రమంలో భాగమంటున్న సర్కార్‌