దీపావళి వేడుక : భగినీ హస్త భోజనం విశిష్టత

  • Published By: veegamteam ,Published On : October 24, 2019 / 06:22 AM IST
దీపావళి వేడుక : భగినీ హస్త భోజనం విశిష్టత

దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. అశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు, కార్తీక శుద్ద విదియ ‘భగినీహస్త భోజనం’తో ముగుస్తాయి. దీంట్లో భగినీ హస్త భోజనానికి చాలా విశిష్టత ఉంది. భగినీ అంటే సోదరి. ఆమె చేతితో స్వయంగా వడ్డించే భోజనాన్ని ‘భగినీహస్త భోజనం’ అంటాం. ఈ భగినీ హస్త భోజనం సోదరీ, సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ రోజున ఈ వేడుకను జరుపుకుంటారు.

కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు.సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కా చెల్లెళ్ళ ఇళ్ళకు బహుమానాలు తీసుకెళ్ళి వారి చేతి వంట తింటారు. సోదరి చేతితో సోదరుడు నుదుటిపై తిలకం దిద్దించుకుంటారు.

రక్షాబంధనం (రాఖీ పండుగ)లో అన్నదమ్ములు తమ సోదరి రక్ష(రాఖీ ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలకు తాము అండగా ఉంటామనే భరోసానిస్తారు. ఈ ‘భగినీహస్త భోజనం’ పండుగ “భయ్యా ధూజీ” అనే పేరుతో ఉత్తరదేశంలో బాగా జరుపుకుంటారు. ఇది దక్షిణ భారతంలో పెద్దగా చేసుకోరు. దక్షిణాదిలో స్థిరపడిన  ఉత్తరాదివారు మాత్రం తప్పకుండా చేసుకుంటారు. సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనాన్ని స్వయంగా తిని ఆమెను ఆశీర్వదిస్తారు. 
భగినీ హస్త భోజనం పురాణ కథ 
సమవర్తి యమధర్మరాజు సోదరి పేరు యమున.ఆమె వివాహమై అత్తవారింటికి వెళ్లింది. అలా వెళ్లిన యమున తన సోదరుడు యమధర్మరాజుని తన ఇంటికి ఎన్నో సార్లు రమ్మని కోరింది. కానీ విధుల నిర్వహణలో పడి సోదరి ఇంటికి వెళ్ళలేక పోయాడు. అలా సోదరి కోరికను తీర్చలేకపోతున్నాని యముడు మధన పడ్డాడు. 

చివరికి వీలు చేసుకుని సోదరి ఇంటికి వెళ్లాడు. ఈ రోజే కార్తీక శుద్ధ విదియ. రాక రాక సోదరుడు వచ్చాడని యమున ఎంతో సంతోషపడింది. ఎన్నో రకాల పిండివంటలుచేసి స్వయంగా తన చేతులతో సోదరుడికి వడ్డించింది. ఎంతోకాలానికి కార్తీక శుద్ధ విదియనాడు కలవటంతో  సోదరీ సోదరులు ఎంతో సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు సోదరిపై ప్రేమతో ఏదైనా వరం కోరుకోమన్నాడు. వాళ్ళు దేవతలు కదా..వాళ్లు కోరుకునే కోరికలు కూడా జన ప్రయోజనాలుగా ఉంటాయి. అవే ప్రజలకు ఆదర్శంగా మారి సంప్రదాయంగా మారాయి. 

అందుకు ఆమె ఈ కార్తీక శుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించాడు. అలా జరుపుకున్న వారికి అపమృత్యు దోషం అంటే అకాల మరణం లేకుండా ఉంటుంది. సోదరుడికి భోజనం పెట్టిన ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని యముడు వరాలిచ్చాడట. అలా ఈ వరం సంప్రదాయంగా మారింది.