India

22:39 - March 27, 2017

ధర్మశాల టెస్ట్‌ : ధర్మశాల టెస్ట్‌పై టీమిండియా పట్టు బిగించింది.జడేజా ఫైటింగ్‌ హాఫ్‌ సెంచరీతో 32 పరుగుల కీలక  తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన టీమిండియా ...బౌలింగ్‌లోనూ డామినేట్‌చేసింది. భారత బౌలర్ల జోరు ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో ఆతిధ్య జట్టు పూర్తి స్థాయిలో ఆధిపత్యం  ప్రదర్శించింది. మూడో రోజే మ్యాచ్‌పై పట్టు బిగించిన భారత్‌ ... విజయానికి 87 పరుగుల దూరంలో నిలిచింది. 
భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం
ధర్మశాల టెస్ట్‌లో భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతోంది. సిరీస్‌ నిర్ణయాత్మక టెస్ట్‌లో ఆతిధ్య భారత జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కంగారూల జోరుకు చెక్‌ పెట్టింది. జడేజా ఆల్‌రౌండ్‌ షో...అశ్విన్‌,ఉమేష్‌ యాదవ్‌ల మ్యాజిక్‌తో మూడో రోజే మ్యాచ్‌పై పట్టు బిగించిన భారత్‌ ... విజయానికి  87 పరుగుల దూరంలో నిలిచింది. 6 వికెట్లకు 248 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన భారత్ ఓవర్‌నైట్‌స్కోర్‌కు మరో  84 పరుగులు జోడించింది. జడేజా ఫైటింగ్‌ హాఫ్‌ సెంచరీతో 32 పరుగుల కీలక  తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన టీమిండియా ....బౌలింగ్‌లోనూ డామినేట్‌చేసింది. 
భారత బౌలర్ల జోరుకు కంగారులు బేజారు.. 
మూడో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల జోరు ముందు కంగారూ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. రెన్‌ షా ,డేవిడ్‌ వార్నర్‌లను ఉమేష్‌ యాదవ్‌ ఔట్‌ చేసి శుభారంభాన్నిచ్చాడు.సూపర్‌ ఫామ్‌లో ఉన్న స్టీవ్‌ స్మిత్‌ను భువనేశ్వర్‌ కుమార్‌ బౌల్డ్‌ చేసి భారత్‌ను పోటీలో నిలిపాడు. మ్యాక్స్‌వెల్‌, మాథ్యూవేడ్‌ పోరాడినా....మిగతా బ్యాట్స్‌మెన్‌  తేలిపోవడంతో ఆసీస్‌ టీమ్‌ భారత్‌ ముందు భారీ లక్ష్యాన్నుంచడంలో విఫలమైంది. అశ్విన్‌, జడేజా పోటీలు పడి వికెట్లు తీయడంతో కంగారూ టీమ్‌  కోలుకోలేకపోయింది. 
137 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా 
137 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా జట్టు భారత్‌ ముందు 106 పరుగుల లక్ష్యాన్నుంచింది. భారత బౌలర్లలో ఉమేష్‌ ,అశ్విన్‌,జడేజా తలో మూడు వికెట్లు తీశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రాహుల్‌, మురళీ విజయ్‌ శుభారంభాన్నిచ్చారు. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. సిరీస్‌ ఆధ్యంతం ఆతిధ్య జట్టుకు గట్టి పోటీనిచ్చిన ఆస్ట్రేలియాకు ఆఖరి టెస్ట్‌లో మాత్రం ఓటమి తప్పేలా లేదు. నాలుగో రోజు తొలి సెషన్‌లోనే లక్ష్యాన్ని చేధించి...సిరీస్‌తో పాటు  బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. 

 

22:35 - March 27, 2017

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దుయ్యబట్టారు. కార్పోరేట్లకు 11 లక్షల కోట్లను మాఫీ చేసిన కేంద్రం- రైతుల రుణాలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత రెండు వారాలుగా జంతర్ మంతర్‌ వద్ద ధర్నా చేస్తున్న తమిళనాడు రైతులను పరామర్శించిన ఏచూరి- వారికి తమ మద్దతు తెలిపారు. రైతుల సమస్యను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని వారికి హామీ ఇచ్చారు. ఎలుకలను నోట్లో పెట్టుకుని రైతులు నిరసన తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా తమిళ రైతులకు 20 వేల కోట్ల నష్టం జరిగింది. దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి రైతులకు తక్షణమే కేంద్రం నిధులు విడుదల చేయాలని ఏచూరి డిమాండ్‌ చేశారు.

22:28 - March 27, 2017

ఢిల్లీ : దేశంలో రైతు ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు మరోసారి విచారం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖెహర్... దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న అన్నదాతల ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాలుగు వారాల్లోగా తెలపాలని.. కేంద్రానికి నోటీసులు జారీచేశారు. గుజరాత్ రైతు సమస్యలపై సిటిజన్ రిసోర్స్ యాక్షన్ ఇనిషియేటివ్ అనే ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ ధర్మాసనం విచారించింది. దేశవ్యాప్తంగా సుమారు 3వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని... కేంద్రప్రభుత్వం వీటిని అరికట్టేందుకు ప్రత్యేకంగా పాలసీ తీసుకురావడం లేదని పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. దీనిపై సుప్రీం చీఫ్ జస్టిస్.. కేంద్రానికి నోటీసులు జారీచేశారు.

21:47 - March 27, 2017

మహారాష్ట్ర : పాకిస్తాన్‌ ఫౌండర్‌ మహ్మద్ అలీ జిన్నా ఇల్లును కూల్చాలని ముంబైలోని ఓ టాప్ బిల్డర్ ప్రభుత్వాన్ని కోరాడు. ద‌క్షిణ ముంబైలో రెండున్నర ఎక‌రాల్లో ఉన్న జిన్నా ఇంటిని కూల్చి.. ఆ ప్రదేశంలో ఓ సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించాల‌ని రియల్‌ ఎస్టేట్‌ ప్రమోటర్ మంగ‌ళ్ ప్రభాత్ లోధా సూచించారు. ప్రస్తుతం ఈ ఇంటి విలువ 2600 కోట్లు ఉంటుంది. 1930ల్లో నిర్మించిన ఈ భారీ భ‌వనం నిర్వహణ కోసం కోట్లు వృథా చేస్తున్నార‌ని ఆరోపించారు. దేశ విభ‌జ‌న కుట్రకు బీజం ప‌డింది ఈ ఇంటి నుంచేనని  ...అందుకే దీన్ని కూల్చేయాలని లోధా వాదిస్తున్నాడు. చాలా కాలం వ‌ర‌కు బ్రిట‌న్ డిప్యూటీ హైక‌మిష‌న‌ర్ నివాసంగా ఉన్న ఈ ఇల్లు 1982 నుంచి  ఖాళీగానే ఉంది. ఈ ఇంటిని త‌మ‌కు అమ్మడ‌మో, లీజుకు ఇవ్వడ‌మో చేయాల‌ని పాకిస్థాన్ ప్రభుత్వం చాలాసార్లు కోరింది. అయితే భార‌త్ ఈ కోరిక‌ను మ‌న్నించ‌లేదు.. అలాగ‌ని నిరాక‌రించ‌లేదు.

 

21:45 - March 27, 2017

ఢిల్లీ : జీఎస్టీకి సంబంధించిన 4 సహాయక బిల్లులు-ఐజీఎస్టీ, సీజీఎస్టీ, యూటీజీఎస్టీ పరిహార చట్టాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై మంగళవారం చర్చించే అవకాశం ఉంది. మార్చి 30లోపు లోక్‌స‌భ‌లో జీఎస్టీ బిల్స్‌ను పాస్ చేయించాల‌ని కేంద్రం భావిస్తోంది. అనంతరం 4 జిఎస్‌టి బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఏమైనా స‌వ‌ర‌ణ‌లు సూచిస్తే.. వాటిపై చ‌ర్చించ‌డానికి లోక్‌స‌భ‌కు త‌గిన స‌మ‌యం దొరుకుతుంది. ఆ స‌వ‌ర‌ణ‌ల‌ను లోక్‌స‌భ ఆమోదించ‌వ‌చ్చు లేదా తిరస్కరించ‌వ‌చ్చు. వీటిని ద్రవ్య బిల్లులుగానే ప్రవేశ‌పెడుతున్నా.. పార్లమెంట్‌ ఉభయ స‌భ‌ల్లోనూ త‌గిన చ‌ర్చ జ‌ర‌గాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంట్‌లో ఈ బిల్లులు పాసయ్యాక వీటిని విధానసభలకు పంపనున్నారు. ఈ ఏడాది జులై 1 నుంచి జీఎస్టీని అమ‌లు చేయాల‌ని కేంద్రం ల‌క్ష్యంగా పెట్టుకుంది. 
 

21:43 - March 27, 2017

ఢిల్లీ : ఆధార్‌ను తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఎం తప్పుపట్టింది. ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న బిల్లును తాము వ్యతిరేకిస్తామని రాజ్యసభలో సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించడం ద్వారా రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం భంగం కలిగిస్తోందని ఆరోపించారు. 

 

21:38 - March 27, 2017

ఢిల్లీ : సంక్షేమ పథకాలకు ఆధార్‌ కార్డును తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సంక్షేమ పథకాలకు ఆధార్‌ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేయడం సరికాదని సూచించింది. అయితే బ్యాంక్‌ ఖాతాలు తెరవడం, ఆదాయపు పన్ను వివరాల నమోదు లాంటి వాటికి మాత్రం ప్రభుత్వం ఆధార్‌ను తొలగించబోదని న్యాయస్థానం వెల్లడించింది. ఆధార్‌ అనుసంధానంపై పిటిషన్లను విచారించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అవసరమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావట్లేదని తెలిపింది.

 

21:36 - March 27, 2017

ఢిల్లీ : ఎయిర్‌ ఇండియా అధికారిపై దాడి చేసిన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్‌ త్వరలో విమానం ఎక్కనున్నారా...? ఆయనపై ఏడు విమానసంస్థలు విధించిన నిషేధం సమసిపోనుందా? గైక్వాడ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలన్న శివసేన ఎంపీలు చేసిన విజ్ఞప్తికి కేంద్రం దిగివచ్చినట్లే కనిపిస్తోంది.
నిషేధ అంశం లోక్‌సభలో చర్చ
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ను విమాన సంస్థలు నిషేధించిన అంశం లోక్‌సభలో చర్చకు వచ్చింది. జీరో అవర్‌లో శివసేన ఎంపీ ఆనందరావు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎయిర్‌ ఇండియా అధికారి ఎంపీతో అనుచితంగా ప్రవర్తించడం వల్లే గైక్వాడ్‌ సహనం కోల్పోయారని అన్నారు. అయితే అధికారిని కొట్టడం తప్పేనని  ఒప్పుకున్నారు.  గ్వైక్వాడ్‌ను  విమాన ప్రయాణం చేయకుండా నిషేధం విధించడం సరికాదని ఆనందరావు చెప్పారు. ఎయిర్ ఇండియా ఉద్యోగుల‌తో దురుసుగా ప్రవ‌ర్తించిన కపిల్‌ శర్మను ఎందుకు బ్యాన్‌ చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.  
ఎంపీ కూడా ఓ ప్రయాణికుడే : అశోక్ గజపతిరాజు 
శివసేన లేవనెత్తిన అంశంపై కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి అశోక గ‌జ‌ప‌తిరాజు స్పందించారు. ఎంపీ కూడా ఓ ప్రయాణికుడేనని, ప్రయాణికుల విషయంలో అధికారులు భేదభావం చూపరని స్పష్టం చేశారు. ఓ ఎంపి ఇలాంటి గొడవలో ఇరుక్కుంటారని తాను ఊహించలేదన్నారు.  గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేయాలన్న శివసేన డిమాండ్‌ను మంత్రి తోసిపుచ్చారు. ప్రయాణికుల సంరక్షణ విషయంలో రాజీ పడేది లేదన్నారు.  
నిషేధం ఎత్తివేసేందుకు రంగంలోకి శివసేన ఎంపీలు 
రవీంద్ర గైక్వాడ్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు శివసేన ఎంపీలు రంగంలోకి దిగారు. కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి అశోక గ‌జ‌ప‌తిరాజు, స్పీకర్‌ సుమిత్రామహాజన్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీంతో సదరు ఎంపీపై నిషేధం ఎత్తివేసేందుకు వారు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రయాణించే హక్కుకు గౌరవం కల్పించాలన్న కారణంతో గైక్వాడ్‌పై ఉన్న నిషేధాన్ని త్వరలో ఎత్తివేసే అవకాశం కనిపిస్తోంది.
విమానంలో ప్రయాణించకుండా గైక్వాడ్‌పై నిషేధం 
ఇటీవ‌ల ఎయిర్ ఇండియాలో ప్రయాణించిన శివసేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్ ఢిల్లీ విమానశ్రయంలో ఓ అధికారిని చెప్పుతో కొట్టారు. దానికి క్షమాప‌ణ చెప్పేందుకు కూడా ఆయ‌న నిరాక‌రించారు. దీంతో 7 విమాన సంస్థలు విమానంలో ప్రయాణించకుండా గైక్వాడ్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. 

 

21:33 - March 26, 2017

ధర్మశాల వేదికగా సాగుతోన్న చివరి టెస్ట్‌లో భారత్‌ ఆచితూచీ ఆడుతోంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. తొలి ఇన్సింగ్స్‌లో ఆసీస్‌ కంటే ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. నాలుగో టెస్ట్‌లో భారత్‌ - ఆస్ట్రేలియా జట్లు పోరాడుతున్నాయి. ట్రోఫీ ఫలితాన్ని తేల్చే నాలుగో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 300 రన్స్‌కే కట్టడి చేసిన భారత్‌.. భారీ స్కోరు సాధించేందుకు శ్రమిస్తోంది. ప్రారంభంలోనే ఓపెనర్ మురళీ విజయ్‌ 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హజల్‌వుడ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ మాధ్యూవేడ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పుజారా.. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. 87 పరుగులు జోడించిన తర్వాత రాహుల్‌ ఔటయ్యాడు. రాహుల్ 60 పరుగులు చేశాడు.

248 పరుగులు..
పుజారాతో జతకలిసిన అజింక్యా రహానే ఆచితూచి ఆడుతూ స్కోరును 150 పరుగులు దాటించారు. ఈ సమయంలోనే 57 పరుగులతో జోరుమీదున్న పుజారా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కరుణ్‌ నాయర్‌ 5పరుగులు చేసి పెవిలియన్‌ చేరడంతో 167 పరుగులకే భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన అశ్విన్‌... రహానేతో కలిసి 49 పరుగులు జోడించారు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర రహానే.. ఆలియాన్‌ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. తర్వాత ఆల్‌రౌండర్ అశ్విన్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔటయ్యాడు. దీంతో 221 పరుగులకే భారత్‌ ఆరువికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్‌ సాహా, జడేజా మరో విక్కెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును కదిలిస్తున్నారు. మొత్తంగా ఆరు వికెట్ల నష్టానికి భారత్‌ 248 పరుగులు చేసింది. ఆసీస్‌ కంటే ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. భారత బ్యాటింగ్‌ జోరుకు.. ఆసీస్‌ స్పిన్నర్‌ లైయన్‌ అడ్డుకట్ట వేశాడు. కీలక సమయాల్లో నాలుగు వికెట్లు తీశాడు.

21:30 - March 26, 2017

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎంతో కీలకంగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను-జీఎస్టీ అనుబంధ బిల్లులను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జీఎస్‌టీలో భాగమైన సీ, జీఎస్టీ, ఐ, జీఎస్టీ యూటీ, జీఎస్టీ, మొదలైన బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై మార్చి 28న చర్చ జరిగే అవకాశం ఉంది. జీఎస్‌టీ అమలైతే ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ చట్టంలో ఉన్న వివిధ సెస్సులను రద్దు చేస్తారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన బిల్లులన్నీ జీఎస్‌టీ కిందకు వస్తాయి. ఈ బిల్లుపై చర్చ జరిగే సమయాన్ని, ఇతర విషయాలపై రేపు బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. మార్చి 29 లేదా 30లోపు జీఎస్‌టీ బిల్లుకు సభ ఆమోదం పొందేలా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - India