డ్రగ్స్ కారిడార్‌గా మారుతున్న స‌ముద్ర తీరం?

డ్రగ్స రవాణాకు రోడ్డు మార్గం కంటే జలమార్గాన్నే ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. దీంతో సముద్ర తీరం డ్రగ్స్ కారిడార్ గా మారుతోంది.

డ్రగ్స్ కారిడార్‌గా మారుతున్న స‌ముద్ర తీరం?

The sea coast is becoming a drug corridor

కుప్పలకు కుప్పలు.. కోట్ల విలువ చేసే డ్రగ్స్. దొరికితే సీజ్. లేకపోతే వేల కోట్ల దందా. ఇదే లైన్ తో డ్రగ్స్ ను దేశ సరిహద్దులు దాటిస్తున్నారు కేటుగాళ్లు. అప్పుడప్పుడు కోట్ల విలువ చేసే డ్రగ్స్ ముఠా గుట్టు రట్టవుతుండటంతో.. మాదక ద్రవ్యాల రవాణా చూస్తేనే మత్తెక్కిపోతుంది. పండ్లు, కూరగాయలు, ఫర్నీచర్ మాటున వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను పడవల్లో తరలిస్తున్నారు. డ్రగ్స రవాణాకు రోడ్డు మార్గం కంటే జలమార్గాన్నే ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. దీంతో సముద్ర తీరం డ్రగ్స్ కారిడార్ గా మారుతోంది. రిస్క్ లేకుండా.. తీరంలో నేవీ సిబ్బంది కంటపడకుండా డ్రగ్స్ తీసుకొస్తున్నారు. వంద కోట్లు 2వందల కోట్లు కాదు ఏకంగా.. వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ ఏం చక్కా సముద్ర మార్గాన భారత్ కు చేరుకుంటున్నాయి.

దేశంలోని గోవా లాంటి రాష్ట్రాల వార్షిక బడ్జెట్ అంతా డ్రగ్స్ పట్టుబడుతుంది. అంటే ఏ స్థాయిలో డ్రగ్స్ దందా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. అంతర్గతంగా డ్రగ్స్ నివారణకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా.. దేశ సరిహద్దులు దాటి లోపలికి వస్తున్న డ్రగ్స్ తో మాదక ద్రవ్యాల నివారణ కష్టమవుతోంది. ఇండియన్ నేవీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కళ్లు కప్పి ఇండియాలోకి డ్రగ్స్ తీసుకొస్తున్నారు. నేవీ కంటపడి దొరికినప్పుడు మాత్రం కళ్లు బైర్లుకమ్మే స్థాయిలో డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. పైగా డ్రగ్స్ ను ఇండియాకు అక్రమ రవాణా చేస్తున్నవారిలో ఎక్కువగా పాకిస్తాన్, ఇరాన్ వాళ్లే ఉంటున్నట్లు ఇప్పటివరకు నమోదైన కేసులను బట్టి తెలుస్తోంది.

3,300 కిలోల డ్ర‌గ్స్ సీజ్‌..

అరేబియా సముద్రంలో భారీ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్‌ రాకెట్‌ను ఛేదించింది ఇండియన్ నేవీ. నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో, ఇండియన్ నేవీ జాయింట్ ఆపరేషన్ లో 3వేల 3వందల కేజీల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరంలో నౌక నుంచి భారీగా డ్రగ్స్ సీజ్‌ చేశామని.. ఈమధ్యకాలంలో ఈ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకోవడం ఇదే మొదటిసారని నేవీ అధికారులు తెలిపారు.

అనుమానాస్పదంగా భారత జలాల్లోకి ప్రవేశించిన ఒక చిన్నపాటి నౌకను గుర్తించిన అధికారులు వెంటనే దానిని ముట్టడించారు. ఆ బోటు తీరం చేరుకునే వరకు వెంబడించారు. దాని నుంచి 3వేల 89 కేజీల చరాస్‌, 158 కేజీల మెథామెఫ్తమైన్‌, 25 కేజీల మార్ఫిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వారంతా పాకిస్థాన్‌ జాతీయులుగా గుర్తించారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒక చరాస్ ప్రైజ్ కేజీ 7 కోట్లు ఉంటుందని అంచనా వేశారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు. పట్టుబడిన 3వేల 89 కిలోల చరాస్ విలువే దాదాపు 22వేల కోట్లు మిగతా డ్రగ్స్ విలువ మరో వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇది గోవా స్టేట్ లాంటి ఓ చిన్న రాష్ట్ర బడ్జెట్ అంతా ఉంది. అంటే ఏ రేంజ్ లో డ్రగ్స్ బిజినెస్ నడుస్తుందో అర్థమవుతోంది.

గుట్టు చ‌ప్పుడు కాకుండా.. పోలీసుల క‌ళ్లు గ‌ప్పి..

పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే మొదటిసారేం కాదు. గతంలో కూడా చాలాసార్లు తీరం వెంబడి.. దేశంలోని ప్రధాన నగరాల్లో వందలు, వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడ్డాయి. పదుల మందిని అరెస్ట్ చేసి నార్కోటిక్స్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైళ్లకు పంపిణా డ్రగ్స్ రవాణా కట్టడి కావడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తీసుకొచ్చి డార్క్ వెబ్ సైట్లు, ఆన్ లైన్ వెబ్ సైట్లు, ఆన్ లైన్ డెలివరీ బాయ్స్ రూపంలో కస్టమర్లకు సరుకు పంపిస్తున్నారు డ్రగ్ పెడ్లర్లు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, స్టేట్ పోలీసుల కళ్లు గప్పి దందా నడిపిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఈ డ్రగ్స్ ను.. మనదేశంలో చైనా, నైజీరియన్స్ తో వ్యాపారులు సేల్స్ సాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు అరెస్టులు, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ వ్యాపారం జరుగుతూనే ఉంది.

ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం దాదాపు 2వేల 5వందల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి, మహారాష్ట్ర, ఢిల్లీలో భారీ ఎత్తున మెఫెడ్రిన్ అనే మాదక ద్రవ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. పుణే నుంచి 75 కిలోమీటర్ల దూరంలోని షోలాపుర్‌ దగ్గర కుర్‌కుంభ దగ్గరలోని ఓ ఫార్మా ప్లాంట్‌లో 7వందల కేజీల డ్రగ్‌ను సీజ్‌ చేశారు. మరోవైపు ఢిల్లీలో దాడులు చేసి 4వందల కేజీల డ్రగ్స్ పట్టుకున్నారు.

వారం రోజుల క్రితం కూడా పుణే సిటీ పోలీస్ పెద్ద డ్రగ్ రాకెట్ ను పట్టుకున్నారు. 3వేల కోట్ల విలువ చేసే 17వందల కిలోల మెఫెడ్రోన్ ను సీజ్ చేశారు. దౌండ్ తాలూకాలోని పలు ఫ్యాక్టరీలు, న్యూఢిల్లీలోని సౌత్ ఎక్స్‌టెన్షన్‌లోని కొన్ని దుకాణాలపై దాడులు జరిగాయి. గతేడాది మే 13న కూడా..ఇండియన్ నేవీ అండ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జాయింట్ ఆపరేషన్ లో కేరళ తీరానికి దగ్గరలో భారీస్థాయిలో డ్రగ్స్ పట్టుకున్నారు. 12వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను సీజ్ చేశారు. అప్పుడు పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

2023 మార్చి 7న ఇండియన్ కోస్ట్ గార్డ్స్, గుజరాత్ ఏటీఎస్ బలగాల జాయింట్ ఆపరేషన్ లో.. ఓ ఇరానియన్ బోటు నుంచి 425 కోట్ల విలువ చేసే 61 కిలోల హెరాయిస్ సీజ్ చేశారు. గతేడాది జూన్ 6న దేశవ్యాప్తంగా డార్క్-నెట్ ఆధారిత డ్రగ్‌ను గుర్తించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో..LSD డ్రగ్ ని స్వాధీనం చేసుకుంది. 2023 డిసెంబర్ 1న ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు 22 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్ షిప్ లో తరలించిన ఆ డ్రగ్స్ విలువ 220 కోట్లు ఉంటుందని అంచనా. గతేడాది డిసెంబర్ 12న బెంగుళూరులో 21 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. అక్కడ ఓ నైజీరియన్ ను అరెస్టు చేశారు అధికారులు. 2021 ఏప్రిల్ 19న ఇండియన్ నేవీ అరేబియా సముద్రంలో ఫిషింగ్ ఓడ నుంచి 3వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది.

ఆపరేషన్ సముద్ర గుప్త్

డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకుంటోంది కేంద్రప్రభుత్వం. అంతర్గత డ్రగ్స్ నివారణతో పాటు దేశంలోకి డ్రగ్స్ రాకుండా బార్డర్ లో నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. పాకిస్తాన్, పంజాబ్ సరిహద్దులు, రాజస్తాన్ బార్డర్లు, ఎయిర్ పోర్టులు, అన్ని ఓడ రేవులు, తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ డ్రగ్స్ ముఠా జలమార్గాన్నే రవాణాకు ఎంచుకోవడంతో ఇండియన్ నేవీ నిఘా పెంచింది. ఆపరేషన్ సముద్ర గుప్త్ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్రప్రభుత్వం. 2047 నాటికి ఇండియాను డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే ఇప్పటివరకు పట్టుబడుతున్న డ్రగ్స్ ముఠాల్లో ఎక్కువగా పాక్ లింకులు బయటపడ్డాయి. ఇది ఓ రకమైన కుట్రలో భాగమేనని అనుమానిస్తున్నారు భద్రతా అధికారులు. బార్డర్ లో పాక్ కవ్వింపు చర్యలు, ఉగ్రకుట్రలను భగ్నం చేస్తూనే ఉన్నారు. డ్రగ్స్ ను కూడా పూర్తిగా మనదేశంలోకి రాకుండా కంట్రోల్ చేస్తామంటున్నారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసి..ఇండియాకు డ్రగ్స్ తేవాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తామంటోంది కేంద్రప్రభుత్వం.