BJP : నార్త్ టు సౌత్.. ఎక్కడైనా కమల వికాసమే లక్ష్యం..!

నార్త్ టు సౌత్ ఎక్కడైనా కమల వికాసమే లక్ష్యంగా.. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పక్కా స్కెచ్ తో పనిచేస్తున్నారు బీజేపీ పెద్దలు.

BJP : నార్త్ టు సౌత్.. ఎక్కడైనా కమల వికాసమే లక్ష్యం..!

Bharatiya Janata Party focus on South India

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. ఎక్కడైనా కాషాయమే ఉండాలి. అన్ని రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉండాలి. ఇదే ఎజెండాతో పనిచేస్తోంది మోదీ, అమిత్ షా ద్వయం. నార్త్ టు సౌత్ ఎక్కడైనా కమల వికాసమే లక్ష్యంగా.. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పక్కా స్కెచ్ తో పనిచేస్తున్నారు బీజేపీ పెద్దలు. మోదీ రెండో టర్మ్ వచ్చేసరికి నార్త్ లో బీజేపీ మరింత పటిష్టంగా తయారైంది. ఇప్పుడు రామమందిర నిర్మాణం తర్వాత నార్త్ లో పార్టీ మరింత బలపడిందని లెక్కలు వేసుకుంటున్నారు బీజేపీ లీడర్లు. ఎటొచ్చి సౌత్ లోనే బీజేపీకి కష్టం.

వాజ్ పేయ్ హయాం నుంచి కూడా దక్షిణాదిలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు కమలనాథులు. కర్నాటకలో పలుమార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ అక్కడ ఓడిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కర్నాటకలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించొచ్చని అంచనా వేస్తున్నాయి సర్వే సంస్థలు. ఇక తెలంగాణలో బీజేపీకి అంతో ఇంతో పట్టుంది. గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు కూడా గెలుచుకుంది. ఏపీలో బీజేపీకి ఓటు షేర్ ఉంది. ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కమలనాథులకు సహకరిస్తూనే ఉన్నారు. ఇక కేరళలో మూడు నాలుగు పార్టీలు ఎన్నికల రేసులో ఉంటాయి. ఆ స్టేట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ ఎక్సపరిమెంట్స్ చేయడం సరైన సమయం కాదని భావిస్తోంది బీజేపీ.

త‌మిళ‌నాడు పై గురి..!
ఇక బీజేపీ తమకు అవకాశం ఉందని భావిస్తోన్న మరో దక్షణాది రాష్ట్రం తమిళనాడు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకేమి లేదు. అయితే డీఎంకే లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా ఉంటుంది తమిళనాట రాజకీయం. కానీ కొన్నాళ్లుగా అన్నాడీఎంకే బలహీనపడుతూ వస్తోంది. జయలలిత మరణం తర్వాత పార్టీలో చీలికలు, వర్గ విభేదాలతో అన్నాడీఎంకే ఆగమాగం అయింది. ఈ పరిస్థితుల్లో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చి స్టాలిన్ సీఎంగా అయ్యారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నారు స్టాలిన్. మరో రీజినల్‌ పార్టీ అన్నాడీఎంకే
బీజేపీతో సఖ్యతగా ఉండేది. అయితే కొన్నాళ్ల క్రితం పలు కారణాలతో అన్నాడీఎంకే, బీజేపీ స్నేహానికి బ్రేక్ పడింది. తర్వాత అన్నాడీఎంకు ఆదరణ తగ్గుతూ వస్తోందని భావించింది బీజేపీ. అక్కడ సెకండ్ ప్లేస్ తమదేనని అంచనా వేస్తోంది. ఇప్పుడు బీజేపీ ఒంటరిగానే తమిళనాట తమ సత్తా ఏంటో చూపించాలనుకుంటోంది. అదే లక్ష్యంతో స్టాలిన్ సర్కార్ అవినీతిని, విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వస్తున్నారు బీజేపీ లీడర్లు.

తమిళనాడులో బలపడటానికి 2019 నుంచే వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తూ వస్తోంది బీజేపీ. దూరదృష్టితో బీజేపీ అమలు చేసే వ్యూహాత్మక నిర్ణయాలు రాజకీయ పండితులకు కూడా అంతుపట్టవు. 2019లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటనకు వచ్చారు. దేశరాజధాని ఢిల్లీలో జిన్‌పింగ్‌తో సమావేశమయ్యే వెసులుబాటు ఉన్నా మోడీ మాత్రం మహాబలిపురాన్ని మీటింగ్‌ ప్లేస్‌గా ఎంచుకున్నారు. ఈ రకంగా ఏదో రూపంలో తమిళనాడుకు దగ్గరయ్యేందుకు మోడీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపిస్తుండటం, విపక్షాలను బీజేపీ వ్యతిరేక కూటమిగా ఏర్పడటం వంటి పరిణామాలతో..దక్షిణాది అవకాశాలను వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు కమలనాథులు. హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయంగా ఉన్న తమిళనాడు నుంచే హిందుత్వ రాజకీయం చేస్తే ఎన్నికల్లో కలిసి వస్తుందన్న నమ్మకం బీజేపీలో కనిపిస్తోంది. అందుకే ఈసారి తమిళనాడుపై ఫుల్ ఫోకస్ పెట్టింది బీజేపీ.

బీజేపీ సిద్ధాంతాల‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెలుతున్న అన్నామలై..
తమిళనాట బీజేపీ బలపడటానికి మరో కారణం అన్నామలై. రిటైర్డ్ ఐపీఎస్ అయినా అన్నామలై.. బీజేపీ సిద్దాంతలను బలంగా తమిళప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. విద్యావంతుడు కావడం.. మాట్లాడే ప్రతీ మాటలో నిజాయితీ, లాజిక్ కనిపించడంతో తమిళనాడు ప్రజలు అన్నామలై ప్రసంగాలకు ఆకర్షితులు అవుతున్నారు. కొన్నాళ్లుగా తమిళనాడులో పాదయాత్ర చేశారు అన్నామలై. ఈ నేపథ్యంలోనే ఆరు నెలలుగా తమిళనాడు కేంద్రంగా అనేక రాజకీయ కార్యక్రమాలను చేపడుతోంది బీజేపీ. లోకల్‌గా ఉన్న లీడర్లతో పాటు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. తమిళనాడు బీజేపీ ఫైర్ బ్రాండ్‌ అన్నామలై చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ పాదయాత్ర ముగింపు సభకు తమిళనాడు వచ్చిన ప్రధాని మోదీ 17వేల 3వందల కోట్ల విలువైన పనులను ప్రారంభించారు.

తమిళనాడు తూత్తుకుడిలో పర్యటించిన మోదీకి అపూర్వస్వాగతం లభించింది. తన ప్రసంగంలో మాజీ సీఎంలు దివంగత ఎంజీఆర్, జయలలితను కొనియాడారు ప్రధాని. ఎంజీఆర్ కుటుంబ పాలనకు దూరంగా సుపరిపాలన అందించిన నేత అని అభివర్ణించారు. ఎంజీఆర్ తర్వాత తమిళనాడు అభివృద్ధికి పాటు పడిన నేత అమ్మ జయలలితేనని చెప్పారు. సేమ్ టైమ్ తమిళనాట అధికారంలో ఉన్న డీఎంకేను టార్గెట్ చేస్తోంది బీజేపీ. మోదీ కూడా స్టాలిన్ సర్కార్ పై విమర్శల బాణాలకు ఎక్కుపెట్టారు. ఎంజీఆర్‌ను అవమానించే విధంగా డీఎంకే పనిచేస్తోందని.. కుటుంబపాలనపై ఉన్న శ్రద్ద అభివృద్ధిపై లేదని అటాక్ చేశారు. తమిళనాడుతో మోదీకి ఎప్పటినుంచో అనుబంధం ఉంది. తమిళనాడు సమున్నత వారసత్వాన్ని గౌరవించేందుకే పార్లమెంటులో సెంగోల్ ను ప్రతిష్టించారు. తమిళ భాష, సంస్కృతికి తగిన ప్రాధాన్యం కల్పిస్తున్నారు.

తమిళనాట రాజకీయాలను జాగ్రత్తగా ప‌రిశీలిస్తోన్న బీజేపీ..
సరిగ్గా 32 ఏళ్ల క్రితం 1991లో కన్యాకుమారి నుంచి తాను ఏక్తాయాత్ర చేశారు మోదీ. ఇప్పుడు అన్నామలై చేపట్టిన ఎన్ మాన్..ఎన్ మక్కల్ పాదయాత్ర తమిళనాడును కొత్తమార్గం వైపు తీసుకెళ్తుందని నమ్ముతున్నారు కమలనాథులు. తమిళనాడులో బీజేపీ అధికారంలో లేకపోయినా ఆ రాష్ట్రం ఎప్పుడూ బీజేపీ గుండెల్లోనే ఉంటుందని చెప్పుకుంటున్నారు కమలనాథులు. గత పదేళ్లలో తమిళనాడుకు కేటాయించిన నిధులే దానికి నిదర్శనమంటున్నారు.

ఇలా తన ప్రసంగాలలో తమిళనాడు ప్రజల మనోభావాలను టచ్ చేస్తున్నారు ప్రధాని. రాజకీయంగా బలపడేందుకు తమిళనాడులో డెవలప్ మెంట్ తో పాటు ఆ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తోంది బీజేపీ. ఆ స్టేట్ లో బలపడేందుకు ఎప్పటి నుంచో రోడ్ మ్యాప్ వేసుకొని పనిచేసుకుంటూ వస్తోంది. బీజేపీ ముందు ఇప్పటికిప్పుడు ఉన్న సవాల్ లోక్ సభ ఎన్నికలు. తమిళనాడులో ఒంటరిగా అధికారంలోకి రావడం ఒక ఎజెండా అయితే.. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలనేది మరో మెయిన్ టార్గెట్. అందుకే తమిళనాట రాజకీయాలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది బీజేపీ. ఎలాగూ అన్నాడీఎంకే డీలా పడిపోయింది. డీఎంకేపైప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఇక తమకే అవకాశం ఉందని భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా పావులు కదుపుతున్నారు మోదీ, అమిత్ షా. అన్నాడీఎంకే ఓటు బ్యాంకును టర్న్ చేసుకోవడానికి ఎంజీఆర్, జయలలితపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తోంది. వాళ్లు అభివృద్ధి చేసిన అభివృద్ధిని పోలుస్తూ ఇప్పుడున్న డీఎంకేను టార్గెట్ చేస్తోంది బీజేపీ.

టార్గెట్ ఫిక్స్‌..
కొన్నాళ్లుగా తమిళనాడుపై బీజేపీ పెట్టిన ఫోకస్ ఫలిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో తమిళనాడులో బీజేపీ ఓటు బ్యాంకు నామమాత్రంగా ఉండేది. అంటే ఒకటి రెండు శాతానికి మించిలేదు. మోదీ రెండోసారి ప్రధాని అయినప్పటి నుంచి తమిళనాడులో చేపట్టిన కార్యక్రమాలు, ఆ స్టేట్ బీజేపీ చీఫ్ అన్నామలై పాదయాత్ర అన్నీ కలిసి వచ్చాయని చెబుతున్నారు. బీజేపీ అంతర్గత సర్వేలతో పాటు పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో..తమిళనాడులో బీజేపీ ఓటు బ్యాంకు 14శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది. ఈ హోప్ తోనే తమిళనాట కాషాయ జెండా పాతాలని భావిస్తోంది కమలం పార్టీ. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి.. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ లోకి రావాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది బీజేపీ.

తమిళనాడులో పార్టీని పటిష్టం చేసేందుకు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సౌత్ మిషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసేందుకు ఈసారి నేరుగా ప్రధానమంత్రి మోదీ రంగంలోకి టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో తమిళనాడుతో ప్రధానమంత్రి మోదీ బాగా కనెక్ట్ అవుతున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి బీజేపీ పెద్దలు తమిళ టచ్ ఇచ్చారు. లోక్‌సభలో మోదీ చేతుల మీదుగా రాజదండాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా అటెన్షన్ మొత్తం మారిపోయింది. ఇదొక్కటే కాదు.. దక్షిణాది రాష్ట్రాలను..మరీ ముఖ్యంగా తమిళనాడు ప్రజలకు దగ్గరయ్యేందుకు కమలనాథులు మోదీ స్థాయిలో రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. బీజేపీ ఇన్‌సైడ్ టాక్ నిజమే అయితే.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ తమిళనాడు నుంచి పోటీ చేసే చాన్సుంది.

గతేడాది మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో తమిళకాశీ సంఘం సమావేశాలను నెలరోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న కాశీకి.. తమిళనాడులో ఉన్న రామేశ్వరానికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ తమిళ కాశీ సంఘం వేదికగా అనేక కార్యక్రమాలను నిర్వహించారు. నాగరికత, ఆధ్యాత్మికత, సాంస్కృతిక విషయాల్లో కాశీకి, రామేశ్వరానికి విడదీయరాని బంధం ఉందని మోదీ చెప్పుకొచ్చారు. కాశీ విష్ణుమూర్తికి నిలయమైతే.. తమిళనాడు రామనాథమూర్తికి నిలయంగా మారిందంటూ కాశీ రామేశ్వర బంధాన్ని ఆవిష్కరించారు. ఈ రెండు సందర్భాల్లోనూ మోదీ నేరుగా తమిళనాడుతో ‌కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి ఈ రెండింటినీ అడ్డం పెట్టుకుని తమిళనాడు రాజకీయాల్లో బలం పుంచుకునే ప్రయత్నం మొదలుపెట్టింది కాషాయ పార్టీ.

రంగంలోకి దిగ‌నున్న ప్ర‌ధాని మోదీ..
ఇప్పటికే వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి మోదీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే మరోసారి పోటీ చేస్తూనే.. తమిళనాడు నుంచి కూడా బరిలో దిగే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. దక్షిణాదిన పుంజుకోవాలంటే.. అది మోదీ మానియాతో సాధ్యమని నమ్ముతున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్దలు మోడీని రంగంలోకి దింపుతున్నారు. రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి మోడీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీజేపీ హిందుత్వ విధానాలకు ప్రతిరూపంగా ఉండే రామేశ్వరం క్షేత్రం ఈ ఎంపీ సీటు పరిధిలో ఉంది. ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి..వారణాసి తరహాలో బీజేపీలో జోష్ నింపాలని మోడీ భావిస్తున్నారట.

మోడీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల జాబితాలో కన్యాకుమారి కూడా ఉంది. కేరళ సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. 2014లో ఇక్కడి నుంచి బీజేపీ గెలిచినా.. 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో కన్యాకుమారి స్థానం నుంచి మోదీ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీజేపీ అభ్యర్థి గానీ, లేదా మోడీ గానీ ఇక్కడ గెలిస్తే.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ ప్రభంజన వీస్తోందన్న సంకేతాలను ప్రత్యర్థి పార్టీలకు పంపించొచ్చని స్కెచ్ వేస్తోంది బీజేపీ.