Space tourism : స్పేస్ టూరిజంకు పుల్ క్రేజ్‌.. 2030 నాటికి ప్రారంభించే యోచ‌న‌లో భార‌త్..

అంతరిక్ష పర్యటన అంటే ఉత్సాహం చూపించని వారు ఎవరుంటారు..?

Space tourism : స్పేస్ టూరిజంకు పుల్ క్రేజ్‌.. 2030 నాటికి ప్రారంభించే యోచ‌న‌లో భార‌త్..

India America and China focus on Space tourism

ప్రపంచాన్ని ఒకచోట చేర్చే సామర్థ్యం పర్యాటకరంగానికి మాత్రమే ఉంది. అది భూమిపై అయినా, అంతరిక్షంలో అయినా సరే.. ఎప్పుడూ వెళ్లని చోట ఏముందో చూడాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అందులోనూ చంద్రుని మీద అడుగు పెట్టే అంతరిక్ష పర్యటన అంటే ఉత్సాహం చూపించని వారు ఎవరుంటారు..? ఆ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ కాస్తా వరల్డ్ వైడ్ స్పేస్ టూరిజానికి క్రేజ్‌ను తెచ్చిపెడుతోంది.. దీంతో ప్రపంచ దేశాలు ఒకదానికొకటి పోటీపడి మరీ అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నాయి. భారత్, అమెరికా, చైనాతో పాటు.. పలువురు ప్రైవేటు వ్యక్తులు కూడా స్పేస్ టూరిజంపై ఫోకస్ పెట్టారు.

దాంతో ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పర్యాటకం అనేమాట హల్‌చల్ చేస్తోంది. అయితే స్పేస్ టూరిజం అంటే కాస్త రిస్క్ తో కూడుకున్నదే. అయినా అడ్వెంచర్ టూర్ అంటే ఇష్టపడేవారు చాలామందే ఉంటారు. అయితే స్పేస్ టూరిజం అందరికీ అందుబాటులో ఉండదు. అంతరిక్ష పర్యాటనకు అయ్యే ఖర్చు సామాన్యులు భరించే పరిస్థితి ఉండదు. ధనవంతులు అదికూడా కోటీశ్వరులు మాత్రమే రోదసీ యాత్ర చేస్తారు. అంతరిక్షంలోకి రానూపోనూ ఒక్కో టికెట్ ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది.

2030 నాటికి భార‌త్‌లో స్పేస్ టూరిజం..
మనదేశంలో అంతరిక్ష పర్యాటకానికి మొదట్లోనే బోలెడంత క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో 2030 నాటికి భారతదేశంలో తొలిసారి స్పేస్ టూరిజం ప్రారంభించాలని ఇస్రో యోచిస్తోంది. ఈ రోదసీ యాత్రలో ఒక్కో టికెట్ ధర దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఉండే అవకాశముంది. ఈ రోదసి యాత్ర చేసివచ్చిన వారిని వ్యోమగాములు అని పిలుస్తారు. ఇండియా స్పేస్ టూరిజం ప్రాజెక్టును త్వరలోనే ట్రాక్ ఎక్కిస్తామంటోంది ఇస్రో. 2026లో జపాన్‌తో కలిసి భారత్‌ మళ్లీ చంద్రునిపైకి తన అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టనుంది. ఆ ప్రయోగంలో చంద్రునిపై మంచు నీరును గుర్తించాలని చూస్తుంది. చైనా చంద్రునిపై 2036 కల్లా బేస్‌ను ఏర్పాటు చేయాలనుకుంటుంది. భారత్ కూడా ఇదే రకమైన ప్రాజెక్టును ప్రకటించింది. ఒకవేళ దీనిలో విజయం సాధిస్తే, చంద్రుని గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని అక్కడి నుంచే అంతరిక్షంలోకి రాకెట్లను ప్రయోగించడం ఈజీ అవుతుంది.

అంతరిక్షంలోకి వెళ్లాలంటే రాకెట్ టెక్నాలజీ అత్యంత ముఖ్యం. చంద్రునిపై మనిషిని దించాలంటే అత్యంత శక్తిమంతమైన రాకెట్ కావాలి. అమెరికా 1969లో ఇద్దరు వ్యోమగాములను అపోలో 11 అంతరిక్ష నౌక ద్వారా చంద్రునిపైకి పంపింది. అపోలో 11 విజయవంతమైన తర్వాత, ఇతర అపోలో మిషన్ల ద్వారా చంద్రునిపైకి మరో పది మంది వ్యోమగాములను పంపించింది. 1972లో నాసా మూన్ ల్యాండర్ అపోలో 17 ను ప్రయోగించింది. ఆ తర్వాత 50 ఏళ్ల తర్వాత ఈఏడాది ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన వ్యోమనౌక మరోసారి చంద్రుడిపై దిగింది. ఫిబ్రవరి 15న స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఆరు కాళ్లు ఉన్న లూనార్ ల్యాండర్ ఒడిస్సియస్‌ను ప్రయోగించారు.

చైనా, అమెరికాల మ‌ధ్య తీవ్ర పోటీ..!
కొన్నేళ్లుగా అమెరికా, చైనా మధ్య ఘర్షణ పరిస్థితులున్నాయి. ఈ రెండు దేశాలు తమ శత్రుత్వాన్ని భూమి నుంచి అంతరిక్షం వరకు తీసుకెళ్తున్నాయి. వచ్చే ఐదు నుంచి పదేళ్లలో చంద్రునిపైకి మానవ మిషన్లను పంపించేందుకు అమెరికా, చైనాలు పోటీ పడుతున్నాయి. మొదట చంద్రుడి మీద అడుగుపెట్టాలన్నదే అన్ని దేశాల లక్ష్యంగా మారింది. చంద్రుడు భూమికి దగ్గర ఉండటం.. ఉపరితలంపై తక్కువ గురుత్వాకర్షణ వల్ల చంద్రుడిపై రాకెట్ ల్యాండింగ్ కాస్త ఈజీ అవుతుంది. అంగారక గ్రహంపైకి చేరుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు పడితే..చంద్రుడిపైకి వెళ్లేందుకు మూడు రోజులే పడుతుంది. అందుకే చంద్రునిపైకి చేరుకోవాలన్నదే లక్ష్యమైంది.

Also Read: త్వరలో ప్రతియుద్ధ నౌకలో బ్రహ్మోస్‌ క్షిపణులు.. ఫసిఫిక్‌ రీజియన్‌లో తిరుగులేని శక్తిగా భారత్

అంతరిక్ష పరిశోధన మిషన్ల కోసం ప్రైవేట్ రంగంలోని కంపెనీలతో అమెరికా, చైనాలు కలిసి పనిచేస్తున్నాయి. మనుషులను చంద్రునిపైకి తీసుకెళ్లి, అక్కడ కొంతకాలం ఉంచి, పరిశోధనలు జరిపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 2001లో అమెరికన్‌ మిలియనీర్‌ డెన్నిస్‌ టిటో రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీకి రూ.165 కోట్లు చెల్లించి స్పేస్‌ టూరిస్ట్‌గా అంతరిక్షంలో 8 రోజులు గడిపి తిరిగి వచ్చారు. ప్రపంచంలో మొట్టమొదటి స్పేస్‌ టూరిస్ట్‌ ఆయనే.

అంగార‌క గ్ర‌హంపైకి 10ల‌క్ష‌ల మందికి తీసుకెళ్లామ‌న్న మ‌స్క్‌..
టెస్లా అధినేత, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్.. ఇప్పటికే తన స్పేస్‌ఎక్స్ వెంచర్ నుంచి రాకెట్ పంపించారు. డ్రాగన్ క్యాప్సూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి సురక్షితంగా తిరిగి వచ్చింది. ఆ తర్వాత సంచలన ప్రకటన చేశారు ఎలాన్ మస్క్. అంగారక గ్రహంపైకి 10 లక్షల మందిని తీసుకెళ్తామని ట్వీట్ చేశారు. అంగారకుడిపై నివసించేందుకు చాలా పనిచేయాల్సి ఉందన్నారు. స్టార్‌ షిప్‌ అతిపెద్ద రాకెట్‌ ఇది. ఇది మనల్ని మార్స్‌ వద్దకు తీసుకెళ్తుంది అంటూ ఒక యూజర్‌ చేసిన పోస్టుకు మస్క్‌ స్పందించారు.

స్పేస్ టూరిజం డెవలప్ మెంట్.. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం వరకు బానే ఉన్నా.. భవిష్యత్ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఒకవేళ ఇతర గ్రహాలపైకి వెళ్లి, అక్కడ మానవ నివాసాలను ఏర్పాటు చేయాలనుకుంటే, అక్కడుండే నిబంధనలు ఏంటి..? నేరాలను ఎలా నిర్వచిస్తారు..? వాటికి శిక్ష ఏంటి..? అనేవి నిర్ణయించాల్సి ఉందంటున్నారు. స్పేస్ మిషన్లలో ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడటం ప్రభుత్వాలకు ఆందోళనకరమైందేనని..స్పేస్‌ఎక్స్‌చీఫ్ మస్క్ తో అయితే సమస్య ఉంటదంటున్నారు నిపుణులు. ఎలన్‌ మస్క్‌, ప్రైవేటు స్పేస్ సంస్థలను నియంత్రించడం కష్టమైతే, అత్యంత శక్తిమంతంగా మారే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.