త్వరలో ప్రతియుద్ధ నౌకలో బ్రహ్మోస్‌ క్షిపణులు.. ఫసిఫిక్‌ రీజియన్‌లో తిరుగులేని శక్తిగా భారత్

భారత యుద్ధ నౌకలన్నింటిలోనూ బ్రహ్మోస్‌లని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది రక్షణశాఖ. నౌకాదళంలో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా నిలిచేందుకు భారత్‌ కసరత్తు చేస్తోంది.

త్వరలో ప్రతియుద్ధ నౌకలో బ్రహ్మోస్‌ క్షిపణులు.. ఫసిఫిక్‌ రీజియన్‌లో తిరుగులేని శక్తిగా భారత్

BrahMos missile now our primary weapon says Navy Chief

BrahMos Missile: భారత రక్షణ దళం మరో కీలక ముందడుగు వేసింది.. సముద్ర పోరాటంలో మరో అద్భుత ఆయుధాన్ని రంగంలోకి దింపబోతుంది. ఫసిఫిక్‌ రీజియన్‌లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్.. దాయాది దేశాలు మన భూభాగంలో అడుగు పెట్టాలంటే భయం పుట్టే¬లా చేసేందుకు ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేసుకుంటోంది. మిసైల్స్‌ మహారాజుగా ఎదిగే దిశగా దూసుకుపోతోంది. అత్యంత శక్తిమంతమైన, భారత నౌకాదళ ప్రధాన ఆయుధమైన బ్రహ్మోస్‌ క్షిపణులను ప్రతియుద్ధ నౌకలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇండియన్ నేవీకి ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణే బ్రహ్మోస్‌. ఇప్పుడిదే నేవీకి కీలక ఆయుధం కానుంది. ఇతర దేశాల నుంచి సమకూర్చుకున్న పాతకాలపు క్షిపణి వ్యవస్థ స్థానంలో బ్రహ్మోస్‌ క్షిపణి వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్‌ క్షిపణి ఇప్పుడు మెయిన్ వెపన్ కానుంది. వైమానిక దళంలో, యుద్ధ విమానాల్లో కూడా బ్రహ్మోస్‌ క్షిపణే కీలకం కానుంది. ఈ క్షిపణి సామర్థ్యాలు, పరిధిని మెరుగుపరిచి.. సూపర్ స్పీడ్ తో టార్గెట్ ను కొట్టేలా దీన్ని తయారు చేశారు.

బ్రహ్మోస్ రిపేర్లు కూడా మన దగ్గరే చేయొచ్చు
బ్రహ్మోస్‌ చాలా శక్తిమంతమైన క్షిపణి. దీని రేంజ్, కెపాసిటీ ఫస్ట్ ఫేజ్ కంటే బాగా పెరిగింది. బ్రహ్మోస్‌ క్షిపణి మనదేశంలోనే తయారవుతుంది. ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. రిపేర్లు కూడా మనదగ్గరే చేయొచ్చు. స్పేర్‌ పార్ట్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది భారత్‌కు చాలా సానుకూలాంశం. త్వరలో 2వందలకు పైగా క్షిపణుల కొనుగోలుకు రూ.19 వేల కోట్ల డీల్‌కు భారత క్యాబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ క్లియరెన్స్‌ ఇచ్చింది. ఈ డీల్‌పై బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమెటెడ్‌, భారత రక్షణ శాఖ వచ్చే నెల 5న సంతకాలు చేయనున్నాయి. బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ అనేది 1998లో ఏర్పాటైన భారత్‌-రష్యా జాయింట్‌ వెంచర్‌.

భారత యుద్ధ నౌకలన్నింటిలోనూ బ్రహ్మోస్‌లని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది రక్షణశాఖ. నౌకాదళంలో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా నిలిచేందుకు భారత్‌ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. భారతదేశంలోని ప్రతి నౌక, జలాంతర్గామి, విమానాలు, ఆయుధ వ్యవస్థ తయారీలో భారత్‌ స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతోంది. భారత నావికాదళం 2047 నాటికి పూర్తిగా స్వావలంబన సాధించేదిశగా అడుగులు వేస్తోంది.

బ్రహ్మోస్ సంస్థలో భారత్ వాటా 50.5 శాతం
బ్రహ్మోస్‌ను భారతదేశంలోనే తయారు చేయడంతో.. ఇండియా ఇప్పుడు ఆయుధ సంపత్తిలో సెల్ఫ్ మేడ్ అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ క్షిపణి దేశానికి సూపర్ రాకెట్. బ్రహ్మోస్ ర్యామ్‌ జెట్ ఇంజన్ తో పనిచేస్తుంది. నేలపై నుంచి, సముద్రంలో యుద్ధ నౌకలపై నుంచి, సముద్రం లోపల జలాంతర్గాముల నుంచి, ఆకాశంలో యుద్ధ విమానాల నుంచి దీన్ని ప్రయోగించొచ్చు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, రష్యాకు చెందిన NPO మాషినో స్ట్రోయేనియాలు కలసి ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ భారత్‌లో ఈ క్షిపణిని తయారుచేస్తోంది. ఈ సంస్థ 1998 ఫిబ్రవరి 12న 30 కోట్ల డాలర్ల క్యాపిటల్ ఫండ్ తో ఏర్పాటైంది. బ్రహ్మోస్ సంస్థలో భారత్ వాటా 50.5శాతం, రష్యా వాటా 49.5శాతం ఉంది. భారత్ లోని బ్రహ్మపుత్ర నది, రష్యా లోని మోస్క్వా నది- ఈ రెండు పేర్లలోని మొదటి భాగాలను కలపగా ఏర్పడిందే బ్రహ్మోస్.

నౌకా విధ్వంసకర క్షిపణులన్నింటిలో బ్రహ్మోస్ సూపర్ 
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న నౌకా విధ్వంసకర క్షిపణులన్నింటిలో బ్రహ్మోస్ అత్యంత వేగవంతమైనది. ఈ క్షిపణి మ్యాక్ 2.8 నుంచి 3.0 వేగంతో ప్రయాణిస్తుంది. విమానం నుంచి ప్రయోగించే రకం క్షిపణిని 2019లో మోహరించారు. జలాంతర్గామి నుంచి ప్రయోగించగల రకాలు ప్రస్తుతం పరీక్షల్లో ఉన్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్నాయి. బ్రహ్మోస్‌ను మొదటగా 2001 జూన్ 12న చాందీపూర్ నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఆ తర్వాత 50 సార్లకు పైగా బ్రహ్మోస్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో మెజార్టీ టెస్ట్ లల్లో మిస్సైల్ సక్సెస్ అయింది. లేటెస్ట్ సాఫ్టువేరుతో లక్ష్యాన్ని ఎంచుకోవడంలో విచక్షణ చూపే సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. గుంపుగా ఉన్న లక్ష్యాల్లోంచి ఒక ప్రత్యేక లక్ష్యాన్ని ఎంచుకుని ఛేదిస్తుంది ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి.

భూమిపై 5 మీటర్ల ఎత్తు నుంచి 14 వేల మీటర్ల ఎత్తు..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన సాఫ్టువేరుతో.. పర్వతాల వెనుక దాగిన లక్ష్యాలను ఛేదిస్తుంది బ్రహ్మోస్. భూమిపై 5 మీటర్ల ఎత్తు నుంచి 14వేల మీటర్ల ఎత్తు వరకు ప్రయాణించి టార్గెట్ ను కొడుతుంది. 2.8 మ్యాక్ వేగంతో 290 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సెకనులో దాదాపు కిలోమీటర్ దూరం వెళ్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న నౌకా వ్యతిరేక క్షిపణుల్లో బ్రహ్మోస్ అత్యంత వేగవంతమైంది. ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ ఆపరేషన్ సూత్రాన్ని కలిగి ఉంటుంది. తక్కువ రాడార్ తో పనిచేస్తుంది.

బ్రహ్మోస్‌ క్షిపణులను కొనేందుకు వివిధ దేశాల ఆసక్తి
భారతదేశంలో తయారవుతున్న బ్రహ్మోస్‌ క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ జాబితాలో తొలి కొనుగోలుదారుగా ఫిలిప్పీన్స్‌ నిలిచింది. దాదాపు 375 మిలియన్‌ డాలర్లతో మిసైల్స్‌ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదర్చుకుంది. ఇటీవల చైనా నుంచి కవ్వింపు చర్యలు ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్‌ ఇబ్బందులు పడుతోంది. వీటికి చెక్‌ పెట్టేందుకు బ్రహ్మోస్‌ను కీలక ఆయుధంగా మలచుకోవాలని ఫిలిప్పీన్స్‌ భావించి ఈ ఒప్పందం చేసుకుంది. బ్రహ్మోస్‌ మాత్రమే కాకుండా తేజస్‌ యుద్ధ విమానాలను సైతం కొనుగోలు చేసేందుకు ఫిలిప్పీన్స్‌ ఆసక్తి చూపిస్తోందని భారత నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: అంతరిక్షానికి వెళ్లే వ్యోమగాముల పేర్లు ప్రకటించిన మోదీ.. వీరి ఎంపిక ఎలా జరిగిందంటే?

సాగర జలాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని కష్టాల్లో ఏ దేశం ఉన్నా సాయం చేసేందుకు ముందు వరుసలో ఉంటోంది భారత నౌకాదళం. ఇటీవల సముద్రపు దొంగల దాడుల్లో పలు దేశాల వర్తక నౌకలు చిక్కుకోవడంతో వాటిని కాపాడే బాధ్యతను ఇండియన్‌ నేవీ తీసుకుని సఫలీకృతమైంది.అందువల్ల భారత్‌తో భాగస్వామ్యం పెంచుకునేందుకు అన్ని దేశాలూ ఆసక్తి చూపిస్తున్నాయి.

అమ్ములపొదిలోకి లేటెస్ట్ టెక్నాలజీ వెపన్స్ 
ఆధునిక యుగంలో యుద్ధతంత్రం రూపు మారుతోంది. అమ్ములపొదిలోని పాతకాలం నాటి యుద్ద సామాగ్రి స్థానాన్ని టెక్నాలజీ వెపన్స్ ఆక్రమిస్తున్నాయి. లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించే క్షిపణుల ప్రాధాన్యం పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ఈ పోటీలో భారతదేశం ముందు వరుసలో ఉంది. స్వదేశీ సాంకేతిక సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంటూ అధునాతన ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది. ఇటీవల అభివృద్ధి చేసిన రక్షణ రంగ సాంకేతికత, జరిపిన ప్రయోగాలు, మిత్ర దేశాలతో కలిసి నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాల భారత రక్షణ శాఖ సామర్ద్యాన్ని తెలియజేస్తాయి. ఒక దేశ భద్రతకు, సమగ్రతకు రక్షణ రంగ సాంకేతికత అత్యంత అవసరం. శత్రుదేశాలపై పైచేయి సాధించడానికి, యుద్ధరంగంలో విజయానికి, యుద్ధం చేయకుండానే శత్రుదేశాలను కలవరపాటుకు గురిచేయడానికి టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం అనివార్యం. ఆ దిశగానే అడుగులు వేస్తూ మరింత పటిష్టం అవుతోంది భారత రక్షణశాఖ.