Indian origin leaders: అమెరికాలో గెలిచిన భారత సంతతి నేతలు వీరే.. వారి ప్రస్థానం ఇలా..
ఎన్నికల్లో గెలిచిన వారిలో భారత సంతతి నేతలు జోహ్రాన్ మామ్దానీ (న్యూయార్క్ మేయర్‌గా గెలుపు), అఫ్తాబ్ పురేవాల్ (సిన్సినాటి మేయర్‌గా రెండోసారి గెలుపు), గజాలా హష్మీ (వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలుపు) ఉన్నారు.
Indian origin leaders: న్యూయార్క్ నుంచి వర్జీనియా, సిన్సినాటి వరకు భారత సంతతికి చెందిన నాయకులు అమెరికా రాజకీయ రంగంలో దుమ్ముదులుపుతున్నారు.
అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. న్యూయార్క్ మేయర్ పదవితో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయ ఢంకా మోగించారు.
తాజాగా, ఎన్నికల్లో గెలిచిన వారిలో భారత సంతతి నేతలు జోహ్రాన్ మామ్దానీ (న్యూయార్క్ మేయర్‌గా గెలుపు), అఫ్తాబ్ పురేవాల్ (సిన్సినాటి మేయర్‌గా రెండోసారి గెలుపు), గజాలా హష్మీ (వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలుపు) ఉన్నారు.
మమ్దాని ప్రస్థానం
న్యూయార్క్‌లో జోహ్రాన్ మమ్దాని చారిత్రక విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఆ నగర మొదటి ముస్లిం మేయర్‌గా ఎన్నికయ్యారు మమ్దాని. రిపబ్లికన్ కర్టిస్ స్లివా, స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూ క్వోమోను మమ్దానీ ఓడించారు. అతి చిన్నవయసులోనే (38 ఏళ్లు) న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికై రికార్డు నెలకొల్పారు. ఈ పదవి దక్కించుకున్న తొలి దక్షిణాసియా వ్యక్తి కూడా ఆయనే. ఉగాండాలో భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు మమ్దాని జన్మించారు.
Also Read: మోదీ ప్రభుత్వ హయాంలో దుమ్ముదులుపుతున్న భారత క్రీడా రంగం.. ఎలా సాధ్యమైంది? ఏ మార్పులు చేశారు?
సిన్సినాటి నగర మేయర్ ఆఫ్తాబ్ ప్రస్థానం
సిన్సినాటిలో ఆఫ్తాబ్ రెండోసారి మేయర్‌గా గెలిచారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తమ్ముడు రిపబ్లికన్ కొరీ బౌమాన్‌పై ఆఫ్తాబ్ విజయం సాధించారు.
ఆఫ్తాబ్ తండ్రి పంజాబీ, తల్లి టిబెట్ శరణార్థి. ఓహాయోలో జన్మించిన ఆఫ్తాబ్‌కు చిన్నతనం నుంచే రాజకీయాలంటే మక్కువ. “బిగ్, బ్రౌన్ అండ్ బ్యూటిఫుల్” అనే నినాదంతో విద్యార్థి సంఘ ఎన్నికల్లోనూ గెలిచారు.
న్యాయవాదిగా శిక్షణ పొందిన ఆఫ్తాబ్ వాషింగ్టన్ డీసీలో పని చేశారు. తరువాత ఓహాయోలో ప్రత్యేక సహాయ యూఎస్ అటార్నీగా పనిచేసి, ప్రాక్టర్ అండ్ గాంబిల్‌లో న్యాయ సలహాదారుగా ఉన్నారు. తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2021 మేయర్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు ఓటర్లు మరోసారి ఆయనను స్పష్టమైన ఆధిక్యంతో గెలిపించారు.
గజాలా ప్రస్థానం
డెమోక్రాట్ గజాలా హష్మీ అమెరికాలో మొదటి భారత సంతతి ముస్లిం మహిళా లెఫ్టినెంట్ గవర్నర్‌గా చరిత్ర సృష్టించారు. ఆమె వర్జీనియాలో గవర్నర్ పదవికి పోటీ చేసిన గెలిచిన మొదటి ముస్లిం మహిళ కూడా. రిపబ్లికన్ రేడియో హోస్ట్ జాన్ రీడ్‌పై ఆమెకు ఆధిక్యం లభించింది.
భారత్‌లోని హైదరాబాద్‌లో జన్మించిన గజాలా అమెరికాలో కొంతకాలం పెరిగారు. తుపాకీ చట్టాల కఠినతరం, ఆరోగ్య సేవలు, ప్రజా విద్య, సంతానోత్పత్తి హక్కులు, వాతావరణ విధానాలపై ఆమె చాలా కాలం నుంచి గళం విప్పుతున్నారు.
