TV9 రవి ప్రకాష్ చుట్టూ ఉచ్చు : విచారణకు హాజరవుతారా

  • Published By: madhu ,Published On : May 10, 2019 / 01:12 AM IST
TV9 రవి ప్రకాష్ చుట్టూ ఉచ్చు : విచారణకు హాజరవుతారా

టీవీ9 రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయనపై నమోదైన సంతకం ఫోర్జరీ కేసు వివాదం మరింత ముదురుతోంది. నిన్న గంటకో మలుపు తిరిగిన ఈ కేసులో… విచారణకు హాజరవ్వాలని రవి ప్రకాష్‌తోపాటు మరో ఇద్దరికి నోటీసులిచ్చారు పోలీసులు. అయితే.. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన రవిప్రకాష్‌ మే 10వ తేదీ శుక్రవారం.. విచారణకు హజరువుతారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది.

టీవీ9 రవిప్రకాష్ నివాసంలో, కార్యాలయంలో పోలీసులు మే 09వ తేదీ గురువారం సోదాలు చేయడం కలకలం రేపింది. టీవీ9 సంస్థలో వాటాల కొనుగోలు, యాజమాన్య మార్పు విషయంలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఆయన నివాసంతోపాటు, సంస్థ కార్యాలయంలోనూ తనిఖీలు చేశారు. ఇది.. మీడియా వర్గాల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపింది.

కొంతకాలం క్రితం టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా.. రవిప్రకాష్‌పై ఫిర్యాదు చేసింది. రవిప్రకాశ్‌, శివాజీతోపాటు మరికొందరు ఫోర్జరీకి పాల్పడి నకిలీ పత్రాలు సృష్టించారంటూ అలంద మీడియా.. ఏప్రిల్ 24న సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు  చేసింది. ఏప్రిల్ 30న కూడా అలంద మీడియా కంపెనీ మరోసారి కంప్లైంట్ ఇచ్చింది. నకిలీ పత్రాలు సృష్టించారని రవిప్రకాశ్‌, మూర్తితోపాటు మరికొందరిపై ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. నిధులను దారి మళ్లించారంటూ ఆరోపించింది. 
Also Read : TV9 కార్యాలయంలో రవిప్రకాశ్ ను విచారిస్తున్న పోలీసులు

అలంద మీడియా చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని కోర్టు ఆదేశించడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రవిప్రకాశ్‌పై ఐపీసీ సెక్షన్‌ 406, 420, 467, 469, 471, 120 (బీ) కింద కేసులు నమోదు చేశారు. ఐటీ యాక్ట్‌లోని సెక్షన్‌ 66, 72 కింద కూడా కేసులు పెట్టారు. టీవీ9 ఆఫీస్‌తోపాటు, రవిప్రకాశ్‌, శివాజీ, మూర్తి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. 

దర్యాప్తులో భాగంగా మే 09వ తేదీ గురువారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని రవిప్రకాష్ నివాసంతోపాటు, బంజారాహిల్స్‌లోని టీవీ9 ప్రధాన కార్యాలయంలో సోదాలు జరిపారు పోలీసులు. అనంతరం సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు అందజేశారు. పోలీసులు రవిప్రకాష్ ఇంటికెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. రవిప్రకాష్‌కు చెందిన ఐ ప్రేమ్‌ సంస్థలోనూ తనిఖీలు చేసిన పోలీసులు.. అక్కడి ఉద్యోగులను విచారించారు.

టీవీ 9 కార్యాలయం, రవిప్రకాష్‌ నివాసంలో ప్రారంభమైన తనిఖీలు రాత్రి 9గంటల వరకు కొనసాగాయి. మొత్తం 11గంటలకు పైగా సాగిన ఈ తనిఖీల్లో పోలీసులు పలు హార్డ్‌ డిస్కులు, కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అయితే…  సోదాలు జరిపే సమయంలో రవిప్రకాష్ అటు కార్యాలయంలో గాని, ఇటు నివాసంలోగాని లేకపోవడంతో ఆయన పరారీలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ… సోదాలు కొనసాగుతుండగానే మధ్యాహ్నం తర్వాత సడెన్‌గా ఆయన టీవీ9 కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయనను పోలీసులు అక్కడే ప్రశ్నించారు.

రవిప్రకాశ్‌కు టీవీ9 కార్యాలయంలోనే నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఆయన వాటిని తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు… ఇదే కేసులో హీరో శివాజీతోపాటు టీవీ 9 ఆర్థిక వ్యవహారాలు చూసే మూర్తికి కూడా పోలీసులు నోటీసులు అందజేశారు. మే 10వ తేదీ శుక్రవారం ఉదయం 11గంటలకు విచారణకు హాజరుకావాలని సూచించారు. మరి పోలీసుల విచారణకు రవిప్రకాష్‌, శివాజీ, మూర్తి హాజరవుతారా..? లేరా అనేది సస్పెన్స్‌గా మారింది. మొత్తంగా ఇప్పటికే పలు మలుపులు తిరిగిన ఈ వివాదం మున్ముందు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.