పోలవరంపై ప్రయోగాలు వద్దు – చంద్రబాబు

  • Published By: madhu ,Published On : August 23, 2019 / 12:58 AM IST
పోలవరంపై ప్రయోగాలు వద్దు – చంద్రబాబు

పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు. తాజా తీర్పుపై ప్రభుత్వం ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆగదని.. ఈ జాప్యం ప్రాజెక్టుపై మరింత ప్రభావం చూపుతుందని అన్నారు.  పోలవరంపై ప్రయోగాలు వద్దని ఎవరెన్ని చెప్పినా వినకుండా ప్రభుత్వం మూర్ఖంగా వెళ్లిందని ఆరోపించారు. లేని అవినీతిని నిరూపించాలని చూశారన్నారు. ఒకసారి న్యాయవివాదం మొదలైతే ప్రాజెక్టు పూర్తవటం కష్టమని కేంద్రమంత్రి గడ్కరీ గతంలో సూచించిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రీ క్లోజర్‌ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ రగడ చెలరేగుతోంది. . టెండర్‌ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని కోర్టు స్పష్టం చేసింది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆగస్టు 22వ తేదీ గురువారం తీర్పు వెలువరించింది. దీంతో పోలవరం పనులు నవయుగ సంస్థే కొనసాగించే అవకాశముంది.

దీనిపై పలువురు నేతలు స్పందించారు. పోలవరంపై జగన్‌ తొందరపాటు నిర్ణయానికి న్యాయస్థానం తీర్పు చెంపపెట్టు అన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ. తెలుగు రాష్ట్రాలు విడిపోక ముందే పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపేందుకు చంద్రబాబు కృషి చేశారన్నారు. పోలవరం త్వరగా పూర్తి చేయాలని కష్టపడ్డామని.. కాని వైసీపీ తమపై అవినీతి ముద్రవేయాలని చూసిందన్నారు. కోర్టు తీర్పుతో అయినా జగన్‌ త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్నారు. 

పోలవరం జలవిద్యుత్‌ కేంద్రం రివర్స్‌ టెండర్స్‌పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అధ్యయనం చేస్తున్నామన్నారు మంత్రి అనిల్‌. అధ్యయం చేసిన తర్వాత  దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. పోలవరం జలవిద్యుత్‌ కేంద్ర రివర్స్‌ టెండర్లపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.