కరోనాకు రెమెడెసివర్ కరెక్ట్ మెడిసిన్ అంటోన్న గిలీద్.. మాకొద్దంటున్న ఇండియా

  • Published By: Subhan ,Published On : May 1, 2020 / 05:18 AM IST
కరోనాకు రెమెడెసివర్ కరెక్ట్ మెడిసిన్ అంటోన్న గిలీద్.. మాకొద్దంటున్న ఇండియా

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గిలీద్ సైన్సెస్ కరోనాపై సక్సెస్ సాధించామని చెప్తుంది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు తయారుచేసిన ‘రెమిడెసివిర్‌’ కరెక్ట్ మెడిసిన్ అని చెప్తుంది. శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌ వృద్ధి చెందకుండా ఇది అడ్డుకుంటుంందని తెలిపింది. 

అమెరికా అంటువ్యాధులపై అధ్యయనం చేసే ఆంటోనీ ఫౌచీ అనే ఎక్స్‌పర్ట్ గురువారం ఇదే విషయాన్ని నిర్ధారించారు. ఈ ప్రయోగాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్ఫెక్షియస్‌ డీసీజెస్‌(ఎన్‌ఐఏఐడీ) సహకారంతో గిలీద్‌ సైన్సెస్‌ నిర్వహించారు. 1090 మంది పాల్గొన్న ఈ ప్రయోగంలో రెమిడెసివిర్‌ ఔషధం తీసుకొన్న రోగులు కోలుకునే సమయం తగ్గింది. 15 రోజుల నుంచి 11 రోజులకు తగ్గడంతో పాటు మెరుగైన ఫలితాలు వచ్చాయి. 

‘మరణాల రేటు(11.6% నుంచి 8%కు) తగ్గడం విజయంగానే భావించాలి. 31% మెరుగ్గా ఫలితాలు ఉన్నంత మాత్రాన 100% ఫలితాలు లభించినట్లు కాదు. ప్రాణాలను కాపాడటానికి ఇది మెరుగ్గా ఉపయోగపడుతుందని అర్థమవుతోంది’ అని ఫౌచీ చెప్పారు.

గిలీద్‌ సైన్సెస్‌ సొంతగా మరో ప్రయోగం చేసింది. 2 బృందాలుగా 397 మంది రోగులపై వేర్వేరు డోసుల్లో ఈ ఔషధాన్ని వినియోగించింది. 5రోజులపాటు ఈ ఔషధాన్ని వాడిన వారు ఎలా స్పందించారో… 10రోజులపాటు వాడిన వారు సైతం అలానే స్పందించారు. ఇండియన్ ఫ్యామిలీకి చెందిన అంటువ్యాధుల నిపుణురాలు డాక్టర్‌ అరుణ సుబ్రమణియన్‌ ఈ ప్రయోగానికి నేతృత్వం వహించారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో క్లినికల్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అరుణ పేర్కొన్నారు.

వరల్డ్ హెత్ ఆర్గనైజేషన్ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) గిలీద్‌  ప్రయోగ ఫలితాలపై తక్షణమే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని పూర్తి స్థాయి నిర్ధారణకు రావాల్సి ఉందని తెలిపింది. (ఒకే పోలీస్ స్టేషన్‌లో తొమ్మిది మంది పోలీసులకు కరోనా వైరస్)

ఇండియా నో చెప్పేసింది:
పూర్తి స్థాయిలో నిర్ధారణకు రానటువంటి మెడిసిన్ ను వాడేందుకు ఇండియా నో చెప్పేసింది. సీరియస్ గా జబ్బు చేసిన పేషెంట్ కు ఇతర ట్రీట్‌మెంట్లు అందుబాటులో లేనప్పుడు దీనిని వాడుకోవచ్చని గిలీద్ చెబుతుంది.  ప్రస్తుతం రెమెడెసివర్ మందును అమెరికాతో పాటు ఇతర దేశాల్లోనూ వాడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుమతి వచ్చాకే ఇండియాలో దీని అమలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.