దేశానికే రోల్ మోడల్ : కరోనాను తరిమేసిన కరీంనగర్ వాసులు

  • Published By: madhu ,Published On : May 12, 2020 / 08:21 AM IST
దేశానికే రోల్ మోడల్ : కరోనాను తరిమేసిన కరీంనగర్ వాసులు

దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది కరీంనగర్ జిల్లా. ఎందుకంటే కరోనా వైరస్ ను జిల్లా వాసులు తరిమికొట్టారు. ఇక్కడ అధికారయంత్రాంగం కృషి ఎంతగానో ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రభుత్వం ఆదేశాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సూచనలను పక్కాగా పాటించారు. దీంతో ప్రస్తుతం..కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. అధికారుల, ప్రజాప్రతినిధుల శ్రమ ఫలితంగా ఇది సాధ్యమైంది. 

మత ప్రచారం కోసం వచ్చిన ఇండోనేషియన్లు : –
ఇండోనేషియన్లు మత ప్రచారం కోసం జిల్లాకు వచ్చారు. వచ్చిన 10 మందిని 2020, మార్చి 16వ తేదీన కరోనా అనుమానితులుగా గాంధీ ఆసుపత్రికి తరలించడంతో కలకలం ప్రారంభమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు అలర్ట్ అయ్యారు. వైరస్ కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ఇది ఇలా కొనసాగుతుండగానే..మర్కజ్ కు వెళ్లిన వారు..వారితో కాంటాక్టు అయిన వారు మొత్తం 19 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో నగర ప్రజలు భయబ్రాంతులకు గురి చేసింది. 

ముకరం ప్రాంతం మొత్తం రెడ్ జోన్ : –
దేశంలో ఎక్కడా ప్రకటించని విధంగా ఇండోనేషియన్లు బస చేసిన, పర్యటించిన ముకరం ప్రాంతాన్ని మొత్తం రెడ్ జోన్ గా ప్రకటించారు అధికారులు. ఎక్కడ పాజిటివ్ కేసు నమోదైతే…ఆ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ ప్రాంతంగా ప్రకటించారు. ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనలను తు.చ తప్పకుండా అమలు చేశారు. 

159 వైద్య బృందాల సర్వే : –
ప్రభుత్వాసుపత్రి ఐసోలేషన్ లో 140 మంది, శాతవాహన యూనివర్సిటీ క్వారంటైన్ లో 118, చల్మెడ క్వారంటైన్ లో 90 మంది అనుమానితులను ఉంచి చికిత్స అందించారు. జిల్లాలో మొత్తం వైద్య బృందాలు సర్వే చేపట్టారు. 159 బృందాలు సర్వే నిర్వహించి 526 మంది రక్తనమూనాలను పరీక్షల కోసం పంపించారు. 1, 42, 000 మందికి స్క్రీనింగ్ చేశారు. వైద్యబృందంలో 50 మంది డాక్టర్లు, 70 మంది సూపర్‌ వైజర్లు, 650 మంది ఆశ కార్యకర్తలు, 250 మంది ఏఎన్‌ఎంలు సేవలందించారు. 

నగరం వెలవెల : –
నిత్యం జనం రాకపోకలతో కిటకిటలాడిన నగరం వెలవెలబోయింది. ఎక్కడి వ్యాపారాలు అక్కడే ఆగిపోయాయి. అసలు కరీంనగర్‌లో ఏం జరుగుతోందని మిగిలిన జిల్లాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు వైపే చూశాయి. కరీంనగర్‌తోపాటు హుజూరాబాద్‌లోనూ 7 కట్టడి ప్రాంతాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల నుంచి ఏ ఒక్క వ్యకినీ బయటకి రాకుండా చూశారు. ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో కేసులు తక్కువగా నమోదయ్యాయి. 

మంత్రి గంగుల పర్యవేక్షణ : –
కేసులు పెరుగుతున్నాయని తెలియగానే..మంత్రి గంగుల కమలాకర్‌ రాత్రికి రాత్రే కరీంనగర్‌ చేరుకుని కలెక్టర్‌, సీపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో వైరస్‌ ఇతర ప్రాంతాలకు వ్యాపించొద్దన్న ఏకైక లక్ష్యంతో పనిచేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాక్షన్‌ప్లాన్‌ తయారు చేశారు. నో మూమెంట్‌ జోన్‌లోకి వెళ్లడానికి ఎవరూ సాహసం 
చేయని టైంలో మంత్రి కమలాకర్, అధికారులు కలిసి వెళ్లి అక్కడి వారికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. అంతేకాదు, 
కొంతమంది వైద్య పరీక్షలకు ముందుకురాని సమయంలో.. స్వయంగా మంత్రి సదరు కాలనీలకు వెళ్లి సముదాయించి 
ఒప్పించారు. 

పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ : –
నిత్యావసర సరుకులు ఇళ్లకే వెళ్లి పంపిణీ చేశారు. నగరంలో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో.. ఇటు మున్సిపల్‌, పోలీసు శాఖలతో కలెక్టర్‌, మంత్రి నిత్యం సమీక్షలు నిర్వహించి తెలుసుకున్నారు. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్లాన్‌ అమలు చేశారు. వైరస్‌ కట్టడికి మున్సిపల్‌ అధికారులు పారిశుధ్య చర్యలు చేపట్టారు. పారిశుధ్యం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రాష్ట్రంలోనే మొదటిసారిగా సోడియం హైపోక్లోరిడ్‌ లిక్విడ్‌ను స్ప్రే చేయించారు. నగరంలోని వెడల్పు రోడ్ల మీద డిస్‌ ఇన్ఫెక్షన్‌ స్ప్రే చేపట్టడానికి ట్రాక్టర్లు, పవర్‌ స్ప్రేలు, కొన్నిచోట్ల డ్రోన్లను వినియోగించారు. 

ప్రధాన పాత్ర సోషల్ డిస్టెన్స్ : –
కరీంనగర్‌లో కరోనా కట్టడిలో ప్రధానపాత్ర సోషల్‌ డిస్టెన్స్‌ అనే చెప్పాలి. లాక్‌డౌన్‌ విధించిన తొలి రోజుల్లో నగరవాసులు 
చాలామంది మార్కెట్‌కు గుంపులు గుంపులుగా వచ్చేవారు. దీన్ని గుర్తించిన ఆఫీసర్లు ప్రధాన ప్రాంతాలతో కలిపి అదనంగా 
16 మార్కెట్లు ఏర్పాటు చేశారు. వీటిని బస్టాండ్, మార్కెట్‌యార్డులో విశాలమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో ఎంతో ఊరట 
కలిగింది. సామాజిక దూరం పాటించేలా మున్సిపల్‌, పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు 250 మంది వలంటీర్లను 
నియమించారు. వీరు నగరవాసుల్లో ఎంతో మార్పు తీసుకొచ్చారు. 

కరోనా ఫ్రీ : –
మొత్తానికి ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం… ప్రజల సహకారంతో కరీంనగర్‌లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలిగారు. అందరికంటే ముందు బాధితులుగా మారి టెన్షన్ పడినా… ఇప్పుడు కరోనా ఫ్రీగా మారిపోవడంతో…కరీంనగర్ ఊపిరి పీల్చుకుంటోంది. 

Read More:

తెలంగాణలో కరోనా : జియాగూడలో వైరస్ ఎలా సోకిందంటే

హైదరాబాద్ లో 24 గంటల్లో 79 కరోనా కేసులు…తెలంగాణలో 1275కి పెరిగిన సంఖ్య