Banana Cultivation : తెలుగు రాష్ట్రాల్లో సాగుకు అనువైన అరటి రకాలు ఇవే!

అరటిని పిలకలు మరియు టిష్యకల్చర్ పద్ధతుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. కొత్తగా అరటి తోట వేయుటకు 3 నెలల వయసు గల అరటి పిలకలను తెగుళు లేని తల్లి చెట్టు నుండి ఎన్నుకోవాలి.

Banana Cultivation : తెలుగు రాష్ట్రాల్లో సాగుకు అనువైన అరటి రకాలు ఇవే!

These are the types of banana suitable for cultivation in Telugu states!

Banana Cultivation : అరటి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. తమిళనాడు, మహారాష్ట్ర విస్తీర్ణంలో, ఉత్పాదకతలో ముందు స్థానంలో ఉండగా తెలుగురాష్ట్రాల్లోని రైతులు కూడా అరటి సాగు చేపడుతున్నారు. అరటి ఉష్ణమండలపు పంట సరాసరి 25–30′ సెం.గ్రే. ఉష్ణోగ్రత అనుకూలం. సారవంతమైన తగినంత నీటి వసతి కలిగి నీరు ఇంకిపోయే గుణంతో పాటు తగినంత సేంద్రియ పదార్థం గల నేలల్లో సాగు చేపట్టవచ్చు. అరటిలో సాగుకు అనువైన రకాలు 70 దాకా ఉన్నాయి. వీటిలో 10-12 రకాలు మన రాష్ట్రంలో విస్తృతంగా సాగు చేస్తున్నారు. అవేంటో చూద్దాం..

అరటిసాగుకు అనువైన రకాలు ;

1. కర్పూర చక్కెర కేళి ; దేశంలో 70% అరటి ఉత్పత్తి ఈ రకానిదే దీని గెలలు పెద్దవిగా 10-15 కేజీ బరువుండును. గెలకు 130-175 కాయలుండి 10-12 హస్తాలతో ఉండును. 12 నెలల్లో పంట వచ్చును. ఈ రకం నిల్వఉంచటానికి తగినవే కాక రవాణాకు కూడా మిక్కిలి శ్రేష్టం. పనామ తెగుళ్ళును ఆకుమచ్చ తెగుళ్ళును బాగా తట్టుకొంటుంది. తేలిక నేలలో వర్షాభావ పరిస్థితుల్లో సాంగు చేయవచ్చు.

2. తెల్ల చక్కెర కేళి: ఈ రకం ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాలో సాగులో ఉంది. ఆకులో అంచులు పైకి తిరిగి ఉండటం ఈ రకం ప్రత్యేకత గెల చిన్నగా ఉండి 6-8 కేజీల తూగుతుంది. ఒక గెలలో 5-6 హస్తాలతో 60-80 కాయలు కల్గిండును. 12 నెలల్లో పంట కోతకు వచ్చును. పనామ తెగులును తట్టుకుంటుంది. అధిక ఉష్ణోగ్రత సారవంతం కానటువంటి నేలలు కల్గిన తెలంగాణా రాయలసీమ ప్రాంతాలకు అనువైనది కాదు.

3. అమృత పాణి లేదా రస్తాళి ; ఇది పొడవు రకం. 13-14 నెలల్లో పంటకు వచ్చును. గెల 15-20 కేజీ బరువుండి 8-10 హస్తాలతో 80-100 కాయలు కలిగి ఉండును. ఎక్కువ కాలం నిల్వ చేయుటకు పనికి రాదు. పండిన వెంటనే గెలల నుండి పండ్లు రాలిపోవును. పనామా తెగులు ఈ రకం పై తీవ్రంగా వస్తుంది. ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది.

4. రోబస్టా లేదా పెద్ద పచ్చ అరటి ; ఇది మధ్యరకం గెల 15-20 కేజీల బరువు 9-10 హస్తాలతో దాదాపు 125–130 కాయలు కల్గిండును. 11-12 నెలల్లో పంటకు వచ్చును. కాయలు కొంచెం పెద్దగా వుండి వంకర తిరిగి ఉంటాయి. పండిన తర్వాత కూడా తొక్క ఆకుపచ్చగా ఉంటుంది. కాయలో గింజలు స్పష్టంగా వుంటాయి. రాయలసీమ ప్రాంతాల్లో హెచ్చుగా పండిస్తారు. పనామ తెగులును తట్టుకుంటుంది. కాని వెర్రితలల ఆకుమచ్చ తెగులు ఆశిస్తాయి.

5. వామన కేళి లేదా పొట్టి పచ్చ అరటి : ఈ పండు రకము, గట్టిగా ఉన్నందున తుఫాను గాలి తాకిడికి తట్టుకొంటుంది. వీటి గెల 12-15 కేజీల బరువు 8-10 హస్తాలతో దాదాపు 120 కాయలు కాస్తుంది. 11 నెలల్లో పంటకు వస్తుంది. ఇది చాలా తీపి రకము అన్ని ప్రాంతాలకు అనువైనది. పండు పండిన పిదప తోలుపైన చుక్కలు వస్తాయి. పండిన తరువాత శీతాకాలంలో పసుపుపచ్చ , వేసవి కాలంలో ఆకు పచ్చగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వకు పనికి రావు. పనామ తెగులును తట్టుకుంటుంది.

6. బొంత: ఇవి విస్తృతంగా సాగులో ఉన్న రకం. 13 నెలల్లో పంటకు వస్తుంది. గెల 12-15 కేజీల బరువుతో 5-6 హస్తాలను కలిగి దాదాపు 70-80 కాయలు కలిగి ఉంటుంది. కాయలు పెద్దవిగా కొంచెం వంకరగా ఉండి అంచులు బాగా కనిపిస్తాయి. అన్ని ప్రాంతాలకు అనువైన రకం ఆకుమచ్చ తెగులును తట్టుకొంటుంది. పనామ తెగులును తట్టుకోలేదు.

7. ఏనుగు బొంత: బొంత రకాన్ని మ్యూటేషన్ ద్వారా రూపొందించిన మేలైన రకం 13-14 నెలల్లో కాపుకు వస్తుంది. గెల 15-20 కేజీల బరువు 6-7 హస్తాలతో 75-100 కాయలు కలిగి ఉంటుంది. రాష్ట్ర మంతటా పండించుటకు అనువైన రకం ఆకుమచ్చ మరియు పనామ తెగులును తట్టుకోలేదు.

8. గైండ్ నైన్: ఇది ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొనే శక్తి అధికంగా కలిగిఉంటుంది. గెలల పరిమాణం సైతం ఎక్కువగా ఉంటుంది. 12 నెలల పంట కాలం ఉన్న రకం 2.2-2.7 మీ. ఎత్తు సగటు గెల బరువు 25-30 కేజీలు ఉంటుంది.

9. వ్రవర్ధనం: అరటిని పిలకలు మరియు టిష్యకల్చర్ పద్ధతుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. కొత్తగా అరటి తోట వేయుటకు 3 నెలల వయసు గల అరటి పిలకలను తెగుళు లేని తల్లి చెట్టు నుండి ఎన్నుకోవాలి. సూది మొన ఆకులు గల పిలకలను నాటుటకు ఎంపిక చేసుకోవాలి. ఇవి అతి త్వరగా పెరిగి తక్కువ వ్యవధిలో పంటనిచ్చును. పిలకల దుంపలపై గల పాత వేర్లను తీసివేయాలి. సాధారణంగా దేశవాళి రకాలకు దుంప 1.5-2 కేజీలు కావెండస్ రకాలకు 1.25-1.5 కేజీల బరువు ఉండటం మంచిది.