Dewald Brevis century : ఆ కొట్టుడు ఏంది సామీ.. ఆసీస్‌కే సుస్సు పోయించాడుగా.. జూనియర్ ఏబీడీ రికార్డు సెంచరీ..
డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis century) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. రెండో టీ20 మ్యాచ్‌లో 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

AUS vs SA 2nd T20 Dewald Brevis Smashes Record T20I Century
దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 41 బంతుల్లోనే సెంచరీ (Dewald Brevis century) సాధించాడు. ఈ క్రమంలో పలు రికార్డును అందుకున్నాడు. దక్షిణాఫ్రికా తరుపున టీ20ల్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు రిచర్డ్ లెవి పేరిట ఉండేది. లెవి 24 ఏళ్ల 34 రోజుల్లో సెంచరీ చేయగా.. తాజాగా బ్రెవిస్ 22 ఏళ్ల 105 రోజుల్లో శతకాన్ని బాదాడు.
అంతేకాదండోయ్ ఆస్ట్రేలియా పై టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ (Dewald Brevis century) చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో అతడు న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ ను అధిగమించాడు. మార్టిన్ గప్టిల్ 49 బంతుల్లో ఆసీస్ పై సెంచరీ చేయగా, డేవిస్ 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
* టీ20ల్లో దక్షిణాఫ్రికా తరుపున రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. తొలి స్థానంలో డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. మిల్లర్ 2017లో బంగ్లాదేశ్ పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
ఆసీస్ గడ్డ పై టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు
ఈ మ్యాచ్‌ల్లో డెవాల్డ్ బ్రెవిస్ 56 బంతులను ఎదుర్కొన్నాడు. 12 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 125 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతడు ఆసీస్ గడ్డ పై టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. గతంలో ఈ రికార్డు షేన్ వాట్సన్ పేరిట ఉండేది వాట్సన్ 2016లో భారత్ పై 124 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక దక్షిణాఫ్రికా తరుపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన ఆటగాడిగా కూడా బ్రెవిస్ నిలిచాడు. 2015లో డుప్లెసిస్ వెస్టిండీస్ పై 119 పరుగులు చేశాడు.
Asia Cup : రెండు మ్యాచ్‌లే గెలిచి.. ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్..
అభిమానులు ముద్దుగా జూనియర్ ఏబీడీగా పిలుచుకునే డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసకర శతకంతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. సఫారీ బ్యాటర్లలో బ్రెవిస్ కాకుండా ట్రిస్టన్ స్టబ్స్(22 బంతుల్లో 31 పరుగులు) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా చెరో వికెట్ సాధించారు.
అనంతరం 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 17.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటూంది. దీంతో సఫారీ జట్టు 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో టిమ్ డేవిడ్ (50; 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే పోరాడాడు. సపారీ బౌలర్లలో క్వేనా మఫాకా, కార్బిన్ బాష్ చెరో మూడు వికెట్లు తీశారు. కగిసో రబడ, ఐడెన్ మార్క్రామ్, లుంగి ఎన్గిడి, న్కబయోమ్జి పీటర్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
David Warner : టీ20 క్రికెట్‌లో టాప్-5లో డేవిడ్ వార్నర్.. కోహ్లీని వెనక్కి నెట్టేశాడు..
ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ప్రస్తుతానికి దక్షిణాప్రికా 1-1తో సమం చేసింది. ఇక ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 మ్యాచ్ శనివారం (ఆగస్టు 16) జరగనుంది.