Asia Cup : రెండు మ్యాచ్‌లే గెలిచి.. ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్..
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది.

India won both matches and winning the inaugural Asia Cup
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. మొత్తం 8 దేశాలు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, యూఏఈ, ఒమన్, హాంగ్ కాంగ్ దేశాలు ఈ కప్ కోసం పోటీపడనున్నాయి. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో సెప్టెంబర్ 10న ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ మరోసారి విజయం సాధిస్తుందా? లేదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొలింది.
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు భారత జట్టు 8 సార్లు ఆసియా కప్ విజేతగా నిలిచింది. 1984, 1988, 1990/91, 1995, 2010, 2016, 2018, 2023లలో గెలుపొందింది. ఆ తరువాత శ్రీలంక అత్యధికంగా ఆరు సార్లు.. 1986, 1997, 2004, 2008, 2014, 2022లలో విజయం సాధించింది. ఇక పాక్ విషయానికి వస్తే.. రెండు సార్లు (2000, 2012లలో) గెలుపొందింది.
David Warner : టీ20 క్రికెట్‌లో టాప్-5లో డేవిడ్ వార్నర్.. కోహ్లీని వెనక్కి నెట్టేశాడు..
రెండు మ్యాచ్‌లు ఆడి విజేతగా నిలిచి..
ఆసియా దేశాల మధ్య సద్భావనను పెంపొందించడానికి 1984లో ఓ టోర్నీని రూపకల్పన చేశారు. ఈ టోర్నీకి ఆసియా కప్ అని పేరు పెట్టారు. ఆసియా కప్ టోర్నీ తొలి ఎడిషన్‌లో భారత్, పాక్, శ్రీలంక జట్లు మాత్రమే పాల్గొన్నాయి. దుబాయ్‌లోని షార్జా వేదికగా రౌండ్ రాబిన్ పద్దతిలో ఈ టోర్నీ జరిగింది. 1983లో భారత జట్టుకు ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ లేకుండానే భారత్ ఆసియా కప్ బరిలోకి దిగింది.
ఏప్రిల్ 6 నుంచి 13 వరకు ఈ టోర్నీ జరిగింది. భారత జట్టుకు సునీల్ గవాస్కర్, పాక్‌కు జహీర్ అబ్బాస్, శ్రీలంకకు దిలీప్ మెండిస్ నాయకత్వం వహించారు. తొలి మ్యాచ్ ఏప్రిల్ 6న పాక్, శ్రీలంక జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 46 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 188 పరుగుల లక్ష్యాన్ని లంక జట్టు 43.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇక రెండో మ్యాచ్ భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి లంక జట్టు 41 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో చేతన్ శర్మ, మదన్ లాల్ లు చెరో మూడు వికెట్లు తీశారు. 97 స్వల్ప లక్ష్యాన్ని భారత్ 21.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది.
ఇక మూడో మ్యాచ్ భారత్, పాక్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 46 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 39.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మూడు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి తొలి ఎడిషన్‌లో ఆసియా కప్ విజేతగా నిలిచింది.