David Warner : టీ20 క్రికెట్‌లో టాప్-5లో డేవిడ్ వార్నర్.. కోహ్లీని వెనక్కి నెట్టేశాడు..
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు.

David Warner enter into Top 5 of leading run getters in T20 cricket
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు ప్రస్తుతం వివిధ దేశాల్లో నిర్వహించే టీ20 లీగుల్లో ఆడుతున్నాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో ఓ ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు.
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నీలో లండన్ స్పిరిట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్నర్ మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 71 పరుగులు చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీని అధిగమించాడు.
కోహ్లి తన టీ20 కెరీర్‌లో 414 మ్యాచ్‌ల్లో 13543 పరుగులు చేయగా.. వార్నర్ 419 మ్యాచ్‌ల్లో 13545 రన్స్ కొట్టాడు. ఈ జాబితాలో విండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్‌గేల్ 14562 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. 13854 పరుగులో కీరన్ పొలార్డ్ రెండో స్థానంలో ఉండగా.. ఆ తరువాత అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్‌లు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
క్రిస్ గేల్ – 455 ఇన్నింగ్స్‌ల్లో 14,562 పరుగులు
కీరన్ పొలార్డ్ – 629 ఇన్నింగ్స్‌ల్లో 13,854 పరుగులు
అలెక్స్ హేల్స్ – 499 ఇన్నింగ్స్‌ల్లో 13,814 పరుగులు
షోయబ్ మాలిక్ – 515 ఇన్నింగ్స్‌ల్లో 13,571 పరుగులు
డేవిడ్ వార్నర్ – 418 ఇన్నింగ్స్‌ల్లో 13,545 పరుగులు
విరాట్ కోహ్లీ – 397 ఇన్నింగ్స్‌ల్లో 13,543 పరుగులు
హండ్రెడ్ లీగ్‌లో వార్నర్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకునే ఛాన్స్ ఉంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. మాంచెస్టర్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (37 బంతుల్లో 46 పరుగులు), కెప్టెన్ ఫిల్ సాల్ట్ (20 బంతుల్లో 31 పరుగులు) రాణించారు.
అనంతరం డేవిడ్ వార్నర్ (51 బంతుల్లో 71 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించినప్పటికి మిగిలిన వారు విఫలం కావడంతో లండన్ స్పిరిట్ నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. దీంతో మాంచెస్టర్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.