AP-Telangana : తెలుగు రాష్ట్రాల మధ్య ‘‘ఐదు ఊళ్ల’’ రగడ..

మహాభారత యుద్ధానికి దారి తీసింది ఐదూళ్లు ఇప్పుడు అదే పదం తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోంది. ఇంతకీ ఆ ఐదు గ్రామాలు కావాలని తెలంగాణ ఎందుకు కోరుతోంది.? ఏపీ రియాక్షన్ ఏంటీ? అసలీ ఐదు పంచాయతీల పరిస్థితి ఏంటి ?

AP-Telangana : తెలుగు రాష్ట్రాల మధ్య ‘‘ఐదు ఊళ్ల’’ రగడ..

Dispute Of Five Villages Between Telugu States

Dispute of five villages between Telugu states : ఐదూళ్లు.. మహాభారత యుద్ధానికి దారి తీసిన ప్రస్తావన ఇది ! ఇప్పుడు అదే పదం తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోంది. భద్రాచలాన్ని గోదావరి ముంచెత్తిన వేళ.. ఆ ఐదు గ్రామాల ప్రస్తావన తెరమీదకు వచ్చింది. ఇంతకీ ఆ ఐదు గ్రామాలు కావాలని తెలంగాణ ఎందుకు కోరుతోంది. ఇప్పుడు ఏపీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది.. అసలీ ఐదు పంచాయతీల పరిస్థితి ఏంటి ?

ఐదు ఊళ్లు.. మహాభారతంలో పాండవులకు ఐదు గ్రామాలు ఇచ్చినా చాలు అంటూ శ్రీకృష్ణుడు రాయబారం నడుపుతాడు. యుద్ధాన్ని నివారించి, రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయగా.. ఆనాడు అది విఫలం అయింది. దీంతో మహాభారత యుద్ధం నడిచింది. అది పురాణకాలం. ఆ ఐదు ఊళ్లే కాకపోయినా.. అలాంటి ఐదు ఊళ్లు ఇప్పుడు మళ్లీ కొత్త చర్చకు దారి తీస్తున్నాయ్. తెలుగు రాష్ట్రాల మధ్య యుద్ధానికి దారి తీస్తున్నాయ్. ఓ వర్షం వరదలా మారి.. ఆ వరద ఓ ప్రాంతాన్ని ముంచెత్తగా.. ఆ ఐదు ఊళ్ల ప్రస్తావన తెరమీదకు వచ్చింది. ఆ గ్రామాలు తమకు ఇవ్వాలని.. తెలంగాణ మంత్రి, ఏపీ ప్రభుత్వాన్ని కోరడంతో.. ఈ ఊళ్ల రచ్చ.. కొత్త చర్చకు దారి తీస్తోంది.

ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల.. ఇప్పుడు ఈ ఐదు గ్రామాల గురించే తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదం తెరమీదకు వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత.. పోలవరం ముంపు మండలాల పేరుతో… ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేశారు. అందులో భాగమే ఈ ఐదు గ్రామ పంచాయతీలు ! ఈ ఐదు పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నాయ్. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం రూరల్ మండలం, కూనవరం, వీఆర్‌ పురం, చింతూరు మండలాలను.. అలాగే పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు… అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. ఇలా ఈ ఐదు గ్రామాలు కూడా ఏపీ పరిధిలోకి వెళ్లిపోయాయ్.

ఈ ఐదు గ్రామాల్లో పురుషోత్తపట్నం, గుండాల గ్రామపంచాయతీల వార్డులు… భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నాయ్. కన్నాయిగూడెం, ఎటపాక, పిచుకలపాడు గ్రామ పంచాయతీలు… అటు తెలంగాణ, ఇటు తెలంగాణ మధ్య ఆంధ్రాలో ఉన్నాయ్. భద్రాచలం నుంచి చర్ల జాతీయ రహదారి వైపునకు.. పర్ణశాలతో పాటు భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లాలన్నా… ఏపీ పరిధిలోని ఈ మూడు పంచాయతీలను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వివాదాలు ఎన్నో ఉన్నా.. ఈ మధ్య భద్రాచలం చుట్టూ కనిపించిన వరదలు కొత్త చర్చకు దారి తీసేలా చేశాయ్.

భద్రాచలాన్ని గోదావరి భయపెట్టింది. వందేళ్లలో ఎప్పుడూ చూడని వరద.. రాములోరి సన్నిధిలో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు.. నాలుగైదు రోజులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భద్రాచలంవాసులు కాలం వెళ్లదీశారు. కరకట్ట దాటుకొని పట్టణంలోకి వచ్చిన వరద నీరు.. పట్టణంలో చాలా ఇళ్లను ముంచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని.. తెలంగాణ మంత్రి పువ్వాడ ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఊర్ల నుంచి కరకట్ట నిర్మిస్తే ఇక గోదావరి వరదల నుంచి శాశ్వతంగా భద్రాచలం పట్టణానికి రక్షణ ఉంటుందన్నది ఆయన వాదన. దీంతో ఇప్పుడు ఐదు గ్రామాల వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది.

పోలవరం ప్రాజెక్ట్‌ కోసం సేకరిస్తున్న లక్ష ఎకరాలకు పైగా భూమి…. తెలంగాణ నుంచి ఏపీలో విడదీసిన ఏడు మండలాల పరిధిలోనే ఉంది. ఐతే ఇప్పుడు తెలంగాణ మంత్రి పువ్వాడ డిమాండ్‌ చేస్తున్న ఐదు ఊళ్లు అనేవి… కేవలం భద్రాచలం పట్టణాన్ని ముంపు నుంచి రక్షించడానికి కరకట్ట నిర్మించడం కోసమేనన్నది ఆయన వాదన. ఉమ్మడి రాష్ట్రంలోనే భద్రాచలంలో కరకట్ట నిర్మించారు. దాన్ని మరింత విస్తరించి… అస్సలు ప్రమాద పరిస్థితి రానీయవద్దన్న పువ్వాడ డిమాండ్‌కు సానుకూలత వస్తున్నా… ఒక రాష్ట్రంలోని ప్రాజెక్టు సబ్‌మెర్జెన్స్‌ ప్రాంతాన్ని మరొక రాష్ట్రంలోని ఒక పట్టణం కోసం కేటాయిస్తారా.. అసలు ఆ అసవరం సైంటిఫిక్‌గా ఉందా అన్నది చర్చ జరగాల్సి ఉంది. ఇదంతా ఎలా ఉన్నా… ఆ ఐదు గ్రామాల ప్రజలు మాత్రం.. తమను తెలంగాణలో కలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు ముమ్మరం చేశారు.