KONASEEMA : కోనసీమలో అసలు ఏ జరిగింది..? ఏం జరగబోతోంది..? పచ్చని సీమలో చిచ్చు రగిల్చింది ఎవరు?

పచ్చని సీమలో మండిన ఎర్రటి మంటలు.. కోనసీమ చరిత్రపై నల్లటి మచ్చలను మిగిల్చాయి.. అసలు కోనసీమలో ఇంతటి విద్వేషాన్ని రగిలించిందెవరు..? కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించిందెవరు..? ఈ ప్రశ్నలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నా.. గ్రౌండ్‌లెవల్‌లో మాత్రం మ్యాటర్‌ వేరే ఉందంటున్నారు.. అసలు కోనసీమలో ఏ జరిగింది..? ఏ జరుగుతోంది..? ఏం జరగబోతోంది..?

KONASEEMA : కోనసీమలో అసలు ఏ జరిగింది..? ఏం జరగబోతోంది..? పచ్చని సీమలో చిచ్చు రగిల్చింది ఎవరు?

Konaseema

KONASEEMA : పచ్చని సీమలో మండిన ఎర్రటి మంటలు.. కోనసీమ చరిత్రపై నల్లటి మచ్చలను మిగిల్చాయి.. అసలు కోనసీమలో ఇంతటి విద్వేషాన్ని రగిలించిందెవరు..? కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించిందెవరు..? ఈ ప్రశ్నలకే ఇప్పుడు సమాధానం వెదకడం చాలా కష్టంగా ఉంది.. రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నా.. గ్రౌండ్‌లెవల్‌లో మాత్రం మ్యాటర్‌ వేరే ఉందంటున్నారు.. అసలు కోనసీమలో ఏ జరిగింది..? ఏ జరుగుతోంది..? ఏం జరగబోతోంది..?

కోనసీమలో విధ్వంసానికి టీడీపీ, జనసేనే కారణమంటోంది అధికార పార్టీ. అసలు విద్వేషానికి కాపీరైట్స్ అన్నీ వైసీపీ దగ్గరే ఉన్నాయంటోంది ప్రతిపక్ష టీడీపీ. పేరు మార్చి… 30 రోజుల టైమ్‌ పెట్టి చేయాల్సిందంతా చేసింది ప్రభుత్వమైతే .. తమను టార్గెట్ చేయడం ఏంటంటూ డైరెక్ట్‌గానే ఎటాక్ చేశారు జనసేనాని. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో కోనసీమ మంటల్ని.. పొలిటికల్ పొయ్యిలో మరింత రగలిస్తున్నాయి అన్ని పార్టీలు.. మాకు సంబంధం లేదంటే.. మాకు సంబంధం లేదంటూ అన్ని పార్టీలు చేతులు దులుపుకుంటున్నాయి.. మరి ఎవరికీ సంబంధం లేకుండానే.. అంత పెద్ద ఆందోళన ఎలా జరిగింది..? పోలీసుల నిర్బంధాన్ని చేధించుకుని మరీ అంత విధ్వంసం ఎలా జరిగింది..? ఈ ప్రశ్నలకే ఇప్పుడు సమాధానాలు ఎవరికి వారు వెదికే పనిలో పడ్డారు.

కొత్త జిల్లాల ఏర్పాటు నుంచీ కోనసీమ రగులుతూనే ఉంది. కోనసీమ జిల్లాగా ప్రభుత్వం మొదట ప్రకటించడంతో.. అంబేద్కర్ పేరు పెట్టాలంటూ దళిత సంఘాలు ఆందోళనలు చేశాయి. రాజకీయ పార్టీలన్నీ కూడా దీనికి వంతపాడాయి. ప్రభుత్వం కూడా డాక్టర్ బి.ఆర్‌.అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతామంటూ ప్రకటించింది. అభ్యంతరాలను తెలియజేయడానికి 30 రోజుల పాటు సమయం ఇచ్చింది. కానీ, కోనసీమ బ్రాండ్‌తో ఇంటర్నేషనల్‌గా ఫేమస్ అయిన తమ ప్రాంతానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఏంటంటూ మరికొన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడి ఆందోళనలు మొదలుపెట్టాయి. భారీగా నిరసనలకు పిలుపునిచ్చాయి. మంగళవారం కూడా ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తామంటూ కోనసీమ జిల్లా సాధన సమితి ప్రకటించింది. అందరూ తరలిరావాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేసింది. అయితే.. దీన్ని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడమే ఇంతటి విధ్వంసాన్ని సృష్టించిందన్న వాదనా వినిపిస్తోంది.

ర్యాలీని పోలీసు బందోబస్తు మధ్య చేయించి ఉంటే.. పరిస్థితి కంట్రోల్‌లోనే ఉండేదంటున్నారు. కానీ.. దీన్ని అడ్డుకోవడానికి పోలీసులు సోమవారం నుంచే అమలాపురంలో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ర్యాలీలు, సభలు, సమావేశాలపై నిషేధం పెట్టారు. దీంతో, తమ గొంతు నొక్కుతున్నారన్న ఫీలింగ్‌లోకి వెళ్లిపోయారు కోనసీమ ఆందోళనకారులు. ఈ నిర్బంధాన్ని ధిక్కరిస్తూ భారీగా అమలాపురానికి తరలివచ్చారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడం.. లాఠీఛార్జీకి దిగడంతో.. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. చివరకు మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ నివాసాలతో పాటు.. బస్సులు తగలబడాల్సి వచ్చింది.

ఒకవేళ ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే అనుకుంటే.. అమలాపురంలో అంత పెద్ద ఆందోళన జరుగుతున్నా, మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ ఇళ్లపై దాడులు జరుగుతున్నా వైసీపీ నేతలు గానీ, కార్యకర్తలు గానీ ఎందుకు అడ్డుకోలేదన్న చర్చ గడియారం స్తంభం సెంటర్‌లో గట్టిగానే జరుగుతోంది. అసలు కోనసీమలో పార్టీలకతీతంగా అంతా ఏకమవ్వడం వల్లే మంత్రి ఇంటి తగలపడుతున్నా ఎవరూ ముందుకు రాలేదన్న ప్రచారమూ సాగుతోంది. కొన్ని విషయాల్లో తీవ్ర అసంతృప్తితో ఉన్న అధికార పార్టీ నేతలు కూడా.. ఈ ఆందోళన కారులతో చేతులు కలిపారన్న వాదన వినిపిస్తోంది. పోలీసుల తీరుకు నిరసనగా ఒక్కసారిగా యువకులు రోడ్డుపైకి వచ్చేశారు. వారికి నాయకత్వం వహించేవాళ్లు గానీ, దిశానిర్దేశం చేసేవాళ్లు గానీ అక్కడ లేరు. అసలే భావోద్వేగం.. ఆపై పోలీసుల తీరుపై ఆగ్రహం.. రెండూ కలిసి వాళ్లను మరింత రెచ్చగొట్టాయి. రాళ్లదాడితో మొదలై.. కనిపించింది కనిపించినట్లు కాల్చి పారేసే దాకా తీసుకువెళ్లాయి. కొన్ని ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కూడా దీన్ని అవకాశంగా మార్చుకుని ఆ మంటలకు మరింత పెట్రోల్‌ పోసినట్లూ చెప్పుకుంటున్నారు. అదే పోలీసులు ర్యాలీకి అనుమతించి ఉంటే.. ఎవరైనా విధ్వంసానికి ప్రయత్నించినా కంట్రోల్‌ చేయడానికి అవకాశం ఉండేది. ర్యాలీకి నేతృత్వం వహించిన వాళ్లను బాధ్యుతలను చేయడానికి ఆస్కారం ఉండేది. బలం..బలగంతో అణిచివేద్దామనుకోవడమే కొంపముంచినట్లు కనిపిస్తోంది.

సాధారణంగా ఆందోళనలకు రాజకీయ పార్టీలే పిలుపునిస్తుంటాయి. కానీ, కోనసీమ విషయంలో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి. ఆందోళనల్లో పాల్గొన్నదంతా 25 నుంచి 30 ఏళ్ల లోపు వాళ్లే.. సోషల్‌మీడియాలో సమాచారం ఇచ్చుకుని ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చిపడ్డారు. ఇలాంటి పరిణామం తెలుగు రాష్ట్రాలకు పూర్తిగా కొత్తనే చెప్పొచ్చు. ఓ రకంగా భవిష్యత్‌ రాజకీయానికి ఇదో హెచ్చరిక కూడా. విద్వేషాలను రెచ్చగొట్టే ఏ చిన్న సంఘటననైనా పెద్ద చిచ్చునే రాజేస్తుందనడానికి కూడా కోనసీమ గొడవే అతి పెద్ద ఎగ్జాంపుల్ అంటున్నారు తలలు పండిన రాజకీయ వేత్తలు.