AP Power Holiday : ఏపీలో పరిశ్రమలకు షాక్.. రేపటి నుంచి పవర్ హాలిడే

విద్యత్ కొరత నేపథ్యంలో APSPDCL కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించింది. రాష్ట్రంలోని 5 జిల్లాల పరిధిలో పరిశ్రమలకు..

AP Power Holiday : ఏపీలో పరిశ్రమలకు షాక్.. రేపటి నుంచి పవర్ హాలిడే

Ap Power Holiday

AP Power Holiday : విద్యుత్ సంక్షోభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. విద్యుత్ కొరతతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో APSPDCL కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించింది. రాష్ట్రంలోని 5 జిల్లాల పరిధిలో పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీఎస్పీడీసీఎల్.

దీంతో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించింది. ఓవైపు వేసవి కారణంగా విద్యుత్ కు డిమాండ్ పెరగడం, మరోవైపు బొగ్గు కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు తెలిపారు. పవర్ ఎక్స్ చేంజ్ లో డిస్కమ్ లకు 14వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా.. 2వేల మెగావాట్ల విద్యుత్ మాత్రమే లభ్యమవుతున్నట్లు తెలిపారు. ఈ నెల 22వ తేదీ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ఏపీఎస్పీడీసీఎల్ తెలిపింది. పరిశ్రమలు రోజువారి వినియోగంలో 50శాతం తగ్గించుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు సూచించారు.(AP Power Holiday)

తీవ్ర విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలకు విద్యుత్ కోతలు అమలు చేయనున్నట్లు ఏపీఎస్పీడీఎస్ సీఎండీ హరనాథరావు తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 1,696 పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ఉంటుందని తెలిపారు. 253 ప్రాసెసింగ్ పరిశ్రమలు 50శాతం విద్యుత్తే వాడుకోవాలని సూచించారు. ఏప్రిల్ 8 నుంచి 22 వరకు రెండు వారాలు పవర్ హాలిడే అమల్లో ఉంటుందన్నారు. మార్కెట్ లో విద్యుత్ లభ్యత మెరుగైతే పవర్ హాలిడేను ఎత్తివేస్తామని వెల్లడించారు.

వేస‌వి కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిన నేప‌థ్యంలో గృహావ‌స‌రాల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండేలా ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ హాలిడే ప్ర‌క‌టిస్తూ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హ‌ర‌నాథ‌రావు గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ ఆదేశాలు ఏపీఎస్పీడీసీఎల్ ప‌రిధిలోని ప‌రిశ్ర‌మ‌ల‌కు మాత్ర‌మే వ‌ర్తించ‌నున్నాయి.

Narsipatnam : ప్రభుత్వాస్పత్రిలో విద్యుత్‌ కోతలు..సెల్‌ఫోన్ల లైట్ల వెలుగులో గర్భిణికి డెలివరీ

ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల ప్ర‌కారం.. 253 ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌లు 50 శాతం విద్యుత్‌నే వాడాల్సి ఉంటుంది. 1,696 ప‌రిశ్ర‌మ‌ల‌కు వారంలో ఒక‌రోజు ప‌వ‌ర్ హాలిడేను అమ‌లు చేయాలి. వారాంత‌పు సెల‌వుకు అద‌నంగా ఒక రోజు ప‌వ‌ర్ హాలిడేను కొన‌సాగించాలి. ఈ నెల 8 నుంచి 22 వ‌ర‌కు రెండు వారాల పాటు అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ హాలిడేను ప్ర‌క‌టిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండాకాలంలో ఉక్కపోత వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు.. గంటల తరబడి సాగుతున్న కరెంటు కోతలతో మరింతగా అల్లాడిపోతున్నారు. విద్యుత్ కోతలతో ఇప్పటికే గృహ వినియోగదారులు ఇబ్బందులు పడుతుండగా.. తాజాగా, పరిశ్రమలకు కూడా కోతలు అమలు చేయనున్నారు.

మండువేసవిలో కరెంట్ లేక జనాలు విలవిలలాడిపోతున్నారు. పల్లెలతో పాటు ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఇదే సీన్‌. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలాంటి ప్రధాన నగరాల్లోనూ ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు విధిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. పవర్‌ కట్స్‌తో విలవిలలాడిపోతున్నారు ప్రజలు. అర్థరాత్రి విద్యుత్ కోతలతో వారి బాధలు వర్ణణాతీతంగా మారాయి. గత 10 రోజులుగా అప్రకటిత విద్యుత్‌ కోతలతో నానా అవస్థలు పడుతున్నారు జనం.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యుత్ కోతలతో పేషెంట్లు నరకం చూస్తున్నారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ కూడా చేయలేని పరిస్థితి. గర్భిణులకు కూడా చీకట్లోనే డెలివరీ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిస్కంలు లోటు విద్యుత్‌గా చూపుతున్న మొత్తాన్ని సర్దుబాటు చేయటానికి అత్యవసర లోడ్‌ రిలీఫ్‌ పేరిట విద్యుత్ సంస్థలు కోతలు విధిస్తున్నాయి. వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను సమకూర్చుకోవడంపై డిస్కంలు ఫోకస్ పెట్టలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరెంట్ కోతల నేపథ్యంలో.. ఫిర్యాదు కేంద్రాలకు పెద్ద సంఖ్యలో కాల్స్ చేస్తున్నారు ప్రజలు. కనీసం ఏయే సమయాల్లో కరెంట్ పోతుందో చెప్పాలని కొందరు వేడుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.