Visakha Beach Black Color Sand : విశాఖ సాగర తీరంలో ఏం జరుగుతోంది? బీచ్ ఇస్తున్న వార్నింగ్ ఏంటీ..?

విశాఖ తీరంలో మార్పులకు.. గాలుల ఉద్ధృతి, అల్పపీడనమే కారణమా? వాతావరణంలో వస్తున్న మార్పులతోనే.. బీచ్ నల్లగా మారుతోందా? అసలు.. సాగర తీరంలో ఏం జరుగుతోంది? విశాఖ బీచ్ నుంచి దీనిని ఫస్ట్ వార్నింగ్ అనుకోవచ్చా? తీరం కోతకు గురవుకుండా తీసుకోవాల్సిన చర్యలేంటి?

Visakha Beach Black Color Sand : విశాఖ సాగర తీరంలో ఏం జరుగుతోంది? బీచ్ ఇస్తున్న వార్నింగ్ ఏంటీ..?

Visakha Beach Sand Turns into Black Color

Visakha Beach Sand Turns into Black Color : విశాఖ తీరంలో మార్పులకు.. గాలుల ఉద్ధృతి, అల్పపీడనమే కారణమా? వాతావరణంలో వస్తున్న మార్పులతోనే.. బీచ్ నల్లగా మారుతోందా? అసలు.. సాగర తీరంలో ఏం జరుగుతోంది? విశాఖ బీచ్ నుంచి దీనిని ఫస్ట్ వార్నింగ్ అనుకోవచ్చా? తీరం కోతకు గురవుకుండా తీసుకోవాల్సిన చర్యలేంటి?

తీరం కోతకు గురైందనే మాట విశాఖలో.. ఒకప్పుడు.. అప్పుడప్పుడూ వినిపించేది. కానీ.. ఇప్పుడు.. తరచుగా ఆ మాట వినిపిస్తోంది. ఇది కచ్చితంగా.. ఆందోళన కలిగించే అంశమేనని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. విశాఖ నుంచి భీమిలి వరకు ఉన్న తీరప్రాంతంలో.. ఒక్కో చోట బలమైన సముద్రపు రాళ్లు బీచ్‌కు రక్షణగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల బలహీనంగా ఉన్నాయి. తీరప్రాంతంలో.. పెరుగుతున్న నిర్మాణాలతోనూ బీచ్ తరచుగా కోతకు గరువుతోందన్న వాదన కూడా వినిపిస్తోంది. అపార్ట్‌మెంట్లు, పర్యాటక అభివృద్ధి పనులు, హోటల్స్, పోర్టు అవసరాల కోసం జరుపుతున్న నిర్మాణాలతో.. విశాఖను ప్రకృతి విపత్తుల నుంచి రక్షించే కొండలు తరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధి పనుల పేరుతో.. కొండలను తవ్వడం సీఆర్‌జెడ్ నిబంధనలు పాటించకపోవడం.. కోతకు కారణంగా చెబుతున్నారు.

తీరం వెంబడి భారీ కట్టడాలు, బ్రేక్ వాటర్స్ కోసం చేసే నిర్మాణాల వల్ల.. అలల దిశ మారిపోతోంది. అలా.. ఒక్కోసారి ఒక్కో చోట అలలు.. తీరాన్ని బలంగా తాకుతున్నాయ్. దీనివల్ల.. అప్పటికే బలహీనంగా ఉన్న ప్రాంతంలో ఇసుక జారిపోయి.. తీరం కోతకు గురవుతోంది. ఆ ప్రదేశాల్లో.. ఏవైనా నిర్మాణాలున్నా.. అవి కూలిపోతాయ్. ఇప్పటికే.. విశాఖ తీరంలో 25 కొబ్బరి చెట్లు కూలిపోగా.. మరో 50 కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో.. వాటిని పరిరక్షించేందుకు గాబ్రియల్ వాల్ నిర్మించనున్నారు.

బీచ్ కోతకు గురవడమనేది సహజంగా జరిగేదే. దీనిని ఆపలేం. కానీ.. నియంత్రించొచ్చు అని చెబుతున్నారు నిపుణులు. కోతకు గురయ్యే అవకాశాలున్న ప్రదేశాలపై ముందుగా సెడిమెంట్ మూమెంట్ స్టడీ చేసి.. ఆ రిపోర్ట్ ఆధారంగా సెండ్‌వాల్ ఫెన్సింగ్, సీ వాల్ ఫెన్సింగ్‌తో.. కోతను తగ్గించొచ్చు అని చెబుతున్నారు. అయితే.. ఇదంతా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో.. ఐదు, పది సంవత్సరాల ప్రణాళికతో.. డ్రెడ్జింగ్ చేయడం, బండరాళ్లు వేయడం లాంటివి చేస్తే.. తీరం కోత తగ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

తీరానికి రక్షణ కవచాల్లాంటి.. ఎత్తైన ఇసుక దిబ్బలు, మడ అడవులు మాయమవడంతో.. ప్రమాదం ముంచుకొస్తోందని చెబుతున్నారు. తీరం వెంబడి పెరుగుతున్న నిర్మాణాలు, పర్యాటక అభివృద్ధి, పరిశ్రమల స్థాపనతో.. బీచ్ చుట్టూ పరిస్థితులు మారిపోతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఒక చోట కోతను నియంత్రించినా.. మరో చోట కోతకు గురవుతుందంటే.. కచ్చితంగా అది మానవ తప్పిదమే. తీరానికి హాని కలిగించేలా.. సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం, సహజ సిద్ధంగా రక్షణ ఇస్తున్న కొండలను తవ్వేయడం, తీరం వెంబడి మెుక్కలు పెంచకపోవడం లాంటివన్నీ.. కోతకు కారణాలే. విశాఖలో పోర్టుల విస్తరణ, తీరం వెంబడి భారీ నిర్మాణాలు, ఇతర కట్టడాలతో.. సమతుల్యత దెబ్బతిని.. ఇసుక మేటలు వేయడం తగ్గిపోతూ.. బీచ్ భారీగా కోతకు గురవుతోంది.

విశాక తీరం కోతకు గురికాకుండా చేపట్టే చర్యలకు.. 120 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తం ఇచ్చేందుకు.. ప్రపంచ బ్యాంకు అధికారులు కూడా ముందుకొచ్చారు. అయితే.. డీపీఆర్ తయారుచేయాల్సి ఉన్నా.. అడుగులు ముందుకు పడట్లేదు. ఇక.. ఐక్యరాజ్యసమితిలో భాగమైన ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్.. ఐపీసీసీ కూడా దేశంలో సముద్ర మట్టాలు పెరిగే తీర ప్రాంతాలను అంచనా వేసింది. ఆ లిస్టులో.. విశాఖ కూడా ఉంది.

విశాఖ తీరప్రాంతం 32 కిలోమీటర్లుంటే.. ఇందులో 43 గ్రామాలున్నాయి. వీటిలో.. 16 గ్రామాలు అధికంగా కోతకు గురవుతున్నాయి. గత 30 ఏళ్లలో.. 430 ఇళ్లు తీరం కోతకు గురై.. సముద్రంలో కొట్టుకుపోయాయి. దీనిని అరికట్టకపోతే.. మున్ముందు మరింత ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. దీనిని నివారించాలంటే.. విదేశాల్లో మాదిరిగా బీచ్ గ్రోయిన్స్ నిర్మించాలి. డ్రెడ్జింగ్ చేసి కోతకు గురైన ప్రాంతాల్లో ఇసుకను వేయాలి. బీచ్‌ల్లో.. సరుగుడు, తాటి చెట్లు, మడ అడవులను పెంచాలి. ముంబై తీరంలో మాదిరిగా.. అలలు తీవ్ర వేగంతో ఒడ్డుకు తాకకుండా.. సిమెంట్ దిమ్మెలు వేస్తే.. కోతను అడ్డుకోవచ్చని చెబుతున్నారు.